Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో శుక్ర , శనివారం భారీ వర్షాలు
ABN , Publish Date - May 16 , 2025 | 07:30 AM
Rain Alert: ఉత్తర తమిళనాడుకు ఆనుకొని నైరుతి బంగాళాఖాతం, ఉత్తర కర్ణాటక పరిసరాల్లో వేర్వేరుగా ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతున్నాయి. ఈ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నాయి. శుక్ర, శనివారాలు ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
హైదరాబాద్: వాతావరణ శాఖ ముందుగా అంచనా వేసినట్లుగానే..అండమాన్ (Andaman) తీరాన్ని నైరుతీ రుతుపవనాలు (Southwest Monsoon) తాకాయి. ఈ నెలాఖరులోపు కేరళ (Kerala) తీరాన్ని తాకనున్నాయి. కాగా నాలుగు రోజుల ముందుగానే నైరుతీ రుతుపవనాలు వస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోకి (Telugu States) కూడా రుతుపవనాలు త్వరగానే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే వర్షాలు (Rains) కురుస్తున్నాయి. ఏపీ (AP), తెలంగాణ (Telangana)లో శుక్ర, శనివారాలు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
విజయవాడలో భారీ వర్షం..
విజయవాడలో గురువారం అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. పలు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్ల పైనా మోకాళ్ల లోతు వరకూ నీరు నిలిచిపోయింది. ఇంకా రాష్ట్రంలో పలుచోట్ల పిడుగులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిశాయి. కోనసీమ జిల్లా అమలాపురం, ఏలూరు జిల్లా నిడమర్రులో 54, కాకినాడ జిల్లా కాజులూరులో 42, అనకాపల్లి జిల్లా పాతవలసలో 41, కాకినాడ జిల్లా కరపలో 32.2, పిఠాపురంలో 31.7, అల్లూరి జిల్లా దళపతిగూడలో 31.5 మిల్లీమీటర్ల వర్షం పడింది. కాగా, వాయువ్య భారతం నుంచి వీచే పొడిగాలులతో కోస్తాలో పలుచోట్ల వడగాడ్పులు వీయడంతో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. మధ్యాహ్నం వరకూ వడగాడ్పులు, ఉక్కపోత కొనసాగాయి. బాపట్ల జిల్లా ఇంకొల్లులో 42.6, పల్నాడు జిల్లా వినుకొండ, నెల్లూరు జిల్లా దగదర్తిలో 42.5, ఎన్టీఆర్ జిల్లా ముచ్చినపల్లిలో 41.9, ప్రకాశం జిల్లా వేమవరంలో 41.7 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Also Read: కాల్పుల విరమణ కొనసాగింపు
రెండు రోజులు భారీ వర్షాలు..
రాష్ట్రంలో రెండు రోజులు (శుక్ర, శనివారాలు) 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలతో పాటు ఆకస్మికంగా పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. శుక్రవారం రాయలసీమలో అనేకచోట్ల, కోస్తాలో ఎక్కువ ప్రాంతాల్లో పిడుగులు, ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఎండ తీవ్రత, ఉక్కపోత కొనసాగుతాయని పేర్కొంది. అలాగే అల్లూరి, మన్యం, అనకాపల్లి, కాకినాడ, చిత్తూరు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, శ్రీకాకుళం, విజయనగరం, గుంటూరు, నంద్యాల, కర్నూలు, అనంతపురం, కడప, శ్రీసత్యసాయి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, మిగతా జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని తెలిపింది.
తెలంగాణలో దట్టమైన మేఘాలు.. వర్షాలు..
తెలంగాణలో దట్టమైన మేఘాలు ఉంటాయని, సాయంత్రం తర్వాత వర్షాలు చాలా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్నిచోట్ల భారీగా, కొన్ని చోట్ల మోస్తరుగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. హైదరాబాద్‌లో గురువారం రాత్రి భారీ వర్షం పడింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్, షేక్పేట్, గోల్కొండ, టోలిచౌకి, మెహిదీపట్నంలో వర్షం పడింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. రోడ్లపై ఎక్కడికక్కడ వర్షపు నీరు నిలిచిపోయింది. తెలంగాణలోని 12 జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు.
ఉరుములు, మెరుపులు, పిడుగులు..
ఏపీ, తెలంగాణ, యానాం, కోస్తాంధ్ర,రాయలసీమలో శనివారం వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఉరుములు, మెరుపులు, పిడుగులు పడతాయని, గాలి వేగం గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల ఉంటుందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
రూ.8,500 కోట్లతో ఇంటింటికీ కుళాయి
For More AP News and Telugu News