Share News

DA Pending: ఐదు డీఏలు ఇప్పించండి

ABN , Publish Date - May 16 , 2025 | 04:26 AM

ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం నియమించిన అధికారుల కమిటీ రెండో దఫా ఉద్యోగుల ఐకాసతో చర్చించింది.

DA Pending: ఐదు డీఏలు ఇప్పించండి

  • అప్పుడే ఉద్యోగుల్లో అలజడి తగ్గుతుంది.. ఉద్యోగులకు ఉపశమనం కలిగేలా సిఫార్సులు చేయండి

  • అధికారుల కమిటీకి ఐకాస విజ్ఞప్తి

హైదరాబాద్‌, మే15(ఆంధ్రజ్యోతి): ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం నియమించిన అధికారుల కమిటీ రెండో దఫా ఉద్యోగుల ఐకాసతో చర్చించింది. సచివాలయంలో గురువారం జరిగిన సమావేశంలో ఉద్యోగ సంఘాల తరఫున ఐకాస ఛైర్మన్‌ మారం జగదీశ్వర్‌, ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివా్‌సరావు.. పెండింగ్‌లో ఉన్న 5 డీఏలను తొలుత ఇప్పించాలని అధికారుల కమిటీకి ప్రతిపాదించారు. పెండింగ్‌ డీఏలపై ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకుంటే ఉద్యోగుల్లో కొంత అలజడి తగ్గుతుందని, ఆ మేరకు ఉద్యోగులకు ఉపశమనం కలిగించేలా ప్రభుత్వానికి సిఫార్సులు చేయాలని అధికారుల కమిటీకి విజ్ఞప్తి చేసినట్లు ఐకాస ప్రచార కార్యదర్శి శ్యామ్‌ తెలిపారు. ఆర్థిక పరమైన డిమాండ్లకు సంబంధించి ఉద్యోగుల బకాయిల విషయంలో తొలుత ఏది క్లియర్‌ చేయాలని నవీన్‌ మిత్తల్‌ ప్రశ్నించగా.. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు సంబంధించిన 5 ప్రయోజనాలలో జీపీఎఫ్‌, టీజీఎల్‌ఐలో ఏదో ఒకటి తొలుత ఇచ్చి.. ఆ తరువాత మిగిలినవి దశలవారీగా క్లియర్‌ చేయడానికి ఏదైనా అభ్యంతరం ఉందా అని ఉద్యోగులను అడిగారని చెప్పారు. దీనిపై ఉద్యోగ సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ.. 5 ప్రయోజనాలను ఒకే దఫా ఇవ్వాలని.. ఒక వేళ ప్రభుత్వానికి భారం అనిపిస్తే పదవీ విరమణ ఉద్యోగులకు ఇచ్చిన టోకోన్‌ నంబర్లలో సీనియారిటీని పరిగణలోకి తీసుకుని విడతలవారీగా ఇవ్వాలని సూచించారన్నారు. ఉద్యోగ సంఘాల నుంచి వచ్చిన మొత్తం ప్రతిపాదనలను క్రోడీకరించి త్వరలోనే నివేదికను మంత్రుల సబ్‌ కమిటీకి ఇస్తామని అధికారుల కమిటీ ఛైర్మన్‌గా ఉన్న నవీన్‌ మిత్తల్‌ హామీ ఇచ్చారన్నారు.


ఎన్నికల బదిలీలే ఏకైక ఎజెండా

రాష్ట్రంలో ఎన్నికల సమయంలో బదిలీ అయిన తహసీల్దార్లను, డిప్యూటీ తహసీల్దార్లను తిరిగి వారి పూర్వ స్థానాలకు బదిలీ చేయించేందుకు ప్రభుత్వంతో చర్చిస్తామని డిప్యూటీ కలెక్టర్ల సంఘం అధ్యక్షుడు వి.లచ్చిరెడ్డి అన్నారు. రెవెన్యూ ఉద్యోగులతో గురువారం ఆయన సమావేశం నిర్వహించారు. ఎన్నికల బదిలీల సమస్య పరిష్కారమే ఏకైక ఉమ్మడి ఎజెండాగా పని చేద్దామని పిలుపునిచ్చారు. సంప్రదాయబద్ధంగా జరిగే ఎన్నికల బదిలీలను ఇప్పుడు చేయించుకోలేకపోతే భవిష్యత్తులో మరెప్పుడూ వీలుకాదన్నారు. ఈ అవకాశాన్ని ఉద్యోగులు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. బదిలీల విషయాన్ని అధికారుల కమిటీ దృష్టికి కూడా తీసుకెళ్తానని ఉద్యోగులకు హామీ ఇచ్చారు.


తహసీల్దార్లు మళ్లీ పాత జిల్లాలకు..

ఎన్నికల సమయంలో బదిలీ అయిన తహసీల్దార్లను తిరిగి వారి పూర్వపు జిల్లాలకే బదిలీ చేస్తూ భూపరిపాలనా ప్రధాన కమిషనర్‌ నవీన్‌ మిత్తల్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. మల్టీజోన్‌-1 పరిధిలో 55 మంది ని, మల్టీజోన్‌-2 పరిధిలో 44మందిని ఎన్నికలకు ముందు వారు ఏజిల్లాల్లో పని చేసేవారో ఆయా జిల్లాలకు తిరిగి ప్రభుత్వం బదిలీ చేసింది. 2023అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 350మంది తహసీల్దార్లను ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రభుత్వం బదిలీ చేసింది. వారిలో 150 మంది తహసీల్దార్లు ఎన్నికల అనంతరం తమను మళ్లీపూర్వపు జిల్లాలకు బదిలీ చేయాలని కోరారు. దీంతో సీసీఎల్‌ఏ ఉత్తర్వులిచ్చింది.


ఈ వార్తలు కూడా చదవండి..

Rahul Gandhi: రాహుల్‌పై చర్యలకు రంగం సిద్ధం..

Abhinandan Vardhaman: అభినందన్ వర్థమాన్‌‌ను భారత్‌కి పాక్ ఆర్మీ అప్పగించిన తర్వాత ఏమైందంటే..

Supreme Court: సుప్రీంకోర్టులో సజ్జల భార్గవ్‌కు చుక్కెదురు

For Telangana News And Telugu News

Updated Date - May 16 , 2025 | 04:26 AM