Share News

Gannavaram Airport: గాలిలో విమానాలు చక్కర్లు.. భయాందోళనలో ప్రయాణికులు

ABN , Publish Date - Jul 20 , 2025 | 09:35 PM

గన్నవరంలో ఎడతెరపి లేకుండా భారీ వర్షం కురుస్తుంది. దీని తోడు భారీగా ఈదురుగాలులు వీస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్థానిక ఎయిర్ పోర్ట్‌లో విమానం ల్యాండింగ్‌కు ఏ మాత్రం అనుకూలించని పరిస్థితులు నెలకొన్నాయి.

Gannavaram Airport: గాలిలో విమానాలు చక్కర్లు.. భయాందోళనలో ప్రయాణికులు
indigo flight

విజయవాడ, జులై 20: ఉమ్మడి కృష్ణాజిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. గన్నవరంలో దాదాపు రెండు గంటలుగా ఎడతెరిపి లేకుండా కుండపోతగా వర్షం కురుస్తుంది. ఈ నేపథ్యంలో స్థానిక వాతావరణం పూర్తిగా మారిపోయింది. దాంతో గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో హైదరాబాద్ నుంచి వచ్చిన ఇండిగో విమానం ల్యాండ్ కావాల్సి ఉంది. కానీ వాతావరణం అనుకూలించక పోవడంతో.. సదరు విమానం గాలిలో చక్కర్లు కొడుతుంది.


అలాగే ఢిల్లీ నుంచి గన్నవరంలో దిగాల్సిన ఎయిర్ ఇండియా విమానం సైతం తిరువూరు, విస్సన్నపేట పరిసర ప్రాంతాల్లో గాలిలో చక్కర్లు కొడుతుంది. దీంతో విమానంలోని ప్రయాణికులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. వాతావరణం అనుకూలించకుంటే.. సదరు విమానాలను విశాఖపట్నం లేదా రాజమండ్రిలో ల్యాండ్ అయ్యేలా పౌర విమానయాన సంస్థ అధికారులు చర్యలు చేపట్టారు. అక్కడి వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయనే అంశంపై వారు ఆరా తీస్తున్నారు. ఈ రెండు ఎయిర్ పోర్టుల్లో ఎక్కడ వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నా.. అక్కడ వీటిని లాండింగ్ చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టినట్లు తెలుస్తుంది.


మరోవైపు ఇప్పటికే లండన్‌కు అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన కొన్ని సెకన్లకు ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలి దగ్ధమైంది. ఈ ఘటనలో వందలాది మంది ప్రయాణికులు మరణించారు. నాటి నుంచి విమాన ప్రయాణం అంటేనే మానవుడు భయపడిపోయే పరిస్థితి ఏర్పడింది. అలాంటి వేళ.. వాతావరణం ఏ మాత్రం అనుకూలించక పోవడంతో విమానాలు గాలిలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో విమానంలోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.


మరోవైపు.. తిరుపతి సమీపంలోని రేణిగుంట విమానాశ్రయం నుంచి ఆదివారం ఉదయం హైదరాబాద్ బయలుదేరి వెళ్లాల్సిన ఇండిగో విమాన సర్వీసును సాంకేతిక కారణాలతో రద్దు చేసినట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఈ సర్వీసు సాయంత్రం నడుపుతామని ప్రయాణికులకు హామీ ఇచ్చింది. దాదాపు 221 మంది ప్రయాణికులు ఈ సర్వీసు ద్వారా హైదరాబాద్ చేరుకోవాల్సి ఉంది.


ఆదివారం రాత్రి 7. 40 గంటలకు ఇండిగో విమాన సర్వీసును సంస్థ ఏర్పాటు చేసింది. అయితే ఈ విమానం టేకాఫ్ అయిన వెంటనే వాతావరణ పరిస్థితులు ఏ మాత్రం అనుకూలించక పోవడంతో.. విమానాన్ని రేణిగుంట ఎయిర్ పోర్ట్‌లో ల్యాండ్ చేశారు. దీంతో ఇండిగో సంస్థపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని ఉదయమే చెబితే.. తాము మరో ప్రత్యామ్నాయం ఏర్పాట్లు ద్వారా గమ్యస్థానానికి చేరుకునే వారమని ప్రయాణికులు వాపోతున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

తలసీమియా బాధితుల కోసం విశాఖలో రన్.. స్పందించిన సీఎం

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం

For More AndhraPradesh News And Telugu News

Updated Date - Jul 20 , 2025 | 09:51 PM