Devineni Uma: అబద్దాలతో కాలం గడిపిన జగన్: దేవినేని ఉమా
ABN , Publish Date - Nov 04 , 2025 | 09:18 PM
రైతు పరామర్శ పేరుతో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ అనుసరిస్తున్న వ్యవహార శైలిపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వైఎస్ జగన్ వ్యవహరించిన తీరును ఈ సందర్భంగా ఉమా ఎండగట్టారు.
విజయవాడ, నవంబర్ 04: రైతు పరామర్శ పేరుతో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ రెడ్డి డీజేలు పెట్టి పార్టీ జెండాలతో ఊరేగటానికే వచ్చాడంటూ మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వర రావు మండిపడ్డారు. రైతు కష్టంలో ఉంటే.. నేషనల్ హైవేపై టెంట్లు వేసుకుని రెడ్ కార్పెట్ మీద ఫొటోషూట్లు చేశాడంటూ జగన్ వైఖరిపై నిప్పులు చెరిగారు. మంగళవారం విజయవాడలో దేవినేని ఉమా విలేకర్లతో మాట్లాడుతూ.. మొంథా తుఫాను సమయంలో రైతుల కష్ట సమయంలో వారికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తోపాటు కూటమి ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు.
వైఎస్ జగన్ మాత్రం ప్యాలెస్‌లో పడుకున్నాడంటూ విమర్శించారు. గత ప్రభుత్వం పంటల బీమా సైతం ఇవ్వ లేదంటూ జగన్ నిర్వాకాన్ని కేంద్ర మంత్రి పార్లమెంట్లో ఎండగట్టిన విషయాన్ని ఈ సందర్భంగా దేవినేని ఉమా గుర్తు చేశారు. జగన్ హయాంలో 60 లక్షల ఎకరాల్లో వేల కోట్ల మేర పంట నష్టం జరిగితే.. కానీ పరిహారం లేదన్నారు. అన్ని విషయాల్లో అబద్ధాలే ఎక్కువ అంటూ మాజీ సీఎం జగన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రతిపక్షంలో చంద్రబాబు నేలపై కూర్చుని నీ మెడలు వంచి రైతుల కోసం రూ. 590 కోట్ల బీమా ప్రీమియం చెల్లించేలా చేశారన్నారు. కేంద్రం ఇచ్చిన రూ. 3, 600 కోట్లు కూడా రైతుల ఖాతాల్లో జమ చేయలేని నిర్వాకం జగన్‌దన్నారు. 2024–25లో కూటమి ప్రభుత్వం 7.65 లక్షల మంది రైతుల వద్ద నుంచి రూ.12,857 కోట్లకు ధాన్యం కొనుగోలు చేసి 24 గంటల్లో వారి ఖాతాల్లో నగదు జమ చేసిందని గుర్తు చేశారు.
అన్నదాత సుఖీభవ కింద రూ.3,174 కోట్ల నగదు రైతుల ఖాతాల్లో జమ చేశారని వివరించారు. త్వరలో రెండో విడత నిధులు కూడా రానున్నాయని పేర్కొన్నారు. ఉల్లి, పొగాకు, మామిడి, టమాట రైతులను కష్టకాలంలో ఆదుకున్న ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందన్నారు. జగన్ పాలనలో పోర్టల్‌లో కూడా తప్పుడు కోతలు, తప్పుడు డేటానే ఉందని విమర్శించారు. నేడు వచ్చి రైతు పరామర్శ పేరుతో కబుర్లు చెబుతున్నాడంటూ వైఎస్ జగన్ వైఖరిపై దేవినేని ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఐదేళ్ల వైసీపీ హయాంలో 9 విపత్తులు, రూ. 20 వేల కోట్ల నష్టం వచ్చిందన్నారు. కానీ రైతుల వద్దకు ఆయన వెళ్లలేదంటూ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వైఎస్ జగన్ వైఖరిని ఎండగట్టారు. అబద్ధాలతో కాలం గడిపాడంటూ జగన్‌పై మండిపడ్డారు. రైతులకు జగన్ బకాయిలుగా పెట్టిన రూ. 1,700 కోట్ల ధాన్యం నగదును కూటమి ప్రభుత్వం చెల్లించిందని గుర్తు చేశారు. దాన్యం నగదులో కక్కుర్తి పడి ప్యాలెస్‌కు గడ్డం గ్యాంగ్‌తో వైఎస్ జగన్ తరలించాడని పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
జగన్‌కు చురకలంటించిన నారా లోకేశ్
For More AP News And Telugu News