Pawan Reviews Cyclone Montha: యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టండి.. డిప్యూటీ సీఎం ఆదేశం
ABN , Publish Date - Oct 29 , 2025 | 09:46 AM
ఈదురు గాలులు, భారీ వర్షాల మూలంగా కలిగిన నష్టంపై డిప్యూటీ సీఎం వివరాలు తెలుసుకున్నారు. పలు ప్రాంతాల్లో చెట్లు విరిగిపడటంతో విద్యుత్ తీగలు పడటం, విద్యుత్ స్తంభాలు నేలకొరిగిన క్రమంలో వాటి పునరుద్ధరణను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని ఆదేశించారు.
అమరావతి, అక్టోబర్ 29: మొంథా తుపాను ఏపీని వణికిస్తోంది. తుపాను తీరం దాడటంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండి తుపాను ప్రభావిత ప్రాంత ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తోంది. ఇదిలా ఉండగా.. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిపై అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) సమీక్ష నిర్వహించారు. ఎప్పటికప్పుడు తన కార్యాలయ అధికారుల ద్వారా సమాచారం తెప్పించుకుంటున్నారు. డా.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల కలెక్టర్లతో డిప్యూటీ సీఎం పేషీ అధికారులు మాట్లాడారు. ఈదురు గాలులు, భారీ వర్షాల మూలంగా కలిగిన నష్టంపై డిప్యూటీ సీఎం వివరాలు తెలుసుకున్నారు.
పలు ప్రాంతాల్లో చెట్లు విరిగిపడటంతో విద్యుత్ తీగలు పడటం, విద్యుత్ స్తంభాలు నేలకొరిగిన క్రమంలో వాటి పునరుద్ధరణను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని ఆదేశించారు. తుపాను బలహీనపడ్డా భారీ వర్షాలు ఉన్నందున ప్రజలను సురక్షిత ప్రదేశాల్లోనే ఉంచాలని సూచించారు. పునరావాస కేంద్రాల్లో ఉన్నవారిని ఈ రోజు కూడా అక్కడే ఉంచి ఆహారం, వసతి కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రకాశం జిల్లాలో గుండ్లకమ్మ, నెల్లూరు జిల్లాలో పెన్నా నది, ఈ జిల్లాల్లో వాగులు పొంగి ప్రవహిస్తున్న క్రమంలో ప్రజలను అప్రమత్తం చేయాలని అన్నారు. వర్షాలు తగ్గు ముఖం పట్టిన తరవాత పారిశుద్ధ్య కార్యక్రమాలపై దృష్టిపెట్టాలన్నారు. రక్షిత తాగు నీరు సరఫరా చేసి ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాలని అధికారులను ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు.
ఇవి కూడా చదవండి...
అండగా ఉంటాం.. అభివృద్ధి చేస్తాం..
బలహీనపడుతున్న మొంథా తుఫాన్.. పలు చోట్ల భారీ వర్షాలు
Read Latest AP News And Telugu News