Coastal Impact: మొంథా బీభత్సం
ABN , Publish Date - Oct 29 , 2025 | 03:05 AM
తీవ్ర తుఫాన్ మొంథా బీభత్సం సృష్టించింది! హోరుగాలులు, జోరు వానలతో వణికించింది! మంగళవారం అర్ధరాత్రి తర్వాత తీరం దాటింది. ఈ సమయంలో 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచాయి.
7 జిల్లాల్లో కల్లోలం
గాలులు, వర్షాలతో కుదిపేసిన తుఫాన్
అర్ధరాత్రి సమయానికి తీరం దాటిన ‘ముప్పు’
బందరు వద్ద 100 కిలోమీటర్ల వేగంతో గాలులు
పలు తీర గ్రామాల్లో అలుముకున్న చీకట్లు
ప్రభావిత ప్రాంతాల్లో కుప్పకూలిన వృక్షాలు
గోదావరి జిల్లాల్లో చెట్లు కూలి ఇద్దరు మృతి.. నెల్లూరు జిల్లాలో వాగులో ఒకరి గల్లంతు
పలు జిల్లాల్లో పంటలను ముంచిన తుఫాను
కావలిలో 22, ఉలవపాడులో 17 సెం.మీ. వర్షం
రాష్ట్రంలో నేడూ కొనసాగనున్న భారీ వర్షాలు
పలు జిల్లాలకు ఆకస్మిక వరదల హెచ్చరిక
పునరావాస కేంద్రాలకు 75 వేల మంది
వేగంగా విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులు
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్)
తీవ్ర తుఫాన్ మొంథా బీభత్సం సృష్టించింది! హోరుగాలులు, జోరు వానలతో వణికించింది! మంగళవారం అర్ధరాత్రి తర్వాత తీరం దాటింది. ఈ సమయంలో 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచాయి. అప్పుడప్పుడు వాయువేగం 110 కిలోమీటర్లకూ చేరింది. తీవ్ర తుఫాన్ కారణంగా మంగళవారం తీర ప్రాంతమంతా రాకాసి అలలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. ప్రధానంగా ఏడు జిల్లాల్లో పెనుగాలులు బీభత్సం సృష్టించాయి. భారీ వృక్షాలు కూకటివేళ్లతో సహా కూలిపోయాయి. తీవ్ర గాలుల తీవ్రతకు కరెంటు స్తంభాలు పడిపోవడంతో కృష్ణా జిల్లా తీర ప్రాంతమంతా అంధకారం అలుముకుంది. తుఫాన్ ప్రభావంతో కోస్తాలోని అనేక ప్రాంతాల్లో భారీవర్షాలు కురుస్తున్నాయి. ఇవి బుధవారం తెల్లవారుజాము వరకూ కొనసాగుతాయి. శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం, పశ్చిమ గోదావరి నుంచి నెల్లూరు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తాయని హెచ్చరిక జారీచేశారు. కోస్తా జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ మెసేజ్ జారీచేసింది.
కడలి కల్లోలం...
మంగళవారం మధ్యాహ్నం వరకు ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. కమ్ముకొచ్చిన మేఘాలతో చీకట్లు అలుముకున్నాయి. వానకు గాలులు కూడా తోడయ్యాయి. తుఫాన్ ప్రభావంతో సముద్ర తీర ప్రాంతాల్లో 50 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో వీసిన గాలులతో తీరప్రాంతవాసులు భయాందోళనకు గురయ్యారు. గాలులకు చాలాప్రాంతాల్లో భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉండటంతో శ్రీకాకుళం జిల్లాపై తుపాను తీవ్ర ప్రభావం చూపింది. మంగళవారం జిల్లా అంతటా వర్షం కురుస్తూనే ఉంది. ఒడిశా నుంచి వస్తున్న వరదతో మహేంద్రతనయ, బహుదా, వంశధార, నాగావళి నదులు ఉధృతంగా ప్రవహించాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో గెడ్డలు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. విజయనగరం జిల్లా అంతటా ఎడతెరిపి లేకుండా వానలు పడుతున్నాయి.
దక్షిణ కోస్తాలో..
ఒకవైపు ఈదురు గాలులు, మరోవైపు ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలతో ప్రకాశం జిల్లా ఒంగోలుతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయి. గుండ్లకమ్మ ప్రాజెక్టుకు 6వేల క్యూసెక్కులు వరద వస్తుండగా 4గేట్లు ఎత్తి దిగువకు వదులుతున్నారు. బాపట్ల జిల్లాలో నిజాంపట్నం దగ్గర సముద్రం 150 మీటర్లు ముందుకొచ్చింది.
తీరం దాటిన చోట గందరగోళం
మొంథా తుఫాను నిర్దిష్టంగా ఎక్కడ తీరాన్ని తాకింది... ఎక్కడ దాటిందనే అంశంపై పలురకాల అంచనాలు వెలువడ్డాయి. అది కాకినాడకు దక్షిణాన మచిలీపట్నం-కళింగపట్నం మధ్య యానాం వద్ద తీరాన్ని తాకినట్లు విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం స్పష్టం చేసింది. యానాం- నర్సాపురం మధ్య అంతర్వేది సమీపంలో తీరం దాటిందని కొందరు చెబుతుండగా... మచిలీపట్నం - హంసలదీవి మధ్య తీవ్ర తుఫాన్ తీరం దాటిందని మరొకరు చెప్పారు. మొత్తానికి... మంగళవారం రాత్రి ఎనిమిది గంటలకు తుఫాను తీరాన్ని తాకింది. ఆ తర్వాత కొన్ని గంటలపాటు తీరాన్ని దాటే ప్రక్రియ కొనసాగింది.
నేడూ భారీ వర్షాలు...
మొంథా తుఫాన్ తీరం దాటిందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. కాకినాడకు 90 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 90 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 220 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన తీవ్ర తుఫాన్ క్రమంగా బలహీన పడుతుందని తెలిపింది. దీని ప్రభావంతో బుధవారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు; ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని సూచించింది.
22 జిల్లాలు..403 మండలాలు
తుఫాన్ ప్రభావంపై ప్రభుత్వ అంచనా
అమరావతి, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రవ్యాప్తంగా 22 జిల్లాల్లోని 403 మండలాలపై మొంథా తుఫాన్ ప్రభావం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దానికి తగినట్టే చర్యలు తీసుకుంటున్నారు. అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, కర్నూలు జిల్లాలను మినహాయిస్తే తక్కిన రాష్ట్రమంతా ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 1,204 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. 75,802 మందిని ఈ కేంద్రాలకు తరలించారు. తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా 38వేల హెక్టార్లలో పంట నీట మునిగిందని ప్రాథమికంగా అంచనా. 1.38లక్షల హెక్టార్ల ఉద్యాన పంటలు కూడా ప్రభావితం అయినట్లు ప్రభుత్వం అంచనా వేసింది.
తిరుమలలో ఎడతెరిపిలేని వర్షం
తిరుమల, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): మొంథా తుఫాన్ ప్రభావంతో తిరుమలలో మంగళవారం ఒకవైపు ఎడతెరిపిలేని వర్షం, మరోవైపు చలిగాలులతో భక్తులు అవస్థలు పడ్డారు. వేకువజాము నుంచి అర్ధరాత్రి వరకు ఈదురుగాలులతో వాన కురిసింది. వానల వల్ల భక్తుల రద్దీ కూడా తగ్గింది. దర్శనం కోసం 18 కంపార్టుమెంట్లలోనే భక్తులు వేచిఉన్నారు. వీరికి టీటీడీ వేడివేడి అన్నప్రసాదాలు, పాలు అందిస్తోంది. తిరుమలలో స్థానికులు నివాసముండే బాలాజీనగర్ మూడోలైన్‌లో గాలులకు ఓ భారీ వృక్షం పక్కనే ఉన్న ఇళ్లపై వాలిపోయింది. రెండు ఇళ్లు స్వల్పంగా దెబ్బతిన్నాయి. ఈస్ట్‌బాలాజీనగర్‌లో ఓ చెట్టు కారుపై కూలింది.
సింహగిరి మెట్ల మార్గం మూసివేత
సింహాచలం, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): భారీ వర్షాల కారణంగా సింహగిరి మెట్ల మార్గంలో భక్తుల రాకపోకలను నిలిపివేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దీనికోసం కొండదిగువన తొలిపావంచా వద్ద, సింహగిరిపై మెట్ల ప్రారంభంలో బారికేడ్లు ఏర్పాటుచేశారు. మెట్లమార్గంలో భారీగా వర్షం నీరు ప్రవహిస్తుండడంతో భక్తులు ప్రమాదాల బారినపడకుండా ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు తెలిపారు. వర్షాలతో సింహగిరి జలకళ సంతరించుకుంది.