Montha Cyclone: బలహీనపడుతున్న మొంథా తుఫాన్.. పలు చోట్ల భారీ వర్షాలు
ABN , Publish Date - Oct 29 , 2025 | 08:58 AM
శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు.
అమరావతి: మొంథా తుఫాన్ క్రమంగా బలహీనపడుతున్నట్లు ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రానున్న 6 గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. దీని ప్రభావంతో ఇవాళ(బుధవారం) రాష్ట్రంలో విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పింది. కోస్తాంధ్రలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.
అలాగే.. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ప్రకాశం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు హెచ్చరిస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఏవైనా సమస్యలు తలెత్తితే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
మరోవైపు నిన్న(మంగళవారం) రాత్రి కాకినాడ జిల్లా పిఠాపురం, గొల్లప్రోలు మండలాల్లో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. దీంతో అర్ధరాత్రి రెండు గంటల నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్లు తెలుస్తోంది. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు కూలి.. కరెంటు తీగలు తెగినట్లు సమాచారం. కాగా, జిల్లాలో సుద్దగడ్డ వరద ఉధృతి పెరుగుతోంది. దీంతో ఏలేరు.. నీటి తాకిడికి గట్లు కోతకు గురవుతున్నాయి. తుఫాన్ కారణంగా ఇప్పటికే.. 400 ఎకరాల అరటి, 190 ఎకరాల మొక్కజొన్న, 1500 ఎకరాల పత్తి పంటలకు నష్టం వాటిల్లిందని రైతులు కన్నీళ్ల పర్యంతమవుతున్నారు.
ఇవి కూడా చదవండి..
United Aircraft Corporation: భారత్‌లో పౌర విమానాల తయారీ
Lufthansa Flight Incident: లుఫ్తాన్సా విమానంలో ఘర్షణ