Montha Cyclone: 7 జిల్లాలపై పంజా
ABN , Publish Date - Oct 29 , 2025 | 04:08 AM
రాష్ట్రంలోని ఏడు తీర ప్రాంత జిల్లాలపై మొంథా తుఫాన్ పంజావిసిరింది. ప్రచండ వేగంతో వీచిన పెనుగాలులు, భారీవర్షాలతో బీభత్సం సృష్టించింది.
పెనుగాలులు, భారీ వర్షాలతో అల్లకల్లోలం
విద్యుత్తు సరఫరా లేక అంధకారంలో గ్రామాలు
ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్: రాష్ట్రంలోని ఏడు తీర ప్రాంత జిల్లాలపై మొంథా తుఫాన్ పంజావిసిరింది. ప్రచండ వేగంతో వీచిన పెనుగాలులు, భారీవర్షాలతో బీభత్సం సృష్టించింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అప్పటికప్పుడు కుంభవృష్టి పడటం, ఆ తర్వాత పెనుగాలులు విరుచుకుపడడం, మళ్లీ కాసేపటికి ఒక్కసారిగా తీవ్రంగా ఎండ కాయడం.. ఇలా గంటకో రకంగా వాతావరణం మారిపోతూ జనాన్ని హడలెత్తించింది. గతంలో ఏ తుఫాన్ సమయంలోనూ లేనంతగా ఉప్పాడ వద్ద సముద్రం విలయ తాండవం చేసింది. భారీ శబ్దాలతో 10 మీటర్లకు పైగా ఎత్తులో కెరటాలు ఎగసిపడటంతో కాకినాడ-ఉప్పాడ బీచ్ రోడ్డులో 10 కిలోమీటర్ల మేర పరిస్థితి భయానకంగా మారింది.
కోనసీమ జిల్లాలో గంటకు 80 కిలోమీటర్లకు మించిన వేగంతో గాలులు విరుచుకుపడ్డాయి. భారీ వృక్షాలు, వేలాది కొబ్బరి చెట్లు కూలిపోయాయి. విద్యుత్ వైర్లు తెగిపోవడంతో మధ్యాహ్నం నుంచి జిల్లావ్యాప్తంగా కరెంటు సరఫరా నిలిచిపోయింది. సాయంత్రం నుంచి రహదారులపై రాకపోకలను నిలిపివేసినట్టు అధికారులు ప్రకటించారు. తుఫాన్ తీవ్రత అధికంగా ఉండడంతో కాకినాడ పోర్టులో పదో నెంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కాకినాడ, కోనసీమ జిల్లాల్లో వేలాది చెట్లు నేలకొరగడంతో రాత్రి 7గంటల వరకు సాధ్యమైనన్ని తొలగించి వైద్యుత్ లైన్లు సరిచేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా వర్తక, వాణిజ్య, వ్యాపార సంస్థలు మూతపడ్డాయి.
వివాఖలో... మొంథా తుఫాన్ విశాఖపట్నం జిల్లాపై తీవ్ర ప్రభావం చూపించింది. ఎక్కడికక్కడ చెట్లు మొదళ్లతో సహా నేలకు ఒరిగిపోయాయి. కొన్నిచోట్ల చెట్లు పడి కార్లు ధ్వంసమయ్యాయి. బీచ్ రోడ్డులో సీతకొండపైనుంచి బండరాళ్లు జారి పడ్డాయి. వర్షాలకు కొండలపై నుంచి నీటితోపాటు కొండచిలువ కూడా కొట్టుకురావడంతో ఆరిలోవలో కలకలం రేగింది.
కృష్ణాలో పెనుగాలులతో భారీ వర్షం
కృష్ణాజిల్లాలో మొంథా బీభత్సం సృష్టించింది. తీరప్రాంతంలో పెనుగాలులతో కూడిన భారీవర్షం కురిసింది. బలమైన గాలులధాటికి రహదారులపై వృక్షాలు విరిగి పడి రాకపోకలు నిలిచిపోయాయి. సము ద్రం అల్లకల్లోలంగా మారింది. 2 నుంచి 3 మీటర్ల మేర అలలు ఎగసిపడ్డాయి. మంగినపూడి బీచ్ వద్ద సముద్రం 300 మీటర్లు ముందుకొచ్చింది. 165 పునరావాస శిబిరాల్లో 6,618 మందికి ఆశ్రయం కల్పించారు. మంగళవారం రాత్రి కృష్ణాజిల్లాలోని తీర ప్రాంతంలో చాలావరకూ విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో చీకట్లు అలముకున్నాయి. ఎన్టీఆర్ జిల్లాలో పెద్దగా తుఫాన్ ప్రభావం కనిపించలేదు.
వణికిన ‘పశ్చిమ’
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాపై మొంథా తుఫాన్ విరుచుకుపడింది. పెనుగాలులతో తీరప్రాంతాన్ని వణికించింది. నర్సాపురం, మొగల్తూరు, యలమంచిలి, కాళ్ల మండలాల్లో భారీ వృక్షాలు కూకటివేళ్లతో సహా నేలకొరిగాయి. పశ్చిమలో మంగళవారం ఉదయం నుంచి కుండపోత వర్షం కురిసింది. సాయంత్రానికి గాలుల తీవ్రత మరింత పెరిగింది. రాత్రి 7.30 గంటల నుంచి పరిస్థితి భయానకంగా మారింది. సముద్రం అల్లకల్లోలంగా మారి 100 మీటర్లు ముందుకు చొచ్చుకొచ్చింది. అలలు ఎగసిపడుతుండటంతో పీఎం లంక వద్ద గట్టు కోతకు గురైంది. అలల హోరుకు తీర ప్రాంత ప్రజలు భయంతో బిక్కుబిక్కుమంటూ గడిపారు. గాలులకు పలుచోట్ల భారీ వృక్షాలు, విద్యుత్తు స్తంభాలు నేలకొరిగాయి. కరెంటు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇక ఏలూరు జిల్లాలో మంగళవారం ఉదయం నుంచి ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. కైకలూరు మండలంలో కొల్లేరు వరద ఉధృతి పెరిగింది. ఈ జిల్లాలో ఏర్పాటు చేసిన 82 పునరావాస కేంద్రాలకు ముంపు ప్రాంతాల ప్రజలను తరలించారు.
ఇవి కూడా చదవండి..
ఎంసీడీ వార్డుల్లో ఉపఎన్నికలను ప్రకటించిన ఈసీ
ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఎయిరిండియా బస్సు దగ్ధం