CM Chandrababu: రైతన్నల్లారా.. సమస్యలన్నీ పరిష్కరిస్తాం: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Nov 29 , 2025 | 04:14 PM
రాజధాని అమరావతి రైతుల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. పనుల కోసం ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే రాజధాని రైతుల నుంచి సిబ్బంది డబ్బులు అడిగితే చర్యలు తప్పవని హెచ్చరించారు.
అమరావతి, నవంబర్ 29: రాష్ట్రంలో మూడు ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నామని.. ఇందుకు అనుగుణంగా 3 ప్రాంతీయ జోన్లు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) తెలిపారు. శనివారం నాడు మీడియాతో సీఎం ఇష్టాగోష్టి నిర్వహించారు. అభివృద్ధి ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాకుండా అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు. రాజధాని రైతులంతా ఇక ఒకే గొడుగు కిందకు రావాలని పిలుపునిచ్చారు. అమరావతి ప్రాంత అభివృద్ధి అసోసియేషన్ కింద అంతా ఒకే జేఏసీగా ఏర్పడితే వారితో సంప్రదిస్తూ అన్ని సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. రాజధాని రైతులు కోరిన క్యాపిటల్ గెయిన్స్ మినహాయింపు గురించి కేంద్ర ఆర్థిక మంత్రికి వివరించామని.. కేంద్రంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారని తెలిపారు.
రాష్ట్ర పరిధిలో ఉన్న సమస్యలన్నీ దశలవారీగా పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. పనుల కోసం ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లే రాజధాని రైతుల నుంచి సిబ్బంది డబ్బులు అడిగితే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. భూ త్యాగాలు చేసిన రైతుల సమస్యలు పరిష్కరించకుండా డబ్బులు డిమాండ్ చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. సీఆర్డీఏ అధికారులు, సిబ్బందిపై వస్తున్న ఫిర్యాదులపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రంలో అవినీతి నిర్మూలనకు ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. త్వరలోనే ఆ దిశగా కార్యచరణ రూపొందిస్తామని ప్రకటించారు. రైతు సమస్యల పరిష్కారంలో తొలుత కొంత గ్యాప్ వచ్చిందని.. అయితే తనతో సమావేశం తర్వాత అన్నింటిపైనా స్పష్టత వచ్చిందని వెల్లడించారు.
రైతులు కూడా ఆనందంగా ఉన్నారన్నారు. రెండో దశ భూ సమీకరణ ఉపయోగాలపై రైతులకు వివరించినట్లు చెప్పారు. మునిస్పాలిటీగా అమరావతి మిగిలిపోకుండా మహానగరంగా అభివృద్ధి చెందితే ఎలాంటి ఫలితాలు ఉంటాయో రైతులు అర్థం చేసుకున్నారన్నారు. త్రిసభ్య కమిటీ నిరంతరం రైతులతో సంప్రదింపులు జరుపుతోందన్నారు. రాజధాని అభివృద్ధి ఇక అన్ స్టాపబుల్ అని స్పష్టం చేశారు. రాజధాని చుట్టపక్కల ప్రాంతాల్లో లేఅవుట్లకు అనుమతుల సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. గోదావరి పుష్కరాల నాటికి పోలవరం పూర్తి చేసే దిశగా కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
కాగా.. టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌కు చేరుకున్న సీఎం.. ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. అలాగే కొందరికి అక్కడికక్కడే పరిష్కారాలు చూపారు. సీఎంకు వినతులు ఇచ్చేందుకు భారీగా ప్రజలు తరలివచ్చారు. దీంతో ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా కార్యాలయ సిబ్బంది సీటింగ్ ఏర్పాటు చేశారు. సీఎం చంద్రబాబు ఎంతో ఓపిగ్గా ఒక్కొక్కరి వద్దకు వెళ్లి సమస్య తెలుసుకుని పరిష్కారానికి హామీ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి..
ఆ జిల్లాలను అలర్ట్ చేయండి... దిత్వా తుఫానుపై అధికారులతో హోంమంత్రి
పరకామణి కేసు.. త్వరలోనే దుష్ట చతుష్టయం జైలుకెళ్లడం ఖాయం: పట్టాభి
Read Latest AP News And Telugu News