CM Chandrababu Reacts Fire Accident: బాధిత కుటుంబాలను ఆదుకుంటాం.. అగ్నిప్రమాదంపై సీఎం
ABN , Publish Date - Oct 08 , 2025 | 02:39 PM
ప్రమాద కారణాలు, ప్రస్తుత పరిస్థితి, సహాయక చర్యలు, వైద్య సాయంపై అధికారులతో మాట్లాడినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. స్వయంగా సంఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొనాలని ఉన్నతాధికారులను ఆదేశించామన్నారు.
అమరావతి, అక్టోబర్ 8: అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాయవరంలో బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాద ఘటన కలచి వేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా సీఎం స్పందిస్తూ.. ఈ ఘోర ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర ఆవేదన కలిగించిందన్నారు. ప్రమాద కారణాలు, ప్రస్తుత పరిస్థితి, సహాయక చర్యలు, వైద్య సాయంపై అధికారులతో మాట్లాడినట్లు తెలిపారు. స్వయంగా సంఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొనాలని ఉన్నతాధికారులను ఆదేశించామన్నారు.
క్షతగాత్రులకు మెరుగైన వైద్య సాయం అందించాలని సూచించామని.. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇస్తూ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు.
ఈ విషాద ఘటనపై సీఎం చంద్రబాబుతో పాటు రాష్ట్ర మంత్రులు స్పందిస్తూ.. విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కోనసీమ జిల్లాలో అగ్నిప్రమాదంపై హోం మంత్రి అనిత స్పందించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మంటలు అదుపులోకి వచ్చాయన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను హోం మంత్రి అనిత ఆదేశించారు.
మంత్రి అచ్చెన్న దిగ్భ్రాంతి
అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాయవరంలో బాణసంచా తయారీ కేంద్రంలో అగ్నిప్రమాద ఘటనపై మంత్రి అచ్చెన్నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటన గురించి జిల్లా అధికారులతో మాట్లాడారు మంత్రి. ప్రమాదంలో పలువురు చనిపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. మృతులు, గాయపడిన వారిపై అధికారులు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ప్రమాదానికి గురైన కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. గాయపడిన బాధితులకు మెరుగైన వైద్యం అందచేయాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు.
మృతుల కుటుంబాలకు సంతాపం: మంత్రి సుభాష్
కోనసీమ అగ్నిప్రమాదంపై మంత్రి వాసం శెట్టి సుభాష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాయవరంలోని బాణసంచా ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. గాయపడిన వారికి అత్యుత్తమ వైద్యం అందించాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అధికారులతో ఫోన్లో మాట్లాడిన మంత్రి.. సహాయ చర్యల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రమాద కారణాలపై పూర్తి స్థాయి వివరాలు ఇవ్వాలని మంత్రి సుభాష్ ఆదేశించారు. భద్రతా నిబంధనల అమలుపై దృష్టి పెట్టాలని సూచించారు. ఇటువంటి ఘటనలు పునరావృత్తం కాకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి వాసంశెట్టి సుభాష్ వెల్లడించారు.
ఇవి కూడా చదవండి...
హద్దు మీరితే తోక కట్ చేస్తాం.. వైసీపీకి గంటా వార్నింగ్
జగన్ పర్యటనకు నిబంధనలు.. పున: సమీక్షించాలన్న మాజీ మంత్రి
Read Latess AP News And Telugu News