Valmiki Jayanti 2025: వాల్మీకి స్మరణ.. పూర్వ జన్మ సుకృతం: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Oct 07 , 2025 | 10:38 AM
సంస్కృతంలో ఆదికవి, పవిత్ర రామాయణ ఇతిహాస రచయిత, మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా సకల జనులకు శుభాకాంక్షలు తెలియజేశారు సీఎం చంద్రబాబు. జ్ఞానం సముపార్జనకు పరిమితిలేదని నిరూపించిన మహనీయుడు వాల్మీకి మహర్షి అని అన్నారు.
అమరావతి, అక్టోబర్ 7: వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా సీఎం స్పందిస్తూ.. సృష్టి ఉన్నంత కాలం వాల్మీకి జీవితం స్పూర్తిని ఇస్తూనే ఉంటుంది. జ్ఞానం సముపార్జనకు పరిమితిలేదని నిరూపించిన మహనీయుడు వాల్మీకి మహర్షి అని సీఎం చంద్రబాబు కొనియాడారు.
చంద్రబాబు ట్వీట్..
‘సంస్కృతంలో ఆదికవి, పవిత్ర రామాయణ ఇతిహాస రచయిత, మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా సకల జనులకు శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. జ్ఞానం సముపార్జనకు పరిమితిలేదని నిరూపించిన మహనీయుడు వాల్మీకి మహర్షి. పరిస్థితుల ప్రభావం కారణంగా కిరాతకుడిగా వ్యవహరించినా తపస్సుతో మహనీయుడుగా మారి ప్రపంచానికే జ్ఞాన జ్యోతిని చూపించిన కారుణ్యమూర్తి ఆయన. మహర్షి వాల్మీకి జీవితం ఈ సృష్టి ఉన్నంత కాలం స్ఫూర్తినిస్తూనే ఉంటుంది. ఆచంద్రతారార్కం నిలబడిపోయే మహర్షి వాల్మీకి కీర్తిప్రతిష్టల్ని ఆయన జయంతి సందర్భంగా స్మరించుకోవడం మన పూర్వజన్మ సుకృతం’ అంటూ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు.
ఆ మహనీయునికి ఘన నివాళి: మంత్రి బీసీ జనార్దన్
వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. రామాయణ మహాకావ్యాన్ని మానవాళికి అందించిన మహనీయుడు వాల్మీకి మహర్షి అని అన్నారు. వాల్మీకి మహాకవి విరచిత రామాయణ ఇతిహాసం.. సదా అనుసరణీయం.. ఆదర్శప్రాయమన్నారు. అఖండ భారతావనికి ఆదర్శప్రాయుడై నిలిచిన.. లోకభిరాముని దివ్యచరితను లోకొత్తరం చేసిన ఆదికవి వాల్మీకి మహర్షి అని తెలిపారు. కృషి ఉంటే మనుషులు.. రుషులవుతారు.. మహాపురుషులవుతారన్న మాటలకు వాల్మీకి మహర్షి జీవితం ఒక ప్రత్యక్ష నిదర్శనమని చెప్పుకొచ్చారు. ఆ మహనీయునికి ఘన నివాళిగా రాష్ట్ర పండుగగా వాల్మీకి జయంతిని నిర్వహించిన ఘనత కూటమి ప్రభుత్వానిదే అని మంత్రి బీసీ జానర్దన్ రెడ్డి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
అంబేద్కర్ విగ్రహానికి నిప్పు ఘటన.. వైసీపీ సర్పంచ్ అరెస్ట్
Nellore Murders: నెల్లూరులో జంట హత్యల కలకలం
Read Latest AP News And Telugu News