CM Chandrababu: యాసిడ్ దాడి ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్.. చెల్లికి అండగా ఉంటానన్న లోకేష్
ABN , Publish Date - Feb 14 , 2025 | 01:01 PM
CM Chandrababu: యువతిపై యాసిడ్ దాడి ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.

అమరావతి, ఫిబ్రవరి 14: అన్నమయ్య జిల్లాలో యువతిపై ప్రేమోన్మాది యాసిడ్ దాడి ఘటనను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. నిందితునిపై కఠిన చర్యలకు ఆదేశించారు సీఎం. అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం ప్యారంపల్లె గ్రామంలో యువతిపై ప్రేమోన్మాది యాసిడ్ దాడి చేశారు. దీనిపై సీఎం స్పందిస్తూ నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బాధిత యువతికి మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే బాధిత యువతికి, ఆమె కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు.
బాధితురాలి తండ్రికి మంత్రి లోకేష్ ఫోన్..
అలాగే యాసిడ్ దాడి ఘటనపై మంత్రి లోకేష్ స్పందించారు. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించి అండగా నిలుస్తామని తెలిపారు. యాసిడ్ దాడికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని అన్నారు. యాసిడ్ బాధితురాలి తండ్రి జనార్ధన్‌కు మంత్రి లోకేష్ ఫోన్ చేశారు. బాధితురాలి ఆరోగ్యంపై వాకబు చేశారు. ‘‘చెల్లి కోలుకోవడానికి అత్యంత మెరుగైన వైద్యం అందిస్తాం. ఆమెను నా సొంత చెల్లిగా భావించి అండగా నిలుస్తా. యాసిడ్ దాడి ఘటన నన్ను తీవ్ర ఆందోళనకు గురి చేసింది. దాడి చేసిన ఉన్మాదిని కఠినంగా శిక్షిస్తాం. అలాంటి సైకోలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించం. అధైర్య పడొద్దు, మీ వెంట నేనున్నాను’’ అని మంత్రి భరోసా ఇచ్చారు. అక్కడే ఉన్న మంత్రి మండుపల్లి రాంప్రసాద్‌తో కూడా లోకేష్ మాట్లాడారు. గౌతమి కోలుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. ఆమె వైద్యానికి సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించాల్సిందిగా మంత్రి రాంప్రసాద్‌కు మంత్రి లోకేష్ సూచనలు చేశారు.
వైసీపీకి బిగ్ షాక్.. కీలక నేతపై కేసు నమోదు
హోంమంత్రి అనిత స్పందన..
అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలంలో యువతిపై యాసిడ్ దాడి ఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. ప్యారంపల్లెకు చెందిన బాధితురాలి ఆరోగ్యపరిస్థితిపై ఆరా తీశారు. యువతి కుటుంబసభ్యులతో వీడియో కాల్‌లో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు హోంమంత్రి. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. యాసిడ్ దాడికి పాల్పడిన ఉన్మాదిని వెంటనే అరెస్టు చేయాలని పోలీసు అధికారులకు హోంమంత్రి అనిత ఆదేశించారు.
కాగా..ప్రేమించలేదనే కారణంగా యువతిపై ప్రేమోన్మాది యాసిడ్‌తో దాడికి పాల్పడటం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. బ్యూటిషియన్‌గా చేస్తున్న గౌతమి అనే యువతిపై గౌతమ్ యాసిడ్‌తో దాడి చేశాడు. ముందుగా యువతికి బలవంతంగా యాసిడ్ తాగించిన ప్రేమోన్మాది.. ఆపై ఆమె మొహంపై యాసిడ్ పోశాడు. తీవ్రంగా గాయపడిన యువతిని మదనపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమంగా ఉండటంతో బెంగూరుకు తరలిస్తున్నారు కుటుంబసభ్యులు. కాగా.. యువతిపై యాసిడ్ దాడి చేసిన యువకుడు ప్రీప్లాన్డ్‌గా పురుగులు మందు తాగి మదనపల్లి ఆస్పత్రికిలో చేరాడు. దీంతో నిందితుడు తప్పించుకోకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
ఇవి కూడా చదవండి...
వేలంటైన్స్ డే స్పెషల్ ... లవ్ స్టార్స్
కళ్యాణ మంటపంలోకి చొరబడిన చిరుత.. చివరకు..
Read Latest AP News And Telugu News