CM Chandrababu Naidu: పొట్టి శ్రీరాములు ఆత్మార్పణతో రాష్ట్రం రగిలిపోయింది: సీఎం
ABN , Publish Date - Dec 15 , 2025 | 07:02 PM
తెలుగు జాతి కోసం పొట్టి శ్రీరాములు పోరాడారని సీఎం చంద్రబాబు తెలిపారు. ఆయన ఆత్మార్పణంతో రాష్ట్రం రగిలిపోయిందని గుర్తు చేశారు.
విజయవాడ, డిసెంబర్ 15: రాజధాని అమరావతిలో పొట్టి శ్రీరాములు స్మృతివనం ఏర్పాటు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అందుకోసం 6.8 ఎకరాల భూమి కేటాయించామని చెప్పారు. అందులో 58 అడుగుల ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు వర్థంతి సందర్భంగా సోమవారం విజయవాడలోని తుమ్మలపల్లి వారి కళా క్షేత్రంలో ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. తెలుగు జాతి కోసం పొట్టి శ్రీరాములు పోరాడారని తెలిపారు. ఆయన ఆత్మార్పణంతో రాష్ట్రం రగిలిపోయిందని గుర్తు చేశారు. 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేశారన్నారు. పొట్టి శ్రీరాములకు గుర్తింపు తెచ్చిన పార్టీ ఎన్టీఆర్ అని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. 1985లోనే నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్‌లోని తెలుగు యూనివర్సిటీకి పొట్టి శ్రీరాములు పేరు పెట్టారన్నారు.
2003, మార్చి 10వ తేదీన ఆయన జన్మించిన నెల్లూరు జిల్లాకు పొట్టి శ్రీరాములు జిల్లాగా మార్చామని వివరించారు. చెన్నైలో ఆయన ఆత్మార్పణ చేసిన భవనాన్ని సంరక్షించాలని నిర్ణయించాం. ఈ భవనాన్ని భావితరాలకు గుర్తుండేలా దానిని స్మారకంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. పొట్టిశ్రీరాములు ఒక కులానికి చెందిన వ్యక్తి కాదని.. ఆయన తెలుగు ప్రజల ఆస్తి, సెంటిమెంట్, గుండె చప్పుడు అని సీఎం చంద్రబాబు అభివర్ణించారు. తెలుగు జాతిని నెంబర్1గా నిలబెట్టినప్పుడే పొట్టిశ్రీరాములకు నిజమైన నివాళి అని పేర్కొన్నారు. మరో 22ఏళ్లలో తెలుగుజాతి నెంబర్ వన్‌గా నిలిచి తీరుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
సంపద సృష్టించటానికి ఏకైక విధానం పీపీపీ అని చెప్పారు. పీపీపీపై వైసీపీ అనవసర రాజకీయం చేస్తోందంటూ మండిపడ్డారు. పీపీపీ అంటే ప్రభుత్వ ఆస్తి అని గుర్తించాలంటూ ఆ పార్టీ నేతలను సూచించారు. పీపీపీ మెరుగైన విధానం అని కేంద్రం కూడా స్పష్టం చేసిందని చెప్పారు. భావితరాల కోసం సంపద సృష్టించి ఆదాయం పెంచేందుకే పీపీపీ పద్దతిలో వివిధ ప్రాజెక్టులు తెస్తున్నామని చెప్పారు.
గత ప్రభుత్వం తెచ్చిన మూడు రాజధానులు విధానం మహా కుట్ర అని తెలిపారు. రాష్ట్ర రాజధాని ఏదీ అంటే చెప్పుకోలేని పరిస్థితి తెచ్చి అపహాస్యం చేశారంటూ వైసీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు ఏపీ రాజధాని అమరావతి అని గర్వంగా చెప్పుకుంటున్నామన్నారు. మూడు ప్రాంతాలను అభివృద్ధి చేసి తెలుగు జాతిని అగ్రస్థానంలో నిలబెడతామని పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బయటపడ్డ అమ్మవారి విగ్రహం.. ప్రత్యేక పూజలు
వైసీపీ బైక్ ర్యాలీ.. రెండు వర్గాల మధ్య ఘర్షణ..
For More AP News And Telugu News