CM Chandrababu: కరెంట్ ఛార్జీలపై సీఎం చంద్రబాబు గుడ్‌న్యూస్
ABN , Publish Date - Dec 08 , 2025 | 04:48 PM
సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ సమపాళ్లలో చేపట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. 18 నెలలుగా ప్రతి గంట, ప్రతి క్షణం కష్టపడ్డామన్నారు. 93 స్కీంలను మరలా రివైవ్ చేసినట్లు తెలిపారు.
అమరావతి, డిసెంబర్ 8: విధ్వంసమైన ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిలో పెడుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అన్నారు. సోమవారం నాడు మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ అనేక విజయాలను చవిచూసిందని.. కానీ 2024 విజయం.. నమ్మకం, విశ్వాసం మీద వచ్చిందని తెలిపారు. సూపర్ సిక్స్‌ను సూపర్ హిట్ చేశామన్నారు. పరీక్ష రాసినప్పుడు పిల్లలు ఎంత టెన్షన్‌గా ఉంటారో తాము అంతే టెన్షన్‌గా ఉంటామని చెప్పుకొచ్చారు. జీఎస్డీపీ విషయంలో ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటున్నామని తెలిపారు.
ఈ రాష్ట్రాన్ని తిరిగి నిలబెట్టగలుగుతారా? అనే అనుమానాలు ప్రజల్లో ఉన్నాయని.. అయితే సిట్యూయేషన్ చూసి పారిపోమని ప్రజలకు హామీ ఇచ్చినట్లు తెలిపారు. నాడు సూపర్ సిక్స్ తీసుకువచ్చామని... అయితే అభివృద్ధికి నిధులు లేవన్నారు. క్యాపిటల్ ఎక్స్‌పెండీచర్ బాగా తగ్గి అభివృద్ధి లేకుండా పోయిందని వెల్లడించారు. తరువాత అన్ని వ్యవస్థలను గాడిన పెట్టామన్నారు. క్యాపిటల్ ఎక్స్‌పెండీచర్‌ను బాగా పెంచామని.. సుపరిపాలనకు టెక్నాలజీని అభివృద్ధి చేశామని అన్నారు. ఆగిపోయిన స్కీంలు అన్నింటినీ తిరిగి ప్రారంభించామని ముఖ్యమంత్రి చెప్పారు.
సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ సమపాళ్లలో చేపట్టామన్నారు. 18 నెలలుగా ప్రతి గంట, ప్రతి క్షణం కష్టపడ్డామన్నారు. 93 స్కీంలను మరలా రివైవ్ చేసినట్లు తెలిపారు. రూ.9000 కోట్ల సోలార్ విండ్ రెన్యూవబుల్ ఎనర్జీ కింద నాటి ప్రభుత్వం డబ్బులు పెంచేసిందని విమర్శించారు. కరెంటు ఛార్జీలు పెంచకుండా వ్యవస్థను నిలబెట్టామన్నారు. కరెంటు ఛార్జీలు ఈ ఏడాది కూడా పెంచమని... వచ్చే ఏడాది పెంచుకుంటామని సీఎం వెల్లడించారు. రాష్ట్రంలో చాలా చోట్ల గ్రౌండ్ వాటర్ పెంచగలిగామన్నారు. ఏపీ బ్రాండ్ రాష్ట్రంలో పూర్తిగా దెబ్బతిన్నదని.. పరిశ్రమలను వెళ్లగొట్టారని మండిపడ్డారు. విద్యా వ్యవస్థలో ఆంగ్ల మీడియం అని చెప్పి డ్రాపవుట్లను పెంచారన్నారు. ఆలిండియా లెవల్‌లో టాప్ ఫైవ్ ఉన్న ఎడ్యూకేషన్ సిస్టంను టాప్ త్రీ లేదా వన్‌కు తీసుకువస్తామని స్పష్టం చేశారు.
భూగర్భ జలాలను పెంచడం కూడా చేశామన్నారు. ఇటీవల జరిగిన ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో పెట్టుబడుల గురించి అందరికీ తెలిసిందన్నారు. జీఎస్డీపీ, తలసరి ఆదాయం ఎలా పెరిగిందో చూస్తే రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతోందని అర్థమవుతోందన్నారు. ప్రజలకు ఈ విషయాలన్నీ తెలియాలనే ఉద్దేశంతో అన్నీ చేస్తున్నామన్నారు. రాష్ట్ర విభజన తరువాత టీడీపీ అయిదేళ్లు అధికారంలో ఉందన్నారు. ఇక్కడ సరాసరి జీఎస్టీ 13.5 శాతం సాధించామని... కేంద్ర జీఎస్డీపీ కన్నా ఎక్కవ సాధించామని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చాక 12.02 శాతం వృద్ధి సాధించామని.... ఆల్ ఇండియా లెవల్‌లో 9.8 శాతంగా ఉందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
కాగా.. 2025-26 తొలి అర్థ సంవత్సరం (ఏప్రిల్ నుంచి సెప్టెంబర్)... అలాగే 2వ త్రైమాసికం (జూలై నుంచి సెప్టెంబర్) ఫలితాలను సీఎం చంద్రబాబు విడుదల చేశారు. స్థిర ధరల వద్ద నమోదైన ఆర్ధిక వృద్ధి, రాష్ట్ర స్థూల ఉత్పత్తి, గ్రాస్ వాల్యూ అడిషన్, వ్యవసాయం, ఉత్పత్తి, సేవా రంగాలు నమోదు చేసిన వృద్ధి గణాంకాలను విడుదల చేశారు. విభజన వల్ల రాష్ట్రానికి వ్యవస్థీకృతమైన నష్టం జరిగిందని ఈ సందర్భంగా సీఎం అన్నారు. 2019-24 పాలన వల్ల వ్యవస్థలు డీఫంక్ట్ అయ్యాయని... రాష్ట్రం అప్పుల్లో కూరుకు పోయిందని తెలిపారు.
గత పాలకుల విధ్వంస పాలన వల్ల గ్రోత్ రేట్ తగ్గి రూ.7లక్షల కోట్ల జీఎస్డీపీ కోల్పోయామని వెల్లడించారు. గ్రోత్ రేట్ లేకపోవటం వల్ల రూ. 76,195 కోట్ల ఆదాయం కోల్పోయామన్నారు. గత ప్రభుత్వంలో ఎక్కువ వడ్డీలకు అప్పులు తేవటం వల్ల ప్రజాధనానికి నష్టం కలుగుతోందని చెప్పారు. రుణాల రీ-షెడ్యూలింగ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. బ్రాండ్ తగ్గినప్పుడు వడ్డీ రేటు పెరిగిపోతుందని... తద్వారా రెవెన్యూ జీఎస్డీపీలో రాష్ట్రం చాలా నష్టపోయిందని చెప్పుకొచ్చారు. 25 ఏళ్ల క్రితం చేసిన ఐటీ పాలసీ వల్ల తెలుగు వాళ్ల తలసరి అదాయం గరిష్టస్థాయిలో ఉందన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు ఎలా పెంచాలన్నదే ఎప్పుడూ తన ఆలోచన అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
రెండో త్రైమాసికం ఫలితాలు:
రెండో త్రైమాసికం ప్రస్తుత ధరల్లో రాష్ట్ర జీఎస్డీపీ మొత్తంగా 11.28 శాతం వృద్ధి
రూ.4,00,377 కోట్ల విలువైన జీఎస్డీపీ నమోదు. ఇదే సమయానికి భారతదేశ జీడీపీ 8.7 శాతంగా ఉంది.
గతేడాది 2వ త్రైమాసికంలో రాష్ట్ర జీఎస్డీపీ 10.17 శాతంగా ఉంది. దీని విలువ రూ.3,59,778. అంటే ఈ త్రైమాసికంలో జీఎస్డీపీ గతేడాదితో పోల్చుకుంటే 1.11 శాతం పెరిగింది.
2వ క్వార్టర్‌కి రాష్ట్ర జీవీఏ 11.30 శాతం ఉండగా, జాతీయ జీవీఏ 8.7 శాతంగా నమోదైంది.
రాష్ట్రంలో వ్యవసాయ - అనుబంధ రంగాల జీవీఏ 10.70 శాతం , పరిశ్రమల రంగం 12.20 శాతం, సేవల రంగం 11.30 శాతం వృద్ధి నమోదైంది.
జాతీయ స్థాయిలో జీవీఏ వృద్ధి చూస్తే వ్యవసాయ రంగం 1.8 శాతం, పరిశ్రమల రంగం 8.5 శాతం, సేవల రంగం 10.6 శాతంగా ఉంది.
ఇవి కూడా చదవండి..
ఎమ్మెల్యే మాధవి ప్రోటోకాల్ అంశం.. ప్రివిలేజ్ కమిటీ ఏం తేల్చిందంటే
ఇసుక స్కాం కేసు.. సుప్రీంలో కీలక పరిణామం
Read Latest AP News And Telugu News