CM Chandrababu Amaravati Development: రైతులను మరిస్తే.. త్యాగాన్ని మరిచినట్టే: చంద్రబాబు
ABN , Publish Date - Oct 13 , 2025 | 11:49 AM
రాజధాని ఎక్కడ పెట్టాలనే అంశాన్ని కూడా చెప్పకుండా విభజన చేశారని.. రాజధాని కోసం జాగా కూడా లేని పరిస్థితుల్లో రాష్ట్ర విభజన చేశారని సీఎం చంద్రబాబు అన్నారు.
అమరావతి, అక్టోబర్ 13: అమరావతిలో సీఆర్డీయే కార్యాలయాన్ని సీఎం చంద్రబాబు (CM Chandrababu Naidu) ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి రాజధాని లేకుండా రాష్ట్రం ఏర్పడిందన్నారు. రాజధాని ఎక్కడ పెట్టాలో నిర్ణయించడానికి నాడు కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం కమిటీ వేసిందని తెలిపారు. రాజధాని ఎక్కడ పెట్టాలనే అంశాన్ని కూడా చెప్పకుండా విభజన చేశారని.. రాజధాని కోసం జాగా కూడా లేని పరిస్థితుల్లో రాష్ట్ర విభజన చేశారని అన్నారు. రాజధాని విషయంలో నాటి యూపీఏ ప్రభుత్వం లేనిపోని పంచాయితీ పెట్టిందని విమర్శించారు.
రాష్ట్రం మధ్యలో రాజధాని పెడితే అందరికీ బాగుంటుందని ఇక్కడ ఏర్పాటు చేశామని చెప్పారు. బెస్ట్ రాజధాని నిర్మిస్తున్నామని... గ్రీన్ ఫీల్డ్ రాజధాని నిర్మిస్తున్నామని వెల్లడించారు. రాజధాని నిర్మాణానికి భూమి కావాలని.. ప్రణాళికలకు అనుగుణంగా రాజధాని నిర్మించగలరా అని అనుమానపడ్డారని అన్నారు. సైబరాబాద్ నిర్మించిన అనుభవంతో అమరావతి నిర్మాణం ప్రారంభించామని.. భూమి కోసం ఎదురు చూస్తున్న సమయంలో అమరావతి రైతులు తనకు దారి చూపారని సీఎం వెల్లడించారు.
రైతులు ఐదు సంవత్సరాలు ఇబ్బందులు పడ్డారని.. రాజధాని వేశ్యల ప్రాంతమని మాట్లాడారని.. ఎడారి, స్మశానం అన్నారని మండిపడ్డారు. ఇంత మంచి ప్రాంతం ఎక్కడా ఉండదన్నారు. 30, 40 లక్షల ఎకరాలు సాగు చేసే నది కృష్ణా నది అని.. ప్రపంచంలో ఎక్కడా లేని సిటీ అమరావతి అని తెలిపారు. ఇక్కడ గ్రీనరీ అద్భుతంగా వస్తుందని.. ఇక్కడ బ్లూ , గ్రీన్ సిటీగా అమరావతి ఉంటుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
‘గతంలో జరిగిన తప్పుకు మీరు, నేను, రాష్ట్ర ప్రజలు ఎంత అనుభవించారో చూశారు. ఇకపై ఎన్‌డీఏ ప్రభుత్వం శాశ్వతంగా ఉండాలి. అమరావతి కన్నా విశాఖ ముందుకు వెళుతోంది. అమరావతికి శంకుస్థాపన సమయంలో పవిత్ర ప్రాంతాల నుంచి మట్టి నీరు తెచ్చారు. పార్లమెంట్ మట్టి, యమునా నది నీటిని ప్రధాని తెచ్చారు. అందుకే అమరావతి నిలిచింది. రైతులను నేను మరిచిపోను.. మరిచిపోతే త్యాగాన్ని మరిచిపోయినట్టే’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో మరోసారి చిరుత కలకలం..
టీడీపీలోకి వచ్చిన ఆ నేతలకు ఎమ్మెల్యే బండారు స్ట్రాంగ్ వార్నింగ్
Read Latest AP News And Telugu News