Botsa Walkout: విగ్రహాల ఏర్పాటుపై మండలిలో రచ్చ.. బొత్స వాకౌట్
ABN , Publish Date - Sep 24 , 2025 | 01:25 PM
గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ విగ్రహాల కూడళ్లు అభివృద్ది పేరిట కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేశారని టీడీపీ సభ్యుడు మండిపడ్డారు. అనధికారికంగా విగ్రహాలు ఏర్పాటు చేయకుండా చర్యలు తీసుకోవాలని టీడీపీ సభ్యుడు బి తిరుమలనాయడు, ఆలపాటి రాజేంద్రప్రసాద్ కోరారు.
అమరావతి, సెప్టెంబర్ 24: బహిరంగ ప్రదేశాల్లో అనధికార విగ్రహాలు ఏర్పాటుపై శాసనమండలిలో (AP Legislative Council) ప్రశ్నోత్తరాల్లో చర్చ జరిగింది. పులివెందులలో ప్రజా నిధులతో అనధికారికంగా వైఎస్ విగ్రహాలు ఏర్పాటు చేశారని టీడీపీ సభ్యుడు భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ విగ్రహాల కూడళ్లు అభివృద్ది పేరిట కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. అనధికారికంగా విగ్రహాలు ఏర్పాటు చేయకుండా చర్యలు తీసుకోవాలని టీడీపీ సభ్యుడు బి తిరుమలనాయడు, ఆలపాటి రాజేంద్రప్రసాద్ కోరారు.
బొత్స అభ్యంతరం...
అయితే టీడీపీ ఎమ్మెల్సీల వ్యాఖ్యలపై విపక్ష నేత బొత్స సత్యనారాయణ అభ్యంతరం వ్యక్తం చేశారు. మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డిని కించపరిచేలా సభ్యులు మాట్లాడారని మండిపడ్డారు విపక్ష నేత. ఇందుకు నిరసనగా సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్లు విపక్షనేత బొత్స ప్రకటిస్తూ.. సభ నుంచి బయటకు వెళ్లిపోయారు.
మంత్రి సమాధానం..
ఆపై ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నలకు రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో బహిరంగ ప్రదేశాల్లో 2524 విగ్రహాలను అనధికారికంగా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇందులో జాతీయ రహదారులపై 38, రాష్ట్ర రోడ్లపై 1671, రాష్ట్ర హైవేలపై 815 ఉన్నట్లు తెలిపారు. నాయకుల విగ్రహాల ఏర్పాటులో నియంత్రణను అమలు చేస్తూ.. 2013, ఫిబ్రవరి 18న జీవో ఎంఎస్ నెంబర్ 18 ద్వారా ప్రభుత్వం కొన్ని నిర్దేశాలతో ఉత్తర్వులు ఇచ్చిందని గుర్తుచేశారు. పబ్లిక్ రోడ్లు, కాలి బాటలు, పక్క మార్గాలు, ఇతర ప్రజా వినియోగ ప్రదేశాలలో విగ్రహాల ఏర్పాటు, కట్టడాల నిర్మాణానికి ఎటువంటి అనుమతి ఇవ్వరాదని అందులో ఉందన్నారు. హై మాస్ట్ లైట్స్, స్ట్రీట్ లైట్స్, విధ్యుదీకరణ, ట్రాఫిక్, టోల్ మౌలిక సదుపాయాలు, రోడ్ల అభివృద్ధి, సుందరీకరణ వంటి పబ్లిక్ యుటిలిటీ, సుందరీకరణకు సంబంధించిన పనులకు ఈ నిషేధం వర్తించదని తెలిపారు. మార్గదర్శకాల ప్రకారం అనధికారికంగా ఏర్పాటు చేసిన విగ్రహాలను తొలగింపును కలెక్టర్లకు ఆదేశాలిచ్చామన్నారు.
పులివెందులోని కూడళ్ల సుందరీకరణకు ప్రణాళిక శాఖ రూ. 3.50 కోట్లు నిధులు మంజూరు చేసి, పనులు చేపట్టడం జరిగిందని చెప్పారు. కడప పట్టణంలోని సర్కిళ్లను మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ, డిఎంఎస్ రూ. 7.21 కోట్లు నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. 2019లో ఇచ్చిన జీవో ప్రకారం ఇప్పటి వరకు ఉన్న విగ్రహాలకు ఎటువంటి అనుమతి ఇవ్వలేదని.. ఉన్న విగ్రహాలను తొలగించడానికి కూడా అనుమతి ఇవ్వలేదని వెల్లడించారు. అనధికారికంగా ఏర్పాటు చేసిన విగ్రహాల విషయాన్ని పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని మంత్రి బీసీ జనార్ధన్ సమాధానం ఇచ్చారు.
ఇవి కూడా చదవండి..
రాజధానిపై మూడు ముక్కలాట.. గత సర్కార్‌పై మంత్రి ఫైర్
వారిపై పీడీయాక్ట్ కేసులు ఖాయం: మంత్రి నాదెండ్ల
Read Latest AP News And Telugu News