Share News

AP Quantum Valley: క్వాంటం వ్యాలీగా అమరావతి.. సర్కార్ కీలక ఒప్పందం

ABN , Publish Date - May 02 , 2025 | 04:29 PM

AP Quantum Valley: అమరావతిలో భారతదేశపు మొట్టమొదటి, అత్యాధునిక క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్క్ నిర్మాణం కానుంది. క్వాంటమ్ కంప్యూటింగ్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఐబీఎమ్, టీసీఎస్‌, ఎల్‌ అండ్ టీలతో ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుంది.

AP Quantum Valley: క్వాంటం వ్యాలీగా అమరావతి.. సర్కార్ కీలక ఒప్పందం
AP Quantum Valley

అమరావతి, మే 2: అమరావతిలో (Amaravati) క్వాంటం వ్యాలీ ఏర్పాటుకు తొలి అడుగు పడింది. ఈరోజు (శుక్రవారం) ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu Naidu) నివాసంలో జరిగిన కార్యక్రమంలో టెక్ దిగ్గజాలు ఐబీఎమ్‌, టీసీఎస్, ఎల్ అండ్ టీలతో దేశంలోనే తొలి టెక్‌పార్క్‌కు ఏపీ సర్కార్ ఎంవోయూ కుదుర్చుకుంది. 2026 జనవరి 1న తొలి క్వాంటం వ్యాలీ టెక్‌పార్క్‌ ప్రారంభంకానుంది. క్వాంటం కంప్యూటింగ్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఐబీఎమ్, టీసీఎస్‌, ఎల్‌ అండ్ టీలతో ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. క్వాంటం పరిశోధన, ఆవిష్కరణలతో పాటు ఏపీని ప్రపంచ హబ్‌గా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా సర్కార్ ముందు సాగుతోంది. అమరావతిలో భారతదేశపు మొట్టమొదటి, అత్యాధునిక క్వాంటం వ్యాలీ టెక్ పార్క్ నిర్మాణం కానుంది. దేశంలోనే తొలిసారి ఐబీఎం అతిపెద్ద క్వాంటమ్ కంప్యూటర్ 156 క్యూబిట్ హెరాన్ ప్రాసెసర్‌ కలిగిన ‘క్వాంటం సిస్టం 2’ని అమరావతిలో నెలకొల్పనుంది.


భవిష్యత్ పాలనకు పునాది: చంద్రబాబు

1990లలో దేశంలో ఐటీ విప్లవానికి ఆంధ్రప్రదేశ్ కీలకంగా నిలిచిందని, ఇప్పుడు దేశంలో క్వాంటం విప్లవానికి కూడా నాయకత్వం వహిస్తోందని సీఎం చంద్రబాబు అన్నారు. ఎంవోయూ అనంతరం సీఎం మాట్లాడుతూ... ఐబీఎం, టీసీఎస్‌, ఎల్ అండ్ టీతో జరిగిన ఒప్పందం ‘ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌కే కాదు, భారతదేశానికి కూడా చారిత్రాత్మకం’ అని చెప్పుకొచ్చారు. ‘క్వాంటం కంప్యూటింగ్’ భవిష్యత్ పాలనకు, ఆవిష్కరణలకు పునాది అవుతుందన్నారు. సాంకేతికరంగంలో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, క్వాంటం కంప్యూటింగ్ వంటి కొత్త అవకాశాలు వస్తున్నాయని, అయితే వాటిని అందిపుచ్చుకోవడం ముఖ్యమని అన్నారు. భవిష్యత్ అవసరాలన్నీ క్వాంటం కంప్యూటింగ్‌‌పైనే ఆధారపడి ఉంటాయని అందుకే అమరావతిని క్వాంటం వ్యాలీ చేయాలనుకున్నట్టు వెల్లడించారు.

PM Modi: గన్నవరం ఎయిర్‌పోర్టుకు మోదీ.. ఘన స్వాగతం


సిలికాన్ వ్యాలీ తరహాలో క్వాంటం వ్యాలీగా అమరావతిని తీర్చిదిద్దాలని ఐబీఎం, టీసీఎస్ సంస్థల ప్రతినిధులకు ముఖ్యమంత్రి సూచించారు. హైటెక్ సిటీని 15 నెలల్లో నిర్మించిన అనుభవాన్ని గుర్తుచేస్తూ, క్వాంటమ్ వ్యాలీ తక్కువ సమయంలోనే నిర్మించవచ్చని తెలిపారు. ఇప్పటికే ఎల్ అండ్ టీకి స్థలాన్ని కేటాయించామని, మౌలిక వసతులను అత్యంత వేగంగా అభివృద్ధి చేయాలని అధికారులకు సీఎం ఆదేశించారు. ఇందుకోసం రెండు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఒక కమిటీ నిర్మాణం పురోగతిని పరిశీలిస్తే, మరొక కమిటీ వ్యవస్థ అభివృద్ధిపై దృష్టి సారిస్తాయన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి త్వరలోనే ఈ ప్రాజెక్టును సవివరంగా తెలియజేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.


కీలక ఘట్టమన్న టెక్ దిగ్గజాలు

భారతదేశంలో ఐబీఎం క్వాంటం సిస్టం 2 స్థాపన, దేశ క్వాంటం ప్రయాణానికి కీలక మలుపు కానుందని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం - టీసీఎస్‌తో కలిసి పని చేయడం వల్ల క్వాంటం అల్గోరిథం అభివృద్ధి వేగవంతం అవుతుందని ఐబీఎం క్వాంటం వైస్ ప్రెసిడెంట్ జే గాంబెట్టా అన్నారు. క్వాంటం, క్లాసికల్ సిస్టమ్‌లను కలిపిన హైబ్రిడ్ కంప్యూటింగ్ ద్వారా జీవశాస్త్రం, మెటీరియల్స్, క్రిప్టోగ్రఫీ వంటి రంగాల్లో విప్లవాత్మక ఫలితాలు సాధించవచ్చని.. ఇది ఒక కీలక ఘట్టమని టీసీఎస్ సీటీవో డాక్టర్ హారిక్ విన్ అన్నారు. క్వాంటం కంప్యూటింగ్ అనేది రెండో క్వాంటం విప్లవమని, ఈవీ బ్యాటరీల నుంచి ఆర్థిక వ్యవస్థ వరకు దీని ఉపయోగాలు విస్తృతంగా ఉంటాయని ఐబీఎం వైస్ ప్రెసిడెంట్ స్కాట్ క్రౌడర్ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో టీసీఎస్ తొలిసారి రాష్ట్రంలో డిజిటల్ గవర్నెన్స్‌కు బీజం వేసిందని టీసీఎస్ ప్రతినిధులు వి. రాజన్న, సి.వి. శ్రీధర్ గుర్తు చేశారు. క్వాంటం వ్యాలీ ద్వారా పరిశోధన, అభివృద్ధి మరింత ముందుకు సాగుతుందని చెప్పారు.


ఇవి కూడా చదవండి

Kesireddy SIT Custody: రాజ్ కేసిరెడ్డిని కస్టడీలోకి తీసుకున్న సిట్

Gopi ACB Custody: రెండో రోజు ఏసీబీ కస్టడీకి గోపి

Read Latest AP News And Telugu News

Updated Date - May 02 , 2025 | 04:47 PM