AP Polytechnic Colleges: పాలిటెక్నిక్ భవనాలపై అసెంబ్లీలో చర్చ
ABN , Publish Date - Sep 26 , 2025 | 11:56 AM
రాష్ట్ర వ్యాప్తంగా 10 ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలు సొంత భవనాల్లో లేవని.. వీటిలో రెండు భవనాలను కట్టడం ప్రారంభించినట్లు మంత్రి నారా లోకేష్ చెప్పారు.
అమరావతి, సెప్టెంబర్ 26: ఏపీ అసెంబ్లీ సమావేశాలు (AP Assembly Session) ఏడవ రోజుకు చేరుకున్నాయి. ప్రస్తుతం సభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా పాలిటెక్నిక్ కళాశాలలకు సొంత భవనాలపై మైదకూరు నియోజకవర్గం ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ప్రశ్నించారు. మైదుకూరులో పాలిటెక్నిక్ కాలేజీకి అప్రూవల్ అయినప్పటికీ కెపాసిటీకి నాల్గవ వంతు మాత్రమే విద్యార్ధులు ఉన్నారని తెలిపారు. అద్దె భవనంలో ఈ కళాశాల నడుస్తోందని అన్నారు. నియోజకవర్గంలో నవోదయ స్కూల్ శాంక్షన్ అయ్యిందని.. అయితే ప్రపోజల్స్ ఆలస్యం అవుతుందని ఎమ్మెల్యే సభ దృష్టికి తీసుకొచ్చారు.
ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు మాట్లాడుతూ.. ఐదు నియోజకవర్గాలు దీవుల్లో ఉన్నాయని.. పాలిటెక్నిక్ కాలేజి లేకపోవడం వల్ల సుదూర ప్రాంతాలకు వెళ్లి చదువుకోవాల్సి వస్తుందని అన్నారు. ఓఎన్‌జీసీ , గెయిల్, రిలయన్స్ వంటి ఆయిల్ కంపెనీలు భారీ స్ధాయిలో పనిచేస్తున్నాయన్నారు. సీఎస్ఆర్ కింద అమలాపురంలో పాలిటెక్నిక్ కాలేజి ఇస్తే బావుటుందని ఎమ్మెల్యే కోరారు. ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న పాలిటెక్నిక్ కాలేజీల్లో అడ్మిషన్లు సరిగా ఉండడం లేదని గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట రాజు తెలిపారు.
మంత్రి సమాధానం...
సభ్యుల ప్రశ్నలకు మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) సమాధానం ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 10 ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలు సొంత భవనాల్లో లేవని.. వీటిలో రెండు భవనాలను కట్టడం ప్రారంభించినట్లు చెప్పారు. ఐదు పాలిటెక్నిక్ కాలేజీలకు చోడవరం, పోన్నూరు, గుంతకల్, మైదుకూరు, బేతంచర్లలకు భూములు కేటాయించామన్నారు. మచిలీపట్నం, కేఆర్ పురం, అనపర్తిలోని పాలిటెక్నిక్ కాలేజీలకు భూములు ఇచ్చి కేంద్రం ద్వారా నిధులు తేవడంతో పాటు సీఎస్ఆర్, రాష్ట్ర ప్రభుత్వం, ఎంపీ లాడ్స్ ద్వారా ఈ భవనాలను కట్టే ప్రయత్నం చేస్తామని మంత్రి వెల్లడించారు.
ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ నవోదయా స్కూలు గురించి మాట్లాడారని.. అవి కేంద్రం ఇచ్చేవని, తాత్కాలిక భవనాల విషయంలో కేంద్రం అంగీకరించదని తెలిపారు. దీనిపై కేంద్ర మంత్రితో మాట్లాడి చర్చిస్తామని అన్నారు. కోనసీమ గురించి స్టడీ చేసి అక్కడ పాలిటెక్నిక్‌ను ఏర్పాటు చేయడానికి చూస్తున్నామన్నారు. పాలిటెక్నిక్ కాలేజీల్లో అడ్మిషన్లు 70 శాతం మాత్రమే అని.. అందుకే ఆ కాలేజీల్లో మార్కెట్ లింక్, మార్కెట్ ఓరియెంటెడ్ కోర్సులు తేవాలని.. కోర్సు ప్యాట్రన్‌లోనూ మార్పులు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చామని మంత్రి లోకేష్ సమాధానం ఇచ్చారు.
ఇవి కూడా చదవండి..
భారీ వర్షాలు.. ఏపీ సర్కార్ అప్రమత్తం
అతిభారీ వర్షాలు.. తీర ప్రాంతాలకు అలెర్ట్
Read latest AP News And Telugu News