AP Ministers: బుడమేరు పాపం అంతా వైసీపీదే.. మంత్రుల విసుర్లు
ABN , Publish Date - Jan 03 , 2025 | 01:44 PM
Andhrapradesh: బుడమేరు వరద నియంత్రణపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు సమగ్ర నివేదిక అందించేలా ఇరిగేషన్, మున్సిపల్, రెవిన్యూ శాఖల అధికారులతో సమీక్ష చేశామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. బుడమేరు డైవర్షన్ కెనాల్‌ను 37,500 క్యూసెక్కులకు పెంచేలా పెండింగ్ పనులు పూర్తి చేసేలా యాక్షన్ ప్లాన్ రూపొందించామన్నారు.
అమరావతి, జనవరి 3: బుడమేరు వరద నియంత్రణపై మంత్రులు నిమ్మల రామానాయుడు (Minister Nimmala Ramanaidu) , నారాయణ (Minister Narayan) శుక్రవారం సమీక్ష నిర్వహించారు. భవిష్యత్తులో విజయవాడకు వరద సమస్య లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా వరద నియంత్రణ చర్యలు చేపట్టడంపై చర్చించారు. అలాగే బుడమేరు, కృష్ణానదికి ఒకేసారి వరద వస్తే ఏం చేయాలన్న దానిపై ప్రధానంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల మాట్లాడుతూ.. బుడమేరు వరద నియంత్రణపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు సమగ్ర నివేదిక అందించేలా ఇరిగేషన్, మున్సిపల్, రెవిన్యూ శాఖల అధికారులతో సమీక్ష చేశామని తెలిపారు. బుడమేరు డైవర్షన్ కెనాల్‌ను 37,500 క్యూసెక్కులకు పెంచేలా పెండింగ్ పనులు పూర్తి చేసేలా యాక్షన్ ప్లాన్ రూపొందించామన్నారు. వెలగలేరు రెగ్యులేటర్ నుంచి కొల్లేరు వరకు ఓల్డ్ ఛానెల్ సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచన చేశామని అన్నారు.
గత టీడీపీ హాయాంలోనే బుడమేరు డైవర్షన్ ఛానెల్ 35 వేల క్యూసెక్కులకు పెంచేలా రూ.464 కోట్లతో టెండర్లు అప్పగించి 80 శాతం పనులు పూర్తి చేశామన్నారు. వైసీపీ ప్రభుత్వంలో బుడమేరు విస్తరణకు నిధులు ఉన్నా మిగిలిన 20 శాతం పనులకు సంబంధించి తట్ట మట్టి గానీ, బస్తా సిమెంట్ పని గానీ చేయలేదని విమర్శించారు. గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం.. చేసిన పాపం ఫలితమే బుడమేరు ముంపుకు కారణమని అన్నారు. గత టీడీపీ హయాంలో ఎనికేపాడు యూటీ నుంచి కొల్లేరు వరకు వెళ్ళే ఛానల్ విస్తరణ పనులను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. బుడమేరు ఛానెల్‌కు సమాంతరంగా ఓల్డ్ ఛానెల్‌ను కూడా 10 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. త్వరలోనే సమగ్ర నివేదికను ముఖ్యమంత్రి చంద్రబాబుకు సమర్పిస్తామన్నారు. ముఖ్యమంత్రి సూచనలకు అనుగుణంగా బుడమేరు యాక్షన్ ప్లాన్‌కు రంగంలోకి దిగుతామని తెలిపారు. బుడమేరు వరదల నియంత్రణకు కేంద్రం సహాకారం కోరతామని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.
ఏపీ సర్కార్ ప్రయోగాత్మక నిర్ణయం.. ఇకపై స్కూళ్ల వద్దకే
దాన్ని కూడా రాజకీయం చేశారు: నారాయణ

బుడమేరు వరదల వల్ల 34 వార్డులలో 5 లక్షల మంది 4 రోజులు నీళ్ళలోనే ఉన్నారని మంత్రి నారాయణ అన్నారు. కనీసం రోజు వారీ అవసరాలకు కూడా నీరు అందని పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రజల అవసరాలకు రోజుకు 20 నుంచి 30లక్షల వాటర్ బాటిళ్ళు పంపిణీ చేశామని తెలిపారు. వాటర్ బాటిళ్ళ పంపిణీని కూడా వైసీపీ రాజకీయం చేసిందని మండిపడ్డారు. గతంలో వైసీపీ ప్రభుత్వం బుడమేరు టెండర్లు రద్దు చేయకుండా ఉంటే విజయవాడకు ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. బుడమేరు వరదలకు వైసీపీనే కారణమన్నారు. జనవరి 18న మరో మారు ఇరిగేషన్, మున్సిపల్,రెవిన్యూ శాఖలు సమావేశమవుతామని మంత్రి నారాయణ వెల్లడించారు.
ఇవి కూడా చదవండి...
వందే భారత్ స్లీపర్ ట్రైన్ అదుర్స్.. వేగం తెలిస్తే షాక్..
రికార్డు అమ్మకాలు.. ఒక్కరోజే రూ.9 కోట్ల మద్యం తాగేశారు
Read Latest AP News And Telugu news