AP High Court Chief Justice: నేటికీ దేశవ్యాప్తంగా బాలికలపై లైంగిక వేధింపులు..
ABN , Publish Date - Sep 14 , 2025 | 05:03 PM
బాలికలను ఇబ్బంది పెడితే.. ఎటువంటి శిక్షలు ఉంటాయో అందరికీ తెలిసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్.. తల్లిదండ్రులతోపాటు పాఠశాల, కళాశాలల సిబ్బందికి సూచించారు. వీటిపై చైతన్యం తీసుకురావడం ద్వారా కొంత వరకైనా ఈ లైంగిక వేధింపులను అరికట్టే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.
విజయవాడ, సెప్టెంబర్ 14: విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పిస్తూ కళాశాలలు, పాఠశాలల్లోని ప్రతి తరగతి గదిలో చార్ట్‌లు ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ స్పష్టం చేశారు. బాలికలను ఇబ్బంది పెడితే.. ఎటువంటి శిక్షలు ఉంటాయో అందరికీ తెలిసే విధంగా చర్యలు చేపట్టాలని తల్లిదండ్రులతోపాటు పాఠశాల, కళాశాలల సిబ్బందికి ఆయన సూచించారు. వీటిపై చైతన్యం తీసుకురావడం ద్వారా కొంత వరకైనా ఈ లైంగిక వేధింపులను అరికట్టే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.
ఆదివారం నాడు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జువైనల్ జస్టిస్ కమిటీ, రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, ఏపీ న్యాయ సేవాధికార సంస్థలు సంయుక్తంగా బాలికల సంరక్షణపై సదస్సు నిర్వహించాయి. ఈ కార్యక్రమానికి ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, ప్రత్యేక అతిథిగా ముంబై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రేవతి మోహితి ధరె పొల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. 1098కు కాల్ చేయడం ద్వారా ఎటువంటి సాయమైనా పొందవచ్చనే విషయం ప్రతి ఆడపిల్లకు తెలియాల్సి ఉందన్నారు.
నేడు దేశవ్యాప్తంగా మహిళలు, ఆడపిల్లలు లైంగిక వేధింపులకు గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి సమావేశాలు నిర్వహించడం ద్వారా సమాజానికి సైతం చట్టాలపై అవగాహన పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా మహిళల బాధలను ఈ సమాజం చూస్తూనే ఉందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అయినా.. ప్రతి రోజు మహిళలు, బాలికలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇంట్లో కూడా ఆడపిల్ల, మగపిల్లవాడు అనే వ్యత్యాసాలు చూపకూడదని తల్లిదండ్రులకు ఆయన స్పష్టం చేశారు. అందరూ సమానమనే భావన చూపిస్తే.. వారిలోనూ ఆత్మస్థైర్యం పెరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఆర్థిక ఇబ్బందులు వల్ల బాల్య వివాహాలు చేసి ఆడపిల్లల బరువు వదిలించుకునే కుటుంబాలు ఈ సమాజంలో నేటికీ ఉన్నాయన్నారు.
అందుకే వారి సంరక్షణ కోసం ప్రత్యేక చట్టాలు చేసినా.. కొంతమందికి వాటిపై అవగాహన ఉండటం లేదని చెప్పారు. 13 నుంచి 15 ఏళ్ల వయస్సు ఉన్న ఆడపిల్లలు అత్యధికంగా లైంగిక వేధింపులకు గురవుతున్నారని వివరించారు. లైంగిక వేధింపులకు గురైన పిల్లలు మానసికంగా ఇబ్బందిని ఎదుర్కొంటారని తెలిపారు. వారికి మనోధైర్యం కల్పించి సమాజంలో ఎదిగేలా చేయాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారు. ఈ లైంగిక వేధింపులకు గురైన బాధితులకు చట్టపరంగా సేవలు అందించాలని న్యాయ కమిటీలకు ఈ సందర్బంగా ఆయన సూచించారు.
ఇవి కూడా చదవండి..
నేను శివ భక్తుడిని, నేను విషం అంతా మింగేస్తాను
మేధా హైస్కూల్‌పై విద్యాశాఖ కీలక నిర్ణయం..
For More AP News And Telugu news