Share News

NITI Aayog Meeting: స్వర్ణాంధ్రపై చంద్రబాబు ప్రజెంటేషన్.. నీతి ఆయోగ్‌లో ప్రశంసల వర్షం

ABN , Publish Date - May 24 , 2025 | 01:27 PM

NITI Aayog Meeting: ఢిల్లీలో జరుగుతున్న నీతి ఆయోగ్ సమావేశంలో వికసిత్ భారత్-2047, స్వర్ణాంధ్రపై ఏపీ ముఖ్యమంత్రి ఇచ్చిన ప్రజెంటేషన్‌పై ప్రశంసలు వెల్లువెత్తాయి. సీఎం ప్రజెంటేషన్‌లో వివిధ అంశాలు వికసిత్ భారత్‌కు ఉపయోగపడేలా ఉన్నాయని ప్రధాని మోదీ అన్నారు.

NITI Aayog Meeting: స్వర్ణాంధ్రపై చంద్రబాబు ప్రజెంటేషన్.. నీతి ఆయోగ్‌లో ప్రశంసల వర్షం
NITI Aayog Meeting

న్యూఢిల్లీ, మే 24: దేశ రాజధాని ఢిల్లీలో నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం (Niti Aayog Meeting) కొనసాగుతోంది. వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) భేటీ అయ్యారు. నీతి ఆయోగ్ సమావేశానికి హాజరైన గవర్నర్‌లు, సీఎంతో ప్రధాని మాట్లాడారు. నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో వికసిత్ భారత్-2047, స్వర్ణాంధ్రపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) నివేదిక ఇచ్చారు. పహల్గాం ఉగ్రదాడిని ఖండించి, ఆపరేషన్ సిందూర్‌ను (Operation Sindoor) ప్రశంసిస్తూ నీతి ఆయోగ్ ప్రసంగాన్ని ఏపీ సీఎం ప్రారంభించారు. ఎన్డీఏ ప్రభుత్వంలో ఇప్పటి వరకు సాధించిన ప్రగతిని వివరించారు. దేశ, రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే వివిధ అంశాలను తన ప్రజెంటేషన్‌లో చంద్రబాబు ప్రస్తావించారు. సీఎం ప్రజెంటేషన్‌లో వివిధ అంశాలు వికసిత్ భారత్‌కు ఉపయోగపడేలా ఉన్నాయని ఈ సందర్భంగా ప్రధాని మోదీ అన్నారు. ఇతర రాష్ట్రాలు కూడా ఏపీ ప్రతిపాదనలను పరిశీలించాలని ప్రధాని సూచించారు. చంద్రబాబు ప్రజెంటేషన్‌కు సమావేశంలో పెద్ద ఎత్తున ప్రశంసలు వెల్లువెత్తాయి.


రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను తన ప్రజెంటేషన్‌లో ఏపీ సీఎం ప్రస్తావించారు. 2.4 ట్రిలియన్ డాలర్ల ప్రగతి లక్ష్యంతో ఏపీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్టు చంద్రబాబు వివరించారు. వికసిత్ భారత్ కల సాకారంతో స్వర్ణాంధ్రను సాధించేలా అడుగులు వేస్తున్నట్టు ప్రజెంటేషన్‌లో వివరించారు. రాష్ట్రంలో ఉన్న వనరులను తాము ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటున్నామనే విషయాన్ని తన ప్రజంటేషన్‌లో తెలిపారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా విశాఖను తీర్చిదిద్దనున్నట్టు వెల్లడించారు. విశాఖకు గ్లోబల్ హంగులు అద్దేలా నాలుగు జోన్ల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు వివరించారు. విశాఖ మోడల్‌ను అమరావతి, తిరుపతి, గోదావరి, కర్నూలుకు విస్తరించేలా కేంద్రం సహకరించాలని ఈ సందర్భంగా ఏపీ సీఎం కోరారు.


అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఒప్పందం.. కర్నూలులో డ్రోన్ సిటీ ప్లాన్లను ప్రజెంటేషన్‌లో ప్రత్యేకంగా వివరించారు. డిజిటల్ గవర్ననెన్స్‌లో భాగంగా గూగుల్ ఏఐ వంటి టెక్నాలజీలను వినియోగిస్తున్నట్టు చెప్పారు. ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ బెనిఫిట్ డిజిటల్ పాస్‌బుక్ విధానాన్ని ప్రవేశపెట్టబోతున్నట్టు స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికల్లో ఇద్దరు బిడ్డల నిబంధన రద్దు చేసినట్టు ప్రజెంటేషన్‌లో సీఎం వివరించారు. మాతృత్వ సెలవులను 180 రోజులకు పెంచినట్టు సీఎం వెల్లడించారు. ప్రతి జిల్లా, నియోజకవర్గంలో విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్లు, రాష్ట్ర పురోగతిని కొలిచేందుకు 523 కీలక సూచికలు సిద్ధం చేశామన్నారు. ప్రతి కుటుంబానికి ఓ పారిశ్రామికవేత్త వచ్చేలా ప్రభుత్వ విధానాలు రూపొందిస్తున్నామని తెలిపారు. 175 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్‌ఎంఈ పార్కులు, వన్ డిస్ట్రిక్ట్ వన్ పార్క్‌కు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. 2029 నాటికి పేదరిక నిర్మూలన లక్ష్యంగా పని చేస్తున్నామని చెప్పారు. పీ4 మోడల్ ద్వారా బంగారు కుటుంబాలకు మార్గదర్శుల ద్వారా సహాయం చేస్తున్నామని.. అర్బన్ రూరల్ సినర్జీ మోడల్ లో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని తన ప్రజెంటేషన్‌లో సీఎం చంద్రబాబు నాయుడు వివరించారు.


ఇవి కూడా చదవండి

ఆ ఇద్దరి మృతదేహాలు అప్పగించండి.. హైకోర్టులో పిటిషన్

విజయవాడలో బాంబు కలకలం

Read latest AP News And Telugu News

Updated Date - May 24 , 2025 | 02:12 PM