Share News

Vijayawada Bomb Scare: విజయవాడలో బాంబు కలకలం

ABN , Publish Date - May 24 , 2025 | 11:17 AM

Vijayawada Bomb Scare: విజయవాడలోని బీసెంట్‌ రోడ్డులో బాంబు పెట్టినట్టు కంట్రోల్‌ రూం‌కు ఓ అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేశాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు బీసెంట్ రోడ్డులో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు.

Vijayawada Bomb Scare: విజయవాడలో బాంబు కలకలం
Vijayawada Bomb Scare

విజయవాడ, మే 24: నగరంలో బాంబు కలకలం రేగింది. బీసెంట్ రోడ్‌కు (Besant Road) బాంబ్ బెదిరింపు కాల్ వచ్చింది. కంట్రోల్ రూంకు గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి బాంబ్ ఉన్నట్లు బెదిరించాడు. దీంతో వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. పోలీసులు, బాంబు స్క్వాడ్ బీసెంట్ రోడ్‌లో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. బీసెంట్‌ రోడ్‌లోని షాపులు, తోపుడు బండ్లను బాంబ్‌ స్క్వాడ్ తనిఖీలు చేసింది. అయితే ఎక్కడా బాంబ్ ఉన్న ఆనవాళ్లు లేక పోవడంతో ప్రజలు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఎలాంటి బాంబు లేకపోవడంతో నేటి మధ్యాహ్నం నుంచి యధావిధిగా బీసెంట్ రోడ్‌లో వ్యాపారాలకు అనుమతి ఇచ్చారు పోలీసులు. అలాగే కంట్రోల్ రూమ్‌కు వచ్చిన ఫోన్‌కాల్‌పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు చేశారు అనేదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.


అయితే విజయవాడలో ప్రముఖ వ్యాపార కేంద్రంగా ఉన్న బీసెంట్ రోడ్‌లో నిత్యం వేలాది మంది జనసంచారం ఉంటుంది. వందలాది షాపులు ఉదయం 10 గంటల నుంచి అందుబాటులో ఉంటాయి. అయితే ఈరోజు 9:30 గంటల ప్రాంతంలో విజయవాడ పోలీస్ కంట్రోల్‌ రూంకు ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ చేసిన ఓ అజ్ఞాత వ్యక్తి.. విజయవాడ బీసెంట్ రోడ్డులో బాంబులు పెట్టామని, మరికాసేపట్లో అవి పేలే అవకాశం ఉందని చెప్పి ఫోన్ కట్ చేశాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే బాంబ్ స్క్వాడ్‌ను రంగంలోకి దించారు. మొత్తం నాలుగు బృందాలుగా ఏర్పడి బందర్‌ రోడ్డు నుంచి ఏలూరు రోడ్డు వరకు కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేశారు.


బీసెంట్‌ రోడ్డులు షాపులతో పాటు, తోపుడ బండ్లు కూడా ఎక్కువగా ఉంటాయి. దీంతో ప్రతీ బండిని బాంబ్‌ స్క్వాడ్ తనిఖీలు చేసింది. అయితే బాంబు ఉన్నట్టు ఎటువంటి ఆనవాళ్లు కనిపించడం లేదని పోలీసులు చెబుతున్నారు. తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయి. మరో రెండు గంటల పాటు బాంబు స్క్వాడ్ తనిఖీలు చేసే అవకాశం ఉంది. బాంబు కాల్ నేపథ్యంలో బీసెంట్ రోడ్డులో అన్ని షాపులను మూసి వేయించడంతో పాటు ఈ రోడ్డులో సామాన్య ప్రజలు, వ్యాపారులను ఎవరినీ కూడా రానీయకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. బీసెంట్ రోడ్డులో భారీగా బందోబస్తును కల్పించారు. తనిఖీలు ముగిసే వరకు ఎటువంటి కార్యకలాపాలు నిర్వహించకూడదని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. తనిఖీలు ముగిసిన తర్వాత బాంబు కాల్‌పై పోలీసులు అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉంది.


రైల్వే స్టేషన్‌కు బాంబు బెదిరింపు

బీసెంట్ రోడ్డులో బాంబు లేదని ఊపరిపీల్చుకున్న పోలీసులకు మరో బాంబు బెదిరింపు కాల్ ఉలిక్కిపడేలా చేసింది. విజయవాడ రైల్వే స్టేషన్‌‌లో బాంబు పెట్టామంటూ ఓ ఆగంతకుడు కంట్రోల్‌ రూమ్‌కు కాల్ చేశాడు. హిందీలో మాట్లాడటంతో అప్రమత్తమైన జీఆర్‌పీ, సీఎస్‌డబ్ల్యూ, బాంబు స్క్వాడ్ బృందాలు రైల్వే స్టేషన్‌లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. మహారాష్ట్ర లాతూర్ నుంచి కాల్ వచ్చినట్లు పోలీసులు నిర్ధారించారు. బాంబు పెట్టినట్లు చెప్పిన సదరు ఆగంతకుడు ఆ తరువాత ఫోన్‌ను స్విచ్‌ ఆఫ్ చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. బాంబు బెదిరింపు కాల్ నేపథ్యంలో స్టేషన్‌లో ప్రయాణికులను, ప్లాట్ ఫామ్‌లను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

కడపలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

బంగారం, వెండి ధరలు తగ్గాయోచ్..

Read latest AP News And Telugu News

Updated Date - May 24 , 2025 | 01:03 PM