Kadapa Road Accident: కడపలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
ABN , Publish Date - May 24 , 2025 | 10:54 AM
Kadapa Road Accident: కడప జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. రాయచోటి ప్రధాన రహదారిలోని గువ్వల చెరువు ఘాట్ వద్ద ప్రమాదం జరిగింది.
కడప, మే 24: ఆంధ్రప్రదేశ్‌లో వరుస ప్రమాదాలతో (Road Accident) రోడ్లు నెత్తురోడుతున్నాయి. తాజాగా కడప జిల్లాలో (Kadapa District) ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కడప-రాయచోటి ప్రధాన రహదారి గువ్వల చెరువు ఘాట్‌లో ఇవాళ (శనివారం) రోడ్డు ప్రమాదం సంభవించింది. కారును లారీ ఢీకొన్న ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయారు. ఘాట్‌లోని నాలుగో మలుపు వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతుల్లో ఇద్దరు పెద్దలు, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
పెద్ద శబ్ధంతో ప్రమాదం జరగడంతో స్థానికులు గమనించి వాహనాల వద్దకు పరుగులు తీశారు. అలాగే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. లారీ ఢీకొనడంతో కారులో ఉన్నవారు అందులోకి చిక్కుకుపోయారు. దీంతో పోలీసులు, స్థానికులు కలిసి వారిని కారులో నుంచి బయటకు తీశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతులు బద్వేల్ ప్రాంతానికి చెందిన వారుగా గుర్తించారు. బెంగళూరు నుంచి కారులో బద్వేల్‌కు వెళుతుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మంత్రి సవిత దిగ్భ్రాంతి

కడప జిల్లాలో జరిగిన ప్రమాదంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి సవిత (Minister Savitha) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో నలుగురు మృతి చెందడంపై విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ప్రమాదంపై ఎస్పీ అశోక్ కుమార్‌తో మంత్రి ఫోన్‌లో మాట్టాడారు. దుర్ఘటనపై ఆరా తీశారు. మృతులను గుర్తించి బాధిత కుటుంబాలకు సత్వర సమాచారం ఇవ్వాలని.. ఎస్పీ అశోక్ కుమార్‌ను మంత్రి సవిత ఆదేశించారు.
ఈ ఘటన బాధాకరం: మంత్రి రాంప్రసాద్

కడప జిల్లా గువ్వలచెరువు ఘాట్ రోడ్డులో లారీ, కారు ఢీకొన్న ఘటన బాధాకరమని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి (Minister Mandipalli Ramprasad Reddy) అన్నారు. నలుగురి మరణం దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. రోడ్డు ప్రమాదాలు తీరని విషాదాన్ని నింపుతున్నాయని.. ప్రయాణికుల రోడ్డు భద్రత నియమాలు విధిగా పాటించాలని అన్నారు. రోడ్డు ప్రయాణాలలో భద్రత కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.
కాగా, దేశవ్యాప్తంగా ప్రతి రోజూ ఎక్కడో ఒక చోట రోడ్డు ప్రమాదాలు సంభవిస్తూనే ఉన్నాయి. శుక్రవారం నాడు సైతం ప్రకాశం జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది. కొమరోలు మండలం తాటిచెర్లమోటు వద్ద కారును ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టగా.. కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందారు. ఇలా రోడ్డు ప్రమాదాల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోవడం అందరినీ తీవ్రంగా కలచివేస్తోంది. అతి వేగంతో ఎంతో మంది కుటుంబసభ్యులకు దూరమవుతున్నారు. అప్పటివరకూ తమతో మాట్లాడిన వారు ఇలా రోడ్డుప్రమాదాల బారిన పడి మృత్యుఒడిలోకి వెళ్లడంతో బాధిత కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
నీతి ఆయోగ్ భేటీ.. తెలుగు రాష్ట్రాల కోసం ప్రత్యేక వ్యూహాలు
బంగారం, వెండి ధరలు తగ్గాయోచ్..
Read latest AP News And Telugu News