AP Assembly Questions: వివిధ అంశాలపై ఎమ్మెల్యేల ప్రశ్నలు.. మంత్రుల సమాధానం
ABN , Publish Date - Sep 25 , 2025 | 11:49 AM
షిప్ బిల్డింగ్ యూనిట్, ఘంటసాల వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజీకి శాశ్వత భవనాలు నిర్మాణం, మహిళలకు కుట్టుమిషన్ల శిక్షణ, బొబ్బిలిలో గ్రోత్ సెంటర్‌లో అవకతవకలపై ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు ఆయా శాఖల మంత్రులు సమాధానం ఇచ్చారు.
అమరావతి, సెప్టెంబర్ 25: ఏపీ అసెంబ్లీ సమావేశాలు (AP Assembly) ఆరో రోజుకు చేరుకున్నాయి. సభ మొదలైన వెంటనే స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రశ్నోత్తాలను చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని వివిధ అంశాలపై ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇచ్చారు. షిప్ బిల్డింగ్ యూనిట్, ఘంటసాల వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజీకి శాశ్వత భవనాలు నిర్మాణం, మహిళలకు కుట్టుమిషన్ల శిక్షణ, బొబ్బిలిలో గ్రోత్ సెంటర్‌లో అవకతవకలపై ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు ఆయా శాఖల మంత్రులు సమాధానం ఇచ్చారు.
ప్రభుత్వ పరిశీలనలో షిప్ బిల్డింగ్ యూనిట్: మంత్రి బీసీ జానర్ధన్
రాష్ట్రంలో షిప్ బిల్డింగ్ యూనిట్, షిప్ బ్రేకింగ్ యూనిట్ ఏర్పాటుపై బీజేపీ ఎమ్మెల్యేలు ఎన్. ఈశ్వరరావు, కామినేని శ్రీనివాస్ ప్రశ్నించారు. యూనిట్ల ఏర్పాటుకు త్వరగా చర్యలు తీసుకోవాలని సభ్యులు కోరారు. షిప్ బిల్డింగ్ యూనిట్ ఏర్పాటుకు కేంద్రం నిధులు ఇస్తుందని వెల్లడించారు. దీని ద్వారా ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు ఉంటాయని సభ్యులు వెల్లడించారు. దీనిపై మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి సమాధానం ఇస్తూ.. షిప్ బిల్డింగ్ యూనిట్ ప్రభుత్వం పరిశీలనలో ఉందన్నారు. మారిటైం బోర్డుతో దీనిపై సంప్రదింపులు చేస్తున్నామని.. రాష్ట్రంలో ఆరు ఫిషింగ్ హార్బర్ల పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి జనార్ధన్ రెడ్డి సభలో తెలియజేశారు.
త్వరలోనే పాలిటెక్నిక్ కాలేజీలకు భవనాలు: మంత్రి అచ్చెన్న
కృష్ణా జిల్లా ఘంటసాల వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజీకి శాశ్వత భవనాలు నిర్మాణంపై ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ ప్రశ్నించారు. భవనాలు లేకపోవటంతో గిరిజన హాస్టల్‌లో కాలేజి నిర్వహిస్తున్నారని సభ దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో శాశ్వత ప్రాతిపదికన సిబ్బంది నియామకం జరగాలని ఎమ్మెల్యే కోరారు.
దీనిపై వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. గతంలో టీడీపీ ప్రభుత్వం ప్రారంభించిన వాటిని వైసీపీ ఆపివేసిందని.. గతంలో ఏ ప్రభుత్వం ఇలా చేయలేదని విమర్శించారు. వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజీలకు శాశ్వత భవనాలు నిర్మించేందుకు రూ. 25 కోట్లతో ప్రతిపాదనలు ఇచ్చామన్నారు. ప్రస్తుతం నడుస్తున్న భవనాల్లో అవసరమైన సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం భవనాలు కూడా వైసీపీ పూర్తి చేయలేదని వ్యాఖ్యలు చేశారు. తాము వచ్చాక భవనాలు పూర్తి చేస్తున్నామని చెప్పుకొచ్చారు. ఆర్థిక పరిస్థితి మెరుగు పడగానే పాలిటెక్నిక్ కళాశాలలకు భవనాలను నిర్మిస్తామని సభలో మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు.
వారికి కోసం ప్రభుత్వం చిత్త శుద్ధితో ఉంది: మంత్రి సవిత
ఇక.. మహిళలకు కుట్టు మిషన్ల శిక్షణపై అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
సవిత సమాధానం ఇచ్చారు. మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని తెలిపారు. మహిళలకు కుట్టు మిషన్లు, ఎంబ్రీయిడరి డిజైన్స్‌పై శిక్షణ ఇస్తున్నామన్నారు. వారికి పెద్ద ఎత్తున స్వయం ఉపాధి కల్పించే దిశగా చర్యలు తీసుకుంటామని మంత్రి సవిత పేర్కొన్నారు.
గ్రోత్ సెంటర్‌లో అవకతవకలపై..
అలాగే... బొబ్బిలిలోని గ్రోత్ సెంటర్‌లో జరిగిన అవకతవకలపై అసెంబ్లీలో ప్రశ్న లేవనెత్తారు బొబ్బిలి శాసనసభ్యులు ఆర్వీఎస్ కేకే రంగారావు. ఐదు మండలాల ప్రజలకు ఈ గ్రోత్ సెంటర్ ద్వారా ఉపాధి కల్పించేందుకు ఏర్పాటు చేశారని తెలిపారు. వైసీపీ హయాంలో గ్రోత్ సెంటర్లో యూనిట్ల కేటాయింపులో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ఫెర్రో అలాయిస్ పరిశ్రమల గ్రోత్ సెంటర్లు ఏర్పాటు చేస్తే అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. గ్రోత్ సెంటర్‌కు ప్రస్తుతం సరఫరా చేస్తున్న నీరు సరిపోవడం లేదని.. సరఫరా పెంచాలని ఎమ్మెల్యే కేకే రంగారావు కోరారు.
దీనికి మంత్రి టీజీ భరత్ సమాధానం ఇస్తూ.. గ్రోత్ సెంటర్ అభివృద్ధి కోసం చర్యలు తీసుకుంటామన్నారు. మినీ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ఎవరైనా ముందుకు వస్తే పరిశీలిస్తామని చెప్పారు. వైసీపీ హయాంలో అడ్డగోలుగా ఇచ్చిన యూనిట్లను రద్దు చేస్తామని ప్రకటించారు. గ్రోత్ సెంటర్‌లో నైపుణ్యాబివృద్ధి కేంద్రం ఏర్పాటును పరిశీలిస్తామని మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
లిక్కర్ స్కామ్‌లో మాజీ సీఎం కొడుకు అరెస్ట్..ఇక తర్వాత..
కడప ఇన్‌ఛార్జి మేయర్‌గా ముంతాజ్ బేగం
Read Latest AP News And Telugu News