Pulivendula Ontimitta Bye Elections: పులివెందుల, ఒంటిమిట్ట ఉప ఎన్నికలు ప్రారంభం.. ఎంపీ అవినాష్‌రెడ్డి అరెస్ట్
ABN , Publish Date - Aug 12 , 2025 | 07:25 AM
ఉమ్మడి కడప జిల్లాలో మంగళవారం పులివెందుల, ఒంటిమిట్ట రెండు స్థానాల్లో జడ్పీటీసీ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉపఎన్నికల పోలింగ్ ఇవాళ ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం ఐదు గంటల వరకు బ్యాలెట్ విధానంలో ఓటింగ్ జరుగనుంది.
కడప, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి కడప జిల్లాలో ఇవాళ (మంగళవారం) పులివెందుల (Pulivendula), ఒంటిమిట్ట (Ontimitta) రెండు స్థానాల్లో జడ్పీటీసీ ఉప ఎన్నికలు (ZPTC Bye Elections) జరుగుతున్నాయి. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉపఎన్నికల పోలింగ్ ఇవాళ ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం ఐదు గంటల వరకు బ్యాలెట్ విధానంలో ఓటింగ్ జరుగనుంది. పులివెందులలో తెలుగుదేశం, వైసీపీ ఇరుపార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఉప ఎన్నిక టెన్షన్‌గా మారింది. కడప కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు 1,400 మంది పోలీసులను నియమించారు. డీఐజీ కోయప్రవీణ్ ఆధ్వర్యంలో కడప ఎస్పీ అశోక్ కుమార్ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
పులివెందుల బరిలో 11మంది అభ్యర్థులు..
పులివెందుల బరిలో రెండు ప్రధాన పార్టీలతో కలిపి 11మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. పులివెందుల నుంచి టీడీపీ జడ్పీటీసీ సభ్యురాలిగా మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి సతీమణి లతారెడ్డి పోటీ చేస్తుండగా.. వైసీపీ నుంచి హేమంత్‌రెడ్డి బరిలో ఉన్నారు. ఉప ఎన్నికల ఎత్తుగడలో భాగంగా స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో ఉన్న 8 మంది వైసీపీకి చెందినవారే ఉండటం గమనార్హం. పులివెందుల జడ్పీటీసీ 6 గ్రామ పంచాయతీల పరిధిలో 15 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం ఓటర్లు 10,601 మంది ఉన్నారు. మొత్తం 100 మంది ఎన్నికల అధికారులు, సిబ్బంది విధుల్లో పాల్గొన్నారు. పులివెందుల జడ్పీటీసీ పరిధిలో అన్ని సమస్యాత్మక గ్రామాలు కావడంతో 700 మందితో భారీగా పోలీసు భద్రత నిర్వహిస్తున్నారు.
ఒంటిమిట్టలో 33 పోలింగ్ కేంద్రాలు..
ఒంటిమిట్ట జడ్పీటీసీకి సంబంధించి ప్రధాన పార్టీలతో కలిపి బరిలో 11మంది అభ్యర్థులు ఉన్నారు. ఒంటిమిట్టలో టీడీపీ నుంచి ఉప ఎన్నిక కోసం అద్దలూరు ముద్దుకృష్ణారెడ్డి, వైసీపీ నుంచి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి పోటీ చేస్తున్నారు. ఒంటిమిట్ట జడ్పీటీసీకి 13 గ్రామ పంచాయతీల పరిధిలో 33 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. మొత్తం ఓటర్లు 24,606 ఉన్నారు. ఒంటిమిట్ట జడ్పీటీసీ పరిధిలో 700 మందితో భారీగా పోలీసులు భద్రత నిర్వహిస్తున్నారు.
వైసీపీ, టీడీపీ నేతల అరెస్ట్...
పులివెందుల, ఒంటిమిట్ట రెండు స్థానాల్లో జడ్పీటీసీ ఉప ఎన్నికలు జరుగుతుండటంతో కడప జిల్లా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఎన్నికల సందర్భంగా ఎలాంటి ఘర్షణలు చోటుచేసుకోకుండా పలువురు టీడీపీ, వైసీపీ నేతలను ముందస్తు అరెస్ట్ చేశారు. పులివెందులలో వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డిని తన నివాసంలో పోలీసులు అరెస్టు చేశారు. ఎంపీని అరెస్టు చేసి పోలీసు వాహనంలో ఇంటి నుంచి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అలాగే పులివెందులలో టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు.
టీడీపీ కార్యకర్తలపై దాడి..
పులివెందులలో టెన్షన్ వాతావరణం నెలకొంది. పులివెందులలో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ గుండాలు దాడి చేశారు. కానేపల్లె నుంచి అచ్చవెళ్లికి వెళ్తున్న టీడీపీ శ్రేణులపై దాడికి పాల్పడ్డారు. ఓటు వేయడానికి వెళ్తున్న వారి కారును వైసీపీ గుండాలు ధ్వంసం చేశారు. పులివెందులలో కర్నూలు రేంజ్ డీఐజీ ప్రవీణ్ బందోబస్తు పర్యవేక్షిస్తున్నారు. అయితే, ఒంటిమిట్ట వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి పోలింగ్ బూతుల వద్ద బౌన్సర్లతో హల్‌చల్ చేశారు
ఈ వార్తలు కూడా చదవండి..
ఏపీలో క్రీడల అభివృద్ధి లబ్ధిదారులు లేరు
ముందస్తు బెయిల్‌కు సురేశ్‌బాబు అనర్హుడు
For More AndhraPradesh News And Telugu News