Kodumur Village: కొండలరాయుడికి వృశ్చికం సమర్పయామి
ABN , Publish Date - Aug 12 , 2025 | 06:39 AM
ఏ దేవాలయంలోనైనా.. ఆ దేవుడికి ఇష్టమైన నైవేద్యం అంటూ ఫలమో పత్రమో, పిండి వంటకాలో భక్తిశ్రద్ధలతో సమర్పించడం సర్వసాధారణం. కానీ, కర్నూలు జిల్లా కోడుమూరు మండలంలోని ఓ ఆలయంలో మాత్రం...
ఇష్టదైవానికి నైవేద్యంగా తేళ్లు.. కోడుమూరులో వింత ఆచారం
కోడుమూరు, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): ఏ దేవాలయంలోనైనా.. ఆ దేవుడికి ఇష్టమైన నైవేద్యం అంటూ ఫలమో పత్రమో, పిండి వంటకాలో భక్తిశ్రద్ధలతో సమర్పించడం సర్వసాధారణం. కానీ, కర్నూలు జిల్లా కోడుమూరు మండలంలోని ఓ ఆలయంలో మాత్రం ఏళ్లతరబడి వింత ఆచారం నడుస్తోంది. కోడువ ుూరు పట్టణానికి సుమారు 3 కిలోమీటర్ల దూరం ఎత్తులో ఉన్న ఎర్రటి కొండపై వెలసిన కొండల రాయుడుస్వామికి (వేంకటేశ్వరస్వామి)ఇక్కడి భక్తులు తేళ్లను సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. ఏటా శ్రావణమాసం మూడో సోమవారం ఈ ఆచారాన్ని భక్తులు ఆచరిస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం సాయంత్రం పెద్ద సంఖ్యలో భక్తులు కాలినడకన కొండపైకి చేరుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఇక్కడ చిన్న పిల్లలు కూడా తేళ్లను పట్టుకొని స్వామికి సమర్పించడం విశేషం. ముందుగా స్వామిని దర్శించుకుని, భక్తితో కొండపైననున్న ఏ చిన్న రాయిని కదిపినా తేళ్లు దర్శనమిస్తాయి. వాటిని పట్టుకుని దారం కట్టి స్వామికి నైవేద్యంగా విగ్రహంపై వదిలేస్తారు. ఇదే ఇక్కడి ప్రత్యేకత. ఇలా చేయడం వల్ల అనుకొన్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయని భక్తుల నమ్మకం. కొండ చుట్టూ ఉన్న రైతులు కూడా పంట వేసే ముందు.. వర్షాలు అనుకూలించి పంట దిగుబడి రావాలని స్వామికి పూజలు చేస్తారు.