JC Prabhakar Vs Pedda Reddy: తాడిపత్రిలో పొలిటికల్ హీట్.. నువ్వొస్తానంటే.. నే రానిస్తానా..!
ABN , Publish Date - Sep 03 , 2025 | 10:04 AM
తాడిపత్రిలో పొలిటికల్ హీట్ నెలకొంది. నేడు వైసీపీ కీలక నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లనుండటంతో టెన్షన్ వాతవారణం నెలకొంది.
అనంతపురం: మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు కేతిరెడ్డి పెద్దారెడ్డి బుధవారం తాడిపత్రికి వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. సుప్రీం కోర్టు అనుమతి ఉన్నందున ఇక తనకు అడ్డు చెప్పవద్దని ఆయన పోలీసులను కోరినట్లు తెలిసింది. ఈ విషయం తెలిగాయనే మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఎప్పటిలాగే తన ఏర్పాట్లు తాను ప్రారంభించారు. మార్కెట్ యార్డులో గోడౌన్ ను బుధవారం ప్రారంభిస్తున్నామని, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. దీంతో పట్టణంలో మరోమారు టెన్షన్ వాతావరణం నెలకొంది. వినాయక విగ్రహాల నిమజ్జనోత్సవం సందర్భంగా మూడు రోజుల క్రితం పట్టణంలో ఘర్షణ జరిగింది. టీడీపీకి చెందిన జేసీ ప్రభాకర్ రెడ్డి, కాకర్ల రంగనాథ్ వర్గీయులు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఇప్పుడు పెద్దారెడ్డి వచ్చేందుకు సిద్ధం కావడంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు.
రావడం.. అడ్డుకోవడం..
పెద్దారెడ్డి తాడిపత్రివైపు వచ్చిన ప్రతిసారీ పోలీసులు అడ్డుకుంటున్నారు. శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని తిప్పి పంపుతున్నారు. దీంతో ఆయన అనంతపురానికి లేదా తిమ్మంపల్లికి పరిమితమౌతున్నారు. కోర్టుల అనుమతి తెచ్చుకున్నా తాడిపత్రిలో అడుగుపెట్టడం ఆయనకు సాధ్యం కాలేదు. ఇన్నాళ్లూ ‘రానిచ్చేది లేదు..’ అని ఖరాకండిగా చెబుతూ వచ్చిన జేసీ ప్రభాకర్ రెడ్డి. ఇప్పుడు కొత్త పల్లవి అందుకున్నారు. ‘నేను కాదు.. ప్రజలు అడ్డుకుంటున్నారు’.. అని అంటున్నారు. పెద్దారెడ్డి వస్తానన్న ప్రతిసారీ ఏదో ఒక కార్యక్రమం పేరిట తన అనుచరగణాన్ని తాడిపత్రికి రప్పించుకుంటున్నారు. ఈ వ్యవహారం పోలీసులకు తలనొప్పిగా మారింది.
అప్పుడు మొదలైంది..
2024 ఎన్నికల సమయంలో వైసీపీ, టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో కేసులు నమోదు చేసిన పోలీసులు రెండు పార్టీల ముఖ్య నాయకులను మూడు నెలలపాటు తాడిపత్రి నుంచి బహిష్కరించారు. కౌంటింగ్ పూర్తి అయిన మూడు నెలల తరువాత జేసీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్వే జేసీ అశ్మిత్ రెడ్డి తాడిపత్రికి వచ్చారు. కానీ పెద్దారెడ్డి మాత్రం అడుగుపెట్టడం లేదు. పలుమార్లు కోర్టును ఆశ్రయించి, అనుమతి పొందారు. కానీ శాంతిభద్రతల సమస్య పేరిట పోలీసులు అడ్డుకుంటున్నారు. ఇటీవల పోలీసులే వెంట ఉండి తాడిపత్రికి వంపాలని కోర్టు ఆదేశించింది. అదే రోజు అనంతపురం రోడ్డులోని ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద శివుడి విగ్రహావిష్కరణ పేరిట జేసీ ప్రభాకర్ రెడ్డి తన అనుచరగణాన్ని మోహరించారు. తాజాగా గోడౌన్ ప్రారంభోత్సవం పేరిట అందరినీ తాడిపత్రికి రమ్మన్నారు. గడిచిన 18 నెలలుగా టామ్ అండ్ జెర్రీ గేమ్‌ను తలపించేలా ఇదే తంతు కొనసాగుతోంది.
ప్లీజ్.. రావద్దు..
తాడిపత్రికి రావద్దని పెద్దారెడ్డిని పోలీసులు కోరినట్లు తెలిసింది. పట్టణ సీఐ సాయిప్రసాద్ సెలవులో ఉన్నారు. రూరల్ సీఐ శివగంగాధర్ రెడ్డి ఇన్చార్జిగా ఉన్నారు. పెద్దారెడ్డి వస్తే శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని, టౌన్, రూరల్ ప్రాంతాలలో ఇరువర్గాలను కట్టడి చేయడం సాధ్యం కాదని పోలీసులు ఆందోళన చెందుతున్నారు. రూరల్ సీఐకి రెండు బాధ్యతలు ఇబ్బందికరంగా ఉన్నాయని, ఇతరులకు పట్టణ బాధ్యతలు అప్పగించాలన్న ఆలోచనలో ఉన్నతాధికారులు ఉన్నట్లు తెలిసింది. అంతవరకూ తాడిపత్రికి రావద్దని పెద్దారెడ్డిని పోలీసులు కోరినట్లు తెలిసింది. దీనికి ఆయన ఒప్పుకోలేదని సమాచారం. తనకు సుప్రీం కోర్టు అనుమతి ఉందని, ప్రతిసారీ అడ్డుకోవడం సరికాదని అన్నట్లు సమాచారం. ‘మీరు ఎప్పుడు. వెళ్లమంటే అప్పుడే వెళతా. కానీ మీరు ప్రతి సారీ అడ్డుకుంటున్నారు. ఫలానా రోజు అనుమతిస్తామని లిఖితపూర్వకంగా ఇవ్వండి. అప్పుడే మీ మాటలు నమ్ముతా..’ అని పెద్దారెడ్డి అన్నట్లు తెలిసింది. దీంతో వారు వెనుదిరిగినట్లు సమాచారం. సుప్రీం కోర్టు అనుమతి ఉన్నందున ఈసారైనా పెద్దారెడ్డి ఎంట్రీ సాధ్యమవుతుందా అన్న చర్చ జరుగుతోంది.
Also Read:
ప్రపంచంలో అత్యధికంగా సందర్శించబడుతున్న దేశం ఏదో తెలుసా?
వీరికి మరింత చౌకగా ఎయిర్ ఇండియా ప్రయాణం..అదిరే ఆఫర్
For More Latest News