YS Jagan : చంద్రబాబూ... మీ తప్పులను ప్రజలు రికార్డు చేస్తున్నారు
ABN , Publish Date - Feb 15 , 2025 | 06:21 AM
‘చంద్రబాబూ... మీ తప్పులను ప్రజలే తమ డైరీల్లో రికార్డు చేసుకుంటున్నారు. తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరిస్తున్నా’ అని మాజీ సీఎం జగన్ హెచ్చరించారు.

తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరిస్తున్నా
వంశీ అరెస్టును, అబ్బయ్యపై అక్రమ కేసులను తీవ్రంగా ఖండిస్తున్నా: మాజీ సీఎం జగన్
అమరావతి, ఫిబ్రవరి 14(ఆంధ్రజ్యోతి): ‘చంద్రబాబూ... మీ తప్పులను ప్రజలే తమ డైరీల్లో రికార్డు చేసుకుంటున్నారు. తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరిస్తున్నా’ అని మాజీ సీఎం జగన్ హెచ్చరించారు. వంశీ అరెస్టు, అబ్బయ్య చౌదరిపై కేసు ఘటనలపై శుక్రవారం ఆయన స్పందించారు. ‘చంద్రబాబూ... ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 సహా మొత్తం 143 హామీలను నిలబెట్టుకోలేక, ఒక్కదాన్ని కూడా అమలు చేయక, అంతకుముందున్న పథకాలను సైతం రద్దుచేసి, ప్రజలను సంక్షోభంలోకి నెట్టారు. ప్రజల దృష్టి మళ్లించడానికి మా పార్టీకి చెందిన నాయకులను, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని తప్పుడు కేసులు, తప్పుడు సాక్షులతో అక్రమ అరెస్టులకు దిగుతున్నారు. మాజీ ఎమ్మెల్యే వంశీ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నా. వంశీ భద్రతకు ఎలాంటి సమస్య వచ్చినా ఈ ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహించాలి. టీడీపీ కార్యకర్తలు దళిత యువకుడి ఇంటికి వెళ్లి బెదిరించి, భయపెట్టం కరెక్టేనా? ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వమేనా? కొఠారు అబ్బయ్య చౌదరిపై తప్పుడు కేసు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. తప్పులు టీడీపీవారు చేస్తే అబ్బయ్య చౌదరిపై పోలీసులు కేసు పెడతారా? ఇది రాజ్యాంగానికి తూట్లు పొడవడం కాదా?’ అని జగన్ ప్రశ్నించారు.