Share News

Polavaram Review: పోలవరంలో నేటి నుంచే నిపుణుల పర్యటన

ABN , Publish Date - May 05 , 2025 | 05:24 AM

పోలవరం డయాఫ్రం వాల్‌, ఈసీఆర్‌ఎఫ్‌ డ్యాం పనులపై అమెరికా, కెనడా నిపుణులు నేటి నుంచి ప్రత్యక్ష పర్యవేక్షణ ప్రారంభించనున్నారు. నాణ్యత, డిజైన్‌లను సమీక్షించి 2027 నాటికి పనులు పూర్తయ్యేందుకు మార్గదర్శనం చేయనున్నారు

Polavaram Review: పోలవరంలో నేటి నుంచే నిపుణుల పర్యటన

  • డయాఫ్రం వాల్‌ పనుల్లో నాణ్యత పరిశీలన

  • ఈసీఆర్‌ఎఫ్‌ డ్యాంపై సమీక్ష

  • 8 దాకా ప్రాజెక్టు వద్దే అమెరికా, కెనడా నిపుణులు

  • వెంట జలసంఘం, పీపీఏ, వాప్కోస్‌, జలవనరుల శాఖ అధికారులు కూడా

అమరావతి, మే 4 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యాం పనుల్లో అత్యంత కీలకమైన డయాఫ్రం వాల్‌ నిర్మాణం.. ఎర్త్‌ కమ్‌ రాక్‌ఫిల్‌ (ఈసీఆర్‌ఎఫ్‌) డ్యాం పనులు త్వరితగతిన ముందుకు సాగడంపై అంతర్జాతీయ నిపుణులు దిశానిర్దేశం చేయనున్నారు. వీరు ప్రాజెక్టు ప్రాంతంలో సోమవారం నుంచి 8వ తేదీ దాకా మకాం వేసి వాల్‌ పనుల్లో నాణ్యత, ఈసీఆర్‌ఎఫ్‌ డ్యాం డిజైన్లు పరిశీలిస్తారు. సలహాలు, సూచనలు ఇస్తారు. అమెరికాకు చెందిన డేవిడ్‌ బి.పాల్‌, జియాన్‌ ఫ్రాంకో డి సిక్కో.. కెనడాకు చెందిన సీన్‌ హెంచ్‌బెర్గర్‌, రిచర్డ్‌ డొనెల్లీ ఆదివారం రాజమహేంద్రవరం చేరుకున్నారు. గురువారర వరకూ ప్రాజెక్టు వద్దే ఉంటారు. వారి వెంట కేంద్ర జల సంఘం, పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ), సెంట్రల్‌ సాయిల్‌ అండ్‌ మెటీరియల్‌ రీసెర్చ్‌ స్టేషన్‌ (సీఎస్‌ఎంఆర్‌ఎస్‌), వాప్కోస్‌, రాష్ట్ర జలవనరుల శాఖ, అధికారులు, కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులు పాల్గొంటారు. సమీక్షల్లో పాలుపంచుకుంటారు. నిపుణులు సోమవారర ఉదయం వాల్‌ పనులు పరిశీలిస్తారు.


ఎగువ కాఫర్‌ డ్యాంను పటిష్ఠపరిచే చర్యలు, గ్రౌండ్‌ ఇంప్రూవ్‌మెంట్‌ పనులను పరిశీలిస్తారు. మంగళవారం ఈసీఆర్‌ఎఫ్‌ డ్యాం నిర్మాణంలో అత్యంత కీలకమైన గ్యాప్‌-1లో చేపట్టాల్సిన నిర్మాణ విధివిధానాలు, ఆ ప్రాంతంలో నేల గట్టిదనాన్ని పరిశీలిస్తారు. తర్వాత ఈసీఆర్‌ఎఫ్‌ డిజైన్లపై జల సంఘం, సీఎస్‌ఎంఆర్‌ఎస్‌, వాప్కోస్‌లతో సమీక్షించి.. తమ అభిప్రాయాలు, ఆలోచనలు పంచుకుంటారు. మధ్యాహ్నం గ్యాప్‌-1లో చేపడుతున్న పనులపై చేపట్టిన నమూనా పరీక్షల ఫలితాలపై అభిప్రాయం చెబుతారు. ఈసీఆర్‌ఎఫ్‌ డ్యాం నిర్మాణం కోసం సమీకరించిన మెటీరియల్‌ను పరిశీలిస్తారు. బుధవారరనాడు గ్యాప్‌-2లో చేపట్టాల్సిన పనులను సమీక్షించి, తగు సూచనలూ ఇస్తారు. పర్యటనలో చివరి రోజైన గురువారం కేంద్ర జల సంఘం రూపొందించిన ‘ప్రిమావేరా’ యాప్‌కు అనుగుణంగా పోలవరం ప్రాజెక్టు ఇంజనీరింగ్‌ అధికారులు క్రమపద్ధతిలో పనులు చేపడుతున్నారో లేదో నిపుణులు పరిశీలిస్తారు. కుంగిపోయిన గైడ్‌బండ్‌ లోపాల సవరణకు శాశ్వత పరిష్కార మార్గాలను సూచిస్తారు. అప్రోచ్‌ చానల్‌పైనా తమ అభిప్రాయం చెబుతారు. డయాఫ్రం వాల్‌, ఈసీఆర్‌ఎఫ్‌ డ్యాం పనుల కోసం చేపట్టిన కార్యాచరణ గురించి వారికి ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావు, పోలవరం ప్రాజెక్టు చీఫ్‌ ఇంజనీర్‌ నరసింహమూర్తి వివరిస్తారు. అమెరికా, కెనడా నిపుణులు ఇచ్చే సూచనలు 2027 డిసెంబరు నాటికి ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యేందుకు దోహదపడతాయన్న విశ్వాసాన్ని జలవనరుల శాఖ అధికారులు వ్యక్తం చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తిరుమలలో భారీ వర్షం.. భక్తుల పరుగులు.. (ఫోటో గ్యాలరీ)

నకిలీ దేశ గురువు మాయాజాలం

For More AP News and Telugu News

Updated Date - May 05 , 2025 | 05:24 AM