Share News

Quantum Tech Park: అమరావతిలో క్వాంటమ్‌ వ్యాలీ

ABN , Publish Date - May 03 , 2025 | 03:54 AM

అమరావతిలో దేశంలోనే తొలి క్వాంటమ్‌ వ్యాలీ టెక్‌ పార్క్‌ ఏర్పాటు కానుంది. ఐబీఎం, టీసీఎస్‌, ఎల్‌ అండ్‌ టీ సంస్థలతో ఒప్పందంతో 156 క్యూబిట్‌ క్వాంటమ్‌ సిస్టమ్‌-2 ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు

Quantum Tech Park: అమరావతిలో క్వాంటమ్‌ వ్యాలీ

  • దేశంలోనే తొలి టెక్‌ పార్క్‌ ఏర్పాటుకు నిర్ణయం

  • ఐబీఎం, టీసీఎస్‌, ఎల్‌ అండ్‌ టీతో ఒప్పందం

  • శక్తివంతమైన, అత్యాధునిక సిస్టమ్‌ స్థాపన

  • క్యూబిట్‌ హెరాన్‌ ప్రాసెసర్‌తో ఐబీఎం క్వాంటమ్‌ సిస్టమ్‌-2 ఏర్పాటు

  • జనవరి ఒకటిన వ్యాలీ ప్రారంభం!

అమరావతి, మే 2(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర రాజధాని అమరావతి అధునాతన టెక్నాలజీ కేంద్రంగా మారుతోంది. దేశంలోనే అత్యంత పెద్దదైన, అత్యాధునిక క్వాంటమ్‌ కంప్యూటర్‌ ఇక్కడి క్వాంటమ్‌వ్యాలీ టెక్‌ పార్క్‌లో ఏర్పాటు కానుంది. ఈ మేరకు శుక్రవారం ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో ఆయన సమక్షంలో టెక్‌ దిగ్గజాలు ఐబీఎం, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌), ఎల్‌ అండ్‌ టీకు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య అవగాహనా ఒప్పందం జరిగింది. దీంతో వచ్చే ఏడాది జనవరి 1న దేశంలోనే తొలి టెక్‌ పార్క్‌ను ప్రారంభించనున్నారు. టెక్‌ దిగ్గజాలతో ఒప్పందం మేరకు ఆ టెక్‌ పార్క్‌లో అత్యాధునిక 156 క్యూబిట్‌ హెరాన్‌ క్వాంటమ్‌ ప్రాసెసర్‌ కలిగిన అతిపెద్ద ఐబీఎం క్వాంటమ్‌ సిస్టమ్‌ 2 జాతీయ స్థాయిలో తొలిసారిగా ఇక్కడ ఏర్పాటవుతుంది. దీనికి టీసీఎస్‌ సహకారం అందిస్తుంది. ఐబీఎం క్వాంటమ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ జే గాంబెట్టా, టీసీఎస్‌ సీటీవో హారిక్‌ విన్‌, టీసీఎల్‌ ప్రతినిధులు వి.రాజన్న, సీవీ శ్రీధర్‌ సమక్షంలో క్వాంటమ్‌ వ్యాలీ స్థాపన, పరిశోధనా కేంద్రం ఏర్పాటుపై సీఎం సమీక్షించారు. ఎంఓయూపై రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఐటీశాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్‌ సంతకం చేశారు.


ఒప్పందం చరిత్రాత్మకం: సీఎం చంద్రబాబు

క్వాంటమ్‌ వ్యాలీ ఏర్పాటుకు ఒప్పందం చేసుకోవడం చరిత్రాత్మకం అని సీఎం చంద్రబాబు అన్నారు. జనవరి 1న క్వాంటమ్‌ వ్యాలీ ప్రారంభంతో ఏపీలో కొత్త శకం మొదలవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అమరావతిలో ఏర్పాటు చేయబోయే క్వాంటమ్‌ వ్యాలీ ప్రాజెక్టు గురించి త్వరలోనే ప్రధాని మోదీకి సవివరంగా తెలియజేస్తానని సీఎం వివరించారు. ఐబీఎం, టీసీఎస్‌, ఎల్‌ అండ్‌ టీతో జరిగిన ఒప్పందం ఏపీకి మాత్రమే కాకుండా యావత్తు దేశానికే చరిత్రాత్మక ఘట్టం కానుందన్నారు. సాంకేతిక రంగంలో ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌, క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ వంటి కొత్త అవకాశాలు వస్తున్నాయని, భవిష్యత్తు అవసరాలన్నీ క్వాంటమ్‌ కంప్యూటింగ్‌పైనే ఆధారపడి ఉంటాయని పేర్కొన్నారు. క్వాంటమ్‌ వ్యాలీ ద్వారా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయన్నారు. సిలికాన్‌ వ్యాలీ తరహాలో క్వాంటమ్‌ వ్యాలీగా అమరావతిని తీర్చిదిద్దాలని ఐబీఎం, టీసీఎస్‌, ఎల్‌ అండ్‌ టీలను సీఎం కోరారు. హైదరాబాద్‌ హైటెక్‌ సిటీని 15 నెలల్లోనే నిర్మించామని, అదేవేగంతో అమరావతిలో క్వాంటమ్‌ వ్యాలీని నిర్మించాలని ఎల్‌ అండ్‌ టీని ఆదేశించారు. ఇప్పటికే క్వాంటమ్‌ వ్యాలీ కోసం స్థలం కేటాయించిన విషయాన్ని గుర్తుచేశారు.


క్వాంటమ్‌ జర్నీలో కీలక ఘట్టం

దేశంలో క్వాంటమ్‌ సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధికి జరుగుతున్న ప్రయాణంలో ఈ ఒప్పందం కీలక ఘట్టం అని టెక్‌ దిగ్గజ సంస్థల ప్రతినిధులు అన్నారు. ఆంధ్రప్రదేశ్‌తో జతకట్టడం చాలా సంతోషంగా ఉందన్నారు. టీసీఎస్‌ సహకారంతో స్థాపించబోయే క్వాంటమ్‌ వ్యాలీ టెక్‌ పార్క్‌ వల్ల అల్గోరిథమ్స్‌, అప్లికేషన్స్‌ అభివృద్ధి చేసేడెవలపర్స్‌కు, సైంటిస్టులకు, పరిశ్రమ నిపుణులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఐబీఎం క్వాంటమ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ జే గాంబెట్టా అన్నారు. సంప్రదాయ, క్వాంటమ్‌ సిస్టమ్‌లను కలిసిన ఈ హైబ్రిడ్‌ కంప్యూటర్ల ద్వారా వివిధ రంగాల్లో విప్లవాత్మక ఫలితాలు సాధించవచ్చని, దీంతో ఆర్థిక అభివృద్ధి సాధ్యమని టీసీఎస్‌ ప్రతినిధులు చెప్పారు.


అత్యాధునిక క్వాంటమ్‌ సిస్టమ్‌ 2

సంప్రదాయ కంప్యూటర్లు పరిష్కరించలేని సంక్లిష్ట సమస్యలను క్వాంటమ్‌ సిస్టమ్‌ 2 పరిష్కరిస్తుంది. ఐబీఎం అభివృద్ధి చేసిన ఈ నెక్స్ట్‌ జనరేషన్‌ క్వాంటమ్‌ కంప్యూటర్‌.. అటు సంప్రదాయ కంప్యూటర్ల డేటాను, ఇటు క్వాంటమ్‌ సిస్టం డేటాను ఒకేసారి విశ్లేషించగలదు. దీనిలో ఉన్న క్యూబిట్‌ హెరాన్‌ ప్రాసెసర్‌ను ఐబీఎం క్వాంటమ్‌ హెరాన్‌ అంటారు. 156 క్యూబిట్‌ (సంప్రదాయ కంప్యూటర్‌లో బైనరీ బిట్‌ వలే క్వాంటమ్‌ కంప్యూటర్‌లో క్యూబిట్‌) క్వాంటమ్‌ ప్రాసెసర్‌ను సంక్లిష్టత కలిగిన సమస్యలను పరిష్కరించేందుకు ఐబీఎం రూపొందించింది. దీంతో ఈగిల్‌ లాంటి ప్రాసెసర్లలోని ఎర్రర్‌ రేట్‌ తగ్గడంతో పాటు విశ్లేషణ వేగం పెరిగింది. ఇది ప్రతి సెకండ్‌కు 1.50 లక్షల సర్క్యూట్‌ లేయర్‌ ఆపరేషన్స్‌ దాటి వేగాన్ని అందుకోగలదు. ఐబీఎం ఇప్పటి వరకు తయారు చేసిన వేగవంతమైన క్వాంటమ్‌ ప్రాసెసర్‌ ఇదే. దీనినే దేశంలో మొదటిసారి అమరావతిలో ఐబీఎం స్థాపించబోతోంది.


ఇవి కూడా చదవండి

Chandrababu Naidu: ఉగ్రదాడి.. ప్రధాని మోదీ వెంటే ఉంటామన్న సీఎం చంద్రబాబు

Pawan Kalyan : భారతదేశానికి తలమానికం అమరావతి : ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

Updated Date - May 03 , 2025 | 03:54 AM