Share News

May Heat Alert: మే నెలలో మంటలే

ABN , Publish Date - May 01 , 2025 | 05:14 AM

మే నెలలో దేశవ్యాప్తంగా ఎండలు మంటలు పెట్టనున్నాయి. వాయవ్య, మధ్యభారతంలో వడగాడ్పులు తీవ్రమవుతాయని వాతావరణ శాఖ హెచ్చరిక.

May Heat Alert: మే నెలలో మంటలే

నైరుతి సీజన్‌లో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు

వాతావరణ శాఖ బులెటిన్‌ విడుదల

  • వాయవ్య, మధ్య, తూర్పుభారతంలో వడగాడ్పులు తీవ్రం

  • మన రాష్ట్రంలో మాత్రం వడగాడ్పులు ఉండవ్‌

  • నైరుతి సీజన్‌లో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు

విశాఖపట్నం, ఏప్రిల్‌ 30(ఆంధ్రజ్యోతి): దేశంలోని అనేక ప్రాంతాల్లో మే నెలలో ఎండ సెగలు పుట్టించనుంది. దక్షిణ, తూర్పుభారతంలోని కొన్ని ప్రాంతాల్లో వేడి తీవ్రత తక్కువగా ఉండే అవకాశం ఉంది. మే నెలలో ఎండలు, వడగాడ్పులు, వర్షపాతంపై భారత వాతావరణ శాఖ(ఐఎండీ) బుధవారం బులెటిన్‌ను విడుదల చేసింది. మే నెలలో అనేక ప్రాంతాలు... అంటే వాయవ్య, మధ్య, తూర్పు, పశ్చిమ, దక్షిణ భారతంలో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదు కానున్నాయి. కేరళ, దక్షిణ కర్ణాటక, తమిళనాడు, దానికి ఆనుకుని రాయలసీమలో కొద్దిప్రాంతం, ఇంకా పశ్చిమబెంగాల్‌, మేఘాలయ, సిక్కింలో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవుతాయి. రాత్రి ఉష్ణోగ్రతలు దేశంలోని అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతాయి.


హరియాణా, పంజాబ్‌, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, బిహార్‌, ఝార్ఖండ్‌, పశ్చిమ బెంగాల్‌, ఉత్తర ఒడిశా, ఉత్తర ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఉత్తర తెలంగాణ, ఉత్తర కర్ణాటకల్లో సాధారణం కంటే ఎక్కువ రోజులు వడగాడ్పులు వీయనున్నాయి. దక్షిణ భారతంలో ఉత్తర కర్ణాటక, ఉత్తర తెలంగాణ తప్ప మిగిలిన ఏపీ, తమిళనాడు, కేరళ, దక్షిణ కర్ణాటక, దక్షిణ తెలంగాణ, ఏపీకి ఆనుకుని దక్షిణ ఛత్తీస్‌గఢ్ లో వడగాడ్పులు వీచే అవకాశంలేదని ఐఎండీ పేర్కొంది. కాగా, మే నెలలో పలు ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదుకానుంది. కాగా, భారత్‌తో పాటు దక్షిణాసియా దేశాల్లోని ఎక్కువ ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాల సీజన్‌లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదుకానుంది. జూన్‌ నుంచి సెప్టెంబరు వరకు దక్షిణ, ఈశాన్య భారతంలోని కొన్ని ప్రాంతాలు, పాకిస్థాన్‌, నేపాల్‌లోని కొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షం కురవనుంది. మూడు రోజులుగా పుణెలో జరుగుతున్న 31వ సౌత్‌ ఏషియన్‌ క్లైమేట్‌ అవుట్‌లుక్‌ ఫోరం సదస్సులో వచ్చే నైరుతి రుతుపవనాల సీజన్‌ వర్షాలపై నివేదిక విడుదల చేశారు. పసిఫిక్‌ మహాసముద్రంలో లానినా దశ ముగిసింది. ప్రస్తుతం పసిఫిక్‌ మహాసముద్రంలో ఏర్పడిన తటస్థ పరిస్థితులు నైరుతి సీజన్‌ ముగిసే వరకు కొనసాగుతాయి.


Also Read:

సామ్ కర్రన్ సూపర్ ఇన్నింగ్స్.. ఛాహల్ హ్యాట్రిక్

రిటైర్మెంట్‌పై బాంబు పేల్చిన ధోని

ఇలాంటి దోపిడీ ఎక్కడైనా చూశారా..

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - May 01 , 2025 | 05:14 AM