IAS Transfers: ఐఏఎస్‌లు బదిలీ.. టీటీడీ ఈఓగా మళ్లీ అనిల్ కుమార్ సింఘాల్
ABN , Publish Date - Sep 08 , 2025 | 03:39 PM
ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఆదేశాలు జారీ చేశారు.
అమరావతి, సెప్టెంబర్ 08: ఆంధ్రప్రదేశ్‌లో 11 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఇవాళ(సోమవారం) ఆదేశాలు జారీ చేశారు. టీటీడీ ఈఓ శ్యామలరావును సైతం ఏపీ ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన స్థానంలో టీటీడీ ఈఓగా అనిల్ కుమార్ సింఘాల్‌ను నియమించారు. శ్యామలరావును సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శిగా నియమించారు. గవర్నర్ ప్రత్యేక కార్యదర్శిగా అనంత్‌రామ్‌ను బదిలీ చేశారు. రెవెన్యూశాఖ (ఎండోమెంట్) కార్యదర్శిగా ఎం.హరిజవహర్‌లాల్‌ను నియమించారు. ఆ స్థానంలో అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న వాడ్రేవు వినయ్ చంద్‌ను రిలీవ్ చేసింది ఏపీ సర్కార్.
అటవీ, పర్యావరణ శాఖ కార్యదర్శిగా కాంతిలాల్ దండేను నియమించింది ఏపీ సర్కార్. మైనార్టీ, సంక్షేమ శాఖ కార్యదర్శిగా సీహెచ్ శ్రీధర్‌ను బదిలీ చేసింది. ఫ్యాక్టరీస్, బాయిలర్స్ అండ్ ఇన్సురెన్స్, మెడికల్ సర్వీసెస్ కార్యదర్శిగా ఎం.వి.శేషగిరి బాబు బదిలీ అయ్యారు. ఆయనకు లేబర్ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు.
ఇక, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శిగా ఉన్న ఎమ్.టి.కృష్ణబాబును రోడ్లు, భవనాలు శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించారు. అలాగే పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు శాఖకు స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఆయనకు పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించారు. ఆరోగ్య శాఖ కార్యదర్శిగా సౌరవ్ గౌర్‌ను బదిలీ చేశారు. ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ముఖేష్ కుమార్ మీనాను నియమించారు. ఆయనకు పరిశ్రమలు, వాణిజ్య శాఖ పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. అలాగే ఢిల్లీలోని ఏపీ రెసిడెంట్ కమిషనర్‌గా ప్రవీణ్ కుమార్‌ను బదిలీ అయ్యారు.
అయితే అనిల్ కుమార్ సింఘాల్.. ఈ బదిలీతో మరోసారి టీటీడీ ఈవోగా బాధ్యతలు చేపట్టనున్నారు. 2014లో టీడీపీ ప్రభుత్వం కొలువు తీరిన అనంతరం ఐఏఎస్ బదిలీలు చేపట్టింది. ఆ సమయంలో సైతం అనిల్ కుమార్ సింఘాల్‌ను టీటీడీ ఈవోగా బదిలీ చేసింది. నాటి నుంచి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల వరకు అనిల్ కుమార్ సింఘాల్ అదే పదవిలో కొనసాగిన సంగతి తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి..
వాస్తవాలు చెబితే.. తప్పు పట్టిన బీఆర్ఎస్
ఆధార్‌ను అంగీకరించాల్సిందే.. ఈసీకి సుప్రీంకోర్టు కీలక ఆదేశం
For More AP News And Telugu News