African snails: ఆఫ్రికన్ నత్తలతో ఆందోళన వద్దు..
ABN , Publish Date - Nov 08 , 2025 | 09:42 AM
రైతులను హడలెత్తిస్తున్న ఆఫ్రికన్ నత్తల నివారణ చర్యలకు ప్రభుత్వ యంత్రాంగం ఉపక్రమించింది. రైతులకు నిద్రలేకుండా చేస్తున్న ఆఫ్రికన్ నత్తలు కేరళ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించినట్టు నూజివీడు మామిడి పరిశోధన కేంద్రం కీటక శాస్త్రవేత్త సెల్వరాజ్ స్పష్టం చేశారు. పంటలను పీల్చి పిప్పి చేస్తున్న నత్తలతో రైతులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో.. సీఎంవో ఆదేశాల మేరకు..
ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్
సీఎంవో ఆదేశాలతో హుటాహుటిన కదిలిన యంత్రాంగం
జి. కొండూరులో పంటలను పరిశీలించిన ఉద్యాన శాఖ అధికారులు
జి.కొండూరు, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి) : రైతులను హడలెత్తిస్తున్న ఆఫ్రికన్ నత్తల నివారణ చర్యలకు ప్రభుత్వ యంత్రాంగం ఉపక్రమించింది. రైతులకు నిద్రలేకుండా చేస్తున్న ఆఫ్రికన్ నత్తలు కేరళ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించినట్టు నూజివీడు మామిడి పరిశోధన కేంద్రం కీటక శాస్త్రవేత్త సెల్వరాజ్ స్పష్టం చేశారు. పంటలను పీల్చి పిప్పి చేస్తున్న నత్తలతో రైతులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో.. సీఎంవో ఆదేశాల మేరకు శుక్రవారం ఉద్యానశాఖ అధికారులు హుటాహుటిన గ్రామాల్లో పర్యటించారు. నత్తలపై రైతుల అనుమానాలను నివృత్తి చేశారు. ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు మండలంలో పలు గ్రామాల్లో నత్తలు ఆశించిన పంటలను శుక్రవారం ఉద్యానశాఖ ఉన్నతాధికారులు పరిశీలించారు. ఆఫ్రికా నత్తలతో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వాటిని చాలా సులువుగా నివారించుకోవచ్చని జిల్లా ఉద్యానశాఖాధికారి బాలాజీకుమార్, నూజివీడు మామిడి పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త సెల్వరాజ్లు పేర్కొన్నారు. ఈనెల 5న 'హడలెత్తిస్తున్న ఆఫ్రికన్ నత్తలు' శీర్షికన 'ఆంధ్రజ్యోతి'లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. శుక్రవారం జి.కొండూరు లోని బొప్పాయి, పామాయిల్, వంగ తదితర పంటల్లో ఆఫ్రికన్ నత్తలను గుర్తించారు. మునగపాడు బైపాస్ రోడ్డులో మండవ దుర్గారాణి తన పామాయిల్ తోటలో నత్తలను నిర్మూలించిన విధానం బాగుందని చెప్పారు. అనంతరం వారు మాట్లాడుతూ, పంటలపై 10 శాతానికి మించి నత్తల దాడి లేదని తమ పరిశీల నలో గుర్తించామని చెప్పారు. సకాలంలో అధికారులు సూచించే నివారణ పద్ధతులు పాటించి నత్తలను నివారించుకోవచ్చన్నారు.

నివారణ పద్ధతులు..
పాడైపోయిన గన్నీ బ్యాగ్స్‌ను ఉప్పు ద్రావణంలో ఉంచి పొలానికి రక్షణ గోడలా వేసుకుంటే అవి వ్యాప్తి చెందవు. కాపర్ సల్ఫేట్ 1.5 గ్రాములు, ఐరన్ సల్ఫేట్ 2 గ్రాములు లీటర్ నీటిలో కలిపి ప్రతి మూడు రోజులకొకసారి పిచికారీ చేసుకుంటే నత్తల ఉధృతి, ఉనికిని తగ్గించుకోవచ్చు. ఎక్కువగా ఉధృతి ఉంటే ఎకరానికి 3 నుంచి 4 కేజీల మెటాల్డిహైడ్ బలపాలు అక్కడక్కడ పెట్టి నివారించుకోవచ్చు. 25 కిలోల వరి తవుడు, బెల్లం 3 కిలోలు, 100 ధయోడిన్ పొడి ఆముదంతో విషపు గిళికలు తయారు చేసుకొని పొలంలో అక్కడక్కడా వేసుకోవాలి. ముఖ్యంగా పొలం, గడ్ల మీద కలుపు ఎక్కువగా లేకుండా చూసుకోవాలి. చెత్త కుప్పలు ఉండకూడదు. అత్యధిక వర్షపాతం వల్ల తేమశాతం అధికమై నత్తల ఉధృతి అధికమైంది. జూలై నుంచి ఫిబ్రవరి వరకు నత్తలకు అనుకూల సమయం కనుక ఈ సమయంలో రైతులు పొలాలను శుభ్రంగా ఉంచుకోవాలి.
కేరళ రాష్ట్రం నుంచి వచ్చాయి..
కేరళ రాష్ట్రం నుంచి ఈరకం నత్తలు రాష్ట్రానికి వచ్చాయి. మూడు నాలుగు మాసాల క్రితం వీటిని పార్వతి మన్యం, విశాఖ జిల్లాలో గుర్తించాం. కేరళ రాష్ట్రం నుంచి ఆయిల్ పామ్లో తమలపాకు సాగుకు నర్సరీ నుంచి మొక్కలు తీసుకువచ్చారు. వాటిద్వారా వచ్చాయి. అన్ని రకాల కూరగాయలు, పండ్ల తోటలను నాశనం చేస్తాయి. వీటి గురించి ఆందోళన చెందవద్దు.
-సెల్వరాజ్, కీటక శాస్త్రవేత్త
గోదావరి జిల్లాలతో పోల్చితే ఉధృతి తక్కువే
గోదావరి జిల్లాలతో పోల్చితే ఈప్రాంతంలో నత్తల ఉధృతి చాలా తక్కువ. నత్తల బెడద తొలి దశలోనే ఉంది. జి.కొండూరు మండలంలో 2 వేల హెక్టార్లలో ఉద్యాన పంటలు సాగు చేస్తున్నారు. అధిక వర్షాల వల్ల నత్తలు వ్యాప్తి చెంది రాత్రి పూట పంటలకు ఎక్కువ నష్టం చేస్తుంటాయి. చిన్న మొక్కలు చనిపోతాయి. రైతుల అప్రమత్తతతో చాలా వరకు నివారించుకోగలిగారు. విధిగా నివారణ పద్దతులతో పాటు చేతికి గ్లౌజులు వేసుకోవాలి. లేదా నత్తలు విసర్జించే జిగురులాంటి ద్రావణం వల్ల చర్మ వ్యాధులతో పాటు దద్దుర్లు వచ్చే అవకాశం ఉంది.
- జిల్లా ఉద్యానఅధికారి బాలాజీకుమార్
ఇవి కూడా చదవండి:
Lokesh: కార్యకర్తలు నడిపించే పార్టీ టీడీపీయే
Farming Technology: కిసాన్ డ్రోన్.. సాగు ఖర్చు డౌన్