YSRCP on Amaravati: రాజధాని అమరావతి ఘోస్ట్ సిటీ.. మరోసారి విషం కక్కిన వైసీపీ నేతలు..
ABN , Publish Date - Mar 05 , 2025 | 04:18 PM
రాజధాని అమరావతి అంశంపై వైసీపీ ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు సభలో ఉన్న మంత్రులు కొల్లు రవీంద్ర, పార్థసారథి, అచ్చెన్నాయుడు ఆగ్రహించారు. రాజధాని గురించి మాట్లాడే అర్హత వైసీపీ సభ్యులకు లేదంటూ మంత్రి కొల్లు రవీంద్ర ఘాటుగా స్పందించారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో రాజధాని అమరావతి అంశం రసాభాసగా మారింది. బడ్జెట్ కేటాయింపులపై సభలో మాట్లాడిన వైసీపీ ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. అమరావతి నిర్ణయం, అభివృద్ధిపై ఆయన తీవ్ర అభ్యంతరకర వాఖ్యలు చేశారు. రాజధానిని గోస్ట్ సిటీతో పోల్చడంపై మంత్రులు కొల్లు రవీంద్ర, పార్థసారథి, అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై వైసీపీ వైఖరిని తీవ్రంగా ఖండించారు. రాజధానిపై ఫ్యాన్ పార్టీ నేతలు విషం చిమ్ముతున్నారని ధ్వజమెత్తారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
వైసీపీ ఎమ్మెల్సీ ఏమన్నారంటే..
"ఆంధ్రప్రదేశ్ మధ్యలో రాజధాని అమరావతి నగరం ఉంటుందని కొందరు చెబుతున్నారు. ఆస్ట్రిచ్ పక్షిలాగా ఎందుకు లేనిపోనివన్నీ పెట్టుకుంటారు. అమరావతి నగరాన్ని కట్టలేరు, అది సాధ్యం కాదు. నగరాలను నిర్మించలేం, వాటంతట అవే అభివృద్ధి చెందాలి. అమరావతి అనేది ఇటుకలు, సిమెంట్‌తో కట్టేది కాదు. కొత్తగా నగరాలను కట్టడం అనేది సాధ్యం కాదు. ఒకప్పుడు బర్మా దేశం క్యాపిటల్‌ను కట్టుకుంది. ఇప్పుడు అక్కడ బిల్డింగులే తప్ప మనుషులు లేరు. బర్మా దేశం రాజధానిని ఘోస్ట్ సిటీ అంటున్నారు. మాకు(వైసీపీ) అమరావతి రాజధానిగా అంగీకారం కాదు. అమరావతికి ఎవరైనా పారిశ్రామికవేత్తలు వస్తారా?. రాజధాని వల్ల ఉపాధి, ఉద్యోగాల కల్పన సాధ్యం కాదు. హైవేలు, రన్ వేలు, రోడ్ వేలు, వాటర్ వేలు ఉన్నాయా?" అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు.
మంత్రుల రియాక్షన్..
రాజధాని అమరావతి అంశంపై వైసీపీ ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు సభలో ఉన్న మంత్రులు కొల్లు రవీంద్ర, పార్థసారథి, అచ్చెన్నాయుడు ఆగ్రహించారు. రాజధాని గురించి మాట్లాడే అర్హత వైసీపీ సభ్యులకు లేదంటూ మంత్రి కొల్లు రవీంద్ర ఘాటుగా స్పందించారు. ఏపీ ప్రజలు రాజధానిపై ఎన్నికల్లో స్పష్టమైన తీర్పునిచ్చారని, మూడు రాజధానులన్న వైసీపీకి ఏ తీర్పునిచ్చారో తెలుసంటూ ఎద్దేవా చేశారు. అమరావతే సింగిల్ రాజధాని అని ఎన్నికలకు వెళ్తే ప్రజలు కూటమికే పట్టం కట్టారని గుర్తు చేశారు. రాజధాని అమరావతిని ముఖ్యమంత్రి చంద్రబాబు అద్భుతంగా నిర్మిస్తారని, సీఎం విజన్ ఏంటో తాము చేసి చూపిస్తామని వైసీపీ ఎమ్మెల్సీకి మంత్రి కొల్లు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
రాజధాని అమరావతిపై వైసీపీ నేతలు అవకాశం దొరికినప్పుడల్లా విషం చిమ్ముతున్నారని, ఆ పార్టీ నేతలు ఇప్పటికైనా తీరు మార్చుకోవాలని మంత్రి కొలుసు పార్థసారథి హెచ్చరించారు. వైసీపీ నేతలంతా మనుషుల మధ్య నుంచే అమరావతికి వస్తున్నారనే విషయం తెలుసుకోవాలంటూ మంత్రి చురకలు అంటించారు. అమరావతిలో మనుషులు కాకుండా ఎవరుంటారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. గత జగన్ సర్కార్ హయాంలో అధికారులు ఉండేందుకు కూడా రాజధానిలో వసతులు ఏర్పాటు చేయలేదని మండిపడ్డారు. ప్రజలెవరూ అక్కడ నివసించరని ప్రపంచానికి చూపించాలనే ఉద్దేశంతోనే గత పాలకులు అమరావతిపై విషం చిమ్మారని ధ్వజమెత్తారు.
హైదరాబాద్ శివారు ప్రాంతాలకు సైతం నగరం విస్తరించిందని, అలాగే త్వరలో విజయవాడ, గుంటూరు నగరాలూ కలసిపోతాయని మంత్రి పార్థసారథి చెప్పుకొచ్చారు. దీంతో అమరావతి నగరం విస్తరిస్తుందని స్పష్టం చేశారు. అమరావతిని గొప్ప నగరంగా కడతామని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు అమరావతి వద్దు.. మూడు రాజధానులే ముద్దంటూ ఎన్నికలకు వెళ్లారని, అప్పుడు ఏం జరిగింతో అందరికీ తెలుసంటూ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. అలా వెళ్లిన వైసీపీ నేతలకు ఎన్నికల్లో ఓటర్లు కర్రు కాల్చి వాత పెట్టారంటూ ఆయన ఎద్దేవా చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Jagan Reaction on Budget: బడ్జెట్‌పై జగన్ రియాక్షన్..
Hyderabad: బోర్డు తిప్పేసిన మరో కంపెనీ.. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి అప్పుడే చెప్పింది..