Share News

Hyderabad: బోర్డు తిప్పేసిన మరో కంపెనీ.. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి అప్పుడే చెప్పింది..

ABN , Publish Date - Mar 05 , 2025 | 03:01 PM

హైదరాబాద్ కూకట్‌పల్లిలో వెల్‌ విజన్ కంపెనీ బోర్డు తిప్పేసింది. తక్కువ మెుత్తంలో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని అమాయకులను బురిడీ కొట్టించింది.

Hyderabad: బోర్డు తిప్పేసిన మరో కంపెనీ.. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి అప్పుడే చెప్పింది..
Investment Fraud

హైదరాబాద్: మహానగరంలో మోసాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. అమాయక ప్రజలే లక్ష్యంగా కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. పెట్టుబడుల పేరుతో కోట్లు వసూలు చేస్తూ జెండా ఎత్తేస్తున్నారు. తమ కంపెనీల్లో వేలు పెడితే లక్షలు వస్తాయని, లక్షలు పెడితే కోట్లు వస్తాయంటూ ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. అలా వసూలు చేసిన కోట్ల రూపాయలతో ఉడాయిస్తున్నారు. చివరికి మోసపోయామని గ్రహించిన బాధితులు ఆదుకోవాలంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు.


తాజాగా అలాంటి ఘటనే ఒకటి హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. కూకట్‌పల్లిలో వెల్‌ విజన్ కంపెనీ బోర్డు తిప్పేసింది. తక్కువ మెుత్తంలో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని బురిడీ కొట్టించిన సంస్థ యజమాని ప్రజల నెత్తిపై రూ.14 కోట్లకు కుచ్చుటోపీ పెట్టాడు. కందుల శ్రీనివాస్‌ అనే వ్యక్తి హైదరాబాద్ కేంద్రంగా వెల్‌ విజన్ కంపెనీని పెట్టాడు. తక్కువ మెుత్తంలో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని భారీగా ప్రచారం చేశాడు. ఏజెంట్లను నియమించుకుని వసూళ్లకు పాల్పడ్డాడు. అధిక వడ్డీ ఇప్పిస్తామన్న వారి మాటలు నమ్మి అనేక మంది సామాన్య ప్రజలు పెట్టుబడులు పెట్టారు.


అయితే కొన్నాళ్లపాటు సక్రమంగానే చెల్లింపులు చేసిన సంస్థ ఛైర్మన్ కందుల శ్రీనివాస్ ఆ తర్వాత కస్టమర్లను ఇబ్బందులకు గురి చేశాడు. దీనిపై గత రెండేళ్ల క్రితమే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి స్టింగ్ ఆపరేషన్ చేసి వెల్ విజన్ మోసాలను గుట్టురట్టు చేసింది. అయినా నాలుగు రకాల స్కీమ్‌లతో ప్రజల నుంచి కోట్లు వసూలు చేశాడు. తమ స్కీమ్‌ల్లో పెట్టుబడి బడితే 200 శాతం రిటర్న్స్ ఇస్తానని మోసాలకు తెరతీశాడు. ముందుగా కొన్ని నెలలపాటు రిటర్న్స్ సక్రమంగా చెల్లించి తాజాగా బోర్డు తిప్పేశాడు.


రూ.14 కోట్లు తమ వద్ద నుంచి వసూలు చేసి తిరిగి ఇవ్వడం లేదని 35 మంది బాధితులు సైబరాబాద్ ఆర్థిక విభాగం (ఈఓడబ్ల్యూ) పోలీసులను ఆశ్రయించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు కందుల శ్రీనివాస్‪ను అరెస్టు చేశారు. నిందితుడు ఏలూరుకు చెందిన వ్యక్తని, గతంలోనూ అతను ఇదే తరహా మోసాలకు పాల్పడినట్లు గుర్తించారు. త్వరలోనే రూ.14 కోట్లను వసూలు చేసి బాధితులకు తిరిగి చెల్లిస్తామని హామీ ఇచ్చారు. అత్యాసకు పోయి మోసపోవద్దని ప్రజలను పోలీసులు హెచ్చరిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Teenmar Mallanna: సీఎం రేవంత్‌‌తో చర్చకు సై.. మల్లన్న ఛాలెంజ్

Kalpana Daughter: అసలు విషయం చెప్పేసిన కల్పన కూతురు..

Updated Date - Mar 05 , 2025 | 03:02 PM