Bail: జైలు నుంచి విడుదలైన కృష్ణంరాజు, నందిగం సురేశ్..
ABN , Publish Date - Jul 01 , 2025 | 08:53 PM
ఇసుకపల్లి రాజుపై దాడి కేసులో అరెస్టయిన మాజీ ఎంపీ నందిగం సురేశ్ కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన గుంటూరు జిల్లా జైలు నుంచి విడుదలయ్యారు.

గుంటూరు, జులై 01: రాజధాని అమరావతి ప్రాంత మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో జర్నలిస్టు కృష్ణంరాజుకు ఏపీ హైకోర్ట్ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో మంగళవారం నాడు ఆయన గుంటూరు జైలు నుంచి విడుదలయ్యారు. వైసీపీకి చెందిన సాక్షి టీవీ చర్చా కార్యక్రమంలో రాజధాని అమరావతి మహిళలపై నీచ వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో ఆయన్ని ఏపీ పోలీసులు అరెస్ట్ చేసి విచారించిన సంగతి తెలిసిందే.
అయితే తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు కృష్ణంరాజు. దీంతో షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.10 వేలతో రెండు పూచీకత్తులు సమర్పించాలని.. దర్యాప్తునకు సహకరించాలని.. అలాగే వారంలో ఒక రోజు దర్యాప్తు అధికారి ముందు హాజరుకావాలని ఆదేశించింది. ఈ మేరకు సోమవారం నాడు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డి ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఇక కృష్ణంరాజు చేసిన ఈ వ్యాఖ్యలపై ఏపీ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. ఆ క్రమంలో రాజధాని ప్రాంతానికి చెందిన దళిత జేఏసీ నాయకురాలు కంభంపాటి శిరీష.. తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ కేసులో కృష్ణంరాజును ఏ1గా, యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావును ఏ2గా, సాక్షి ఛానెల్ యాజమాన్యాన్ని ఏ3గా పేర్కొంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏ2గా ఉన్న కొమ్మినేనికి కొద్ది రోజుల కిందటే షరతులతో కూడిన బెయిల్ మంజూరు అయ్యింది.
మరోవైపు ఇసుకపల్లి రాజుపై దాడి కేసులో అరెస్ట్ అయిన మాజీ ఎంపీ నందిగం సురేశ్ కు బెయిల్ లభించింది. దీంతో ఆయన సైతం గుంటూరు జిల్లా జైలు నుంచి ఇవాళ(మంగళవారం) విడుదలయ్యారు. దాదాపు 44 రోజులపాటు గుంటూరు జిల్లా జైల్లో మాజీ ఎంపీ నందిగం సురేశ్ ఉన్నారు.
ఇవి కూడా చదవండి:
వైఎస్ జగన్‌కు సోమిరెడ్డి వార్నింగ్
బీఆర్ఎస్ పునరుజ్జీవనం కోసం తాపత్రయపడుతోంది: సీఎం రేవంత్ రెడ్డి..
సినీ నటి పాకీజాకు పవన్ కల్యాణ్ ఆర్థిక సాయం
For More AP News and Telugu News