Venkaiah Naidu On Politicians: రాజకీయం అంటే ఇది.. పార్టీలు మారడం కాదు: వెంకయ్య నాయుడు
ABN , Publish Date - Aug 06 , 2025 | 01:39 PM
వల్లూరు శ్రీమన్నారాయణ అభినందన సభలో భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నాయకులు ఇతరులకు ఆదర్శప్రాయంగా ఉండాలని సూచించారు. అయితే, ప్రస్తుత రాజకీయాల్లో విలువలు లేకుండా పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
విజయవాడ: బీజేపీ సీనియర్ కార్యకర్త వల్లూరు శ్రీమన్నారాయణ 56 ఏళ్లుగా పార్టీలో సేవలందిస్తున్న సందర్భంగా ఆయనకు ఆత్మీయ అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరై, శ్రీమన్నారాయణ సేవలను ప్రశంసించారు. అడ్వానీ, వాజ్‌పేయి ప్రచారం చేసిన రోజులు గుర్తొస్తున్నాయన్నారు. శ్రీమన్నారాయణను తన వ్యక్తిగత స్నేహితుడిగా వెంకయ్య నాయుడు పేర్కొన్నాడు. జట్కా బండ్లపై తిరిగి వాజ్‌పేయి, అడ్వానీతో ప్రచారం చేసిన రోజులలో నుంచే శ్రీమన్నారాయణ బీజేపీ కోసం పదవుల ఆశ లేకుండా, కేవలం సిద్ధాంత నిబద్ధతతో పని చేశారని గుర్తు చేశారు.
ఆదర్శంగా ఉండాలి
రాజకీయ నాయకులు ప్రజలకు ఆదర్శంగా ఉండాలని సూచించారు. అయితే, నేటి రాజకీయ పరిస్థితుల్లో ఎవరూ ఏ పార్టీకి చెందిన వారో స్పష్టంగా తెలియని స్థితి ఉందని కామెంట్స్ చేశారు. పార్టీ మారే నాయకుల పరిస్థితి బస్సుల రాకపోకల లాగా మారిపోయిందని ఎద్దేవా చేశారు. గతంలో నాయకులు ఒక పార్టీ విడిచి మరొకదాన్ని చేరేటప్పుడు సిద్ధాంతాలు, కారణాలు ఉండేవని కానీ.. నేడు, డైపర్లు మార్చినంత సులువుగా పార్టీలు మారుతున్నారని విమర్శలు గుప్పించారు. ఇది రాజకీయాలకు తగదని వ్యాఖ్యానించారు. శ్రీమన్నారాయణ నిబద్ధత ప్రతి కార్యకర్తకు ఆదర్శమని పేర్కొన్నారు.
నమ్మకం పోతుంది
ఒక పార్టీని నమ్మి, ఆ పార్టీ కోసం పని చేసేవారే నిజమైన నాయకుడన్నారు. రాజకీయ నాయకులకు సమయ పాలన కూడా ఎంతో ముఖ్యమన్నారు. ప్రజలు మనలను ఆదర్శంగా తీసుకునేలా ఉండాలని చెప్పారు. ఈ క్రమంలోనే నేడు వివాహ వ్యవస్థపై కూడా నమ్మకం పోతుందన్నారు. మన కుటుంబ, వివాహ వ్యవస్థ చూసే ప్రపంచ దేశాలు గౌరవిస్తాయని.. కానీ, ఇప్పుడు ఫిజిక్స్ చూసి పెళ్లిళ్లు ... కెమిస్ట్రీ బాగొలేదని విడాకులు అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ పని అయినా ఇష్టపడి చేస్తే... కష్టం అనేది ఉండదని, ఈ విషయంలో శ్రీమన్నారాయణ చాలా మందికి ఆదర్శమని పేర్కొన్నారు. రాజకీయ నాయకులు నడవడిక, పని తీరును ప్రజలు గమనించాలని సూచించారు.
విలువలతో బతకాలి
ఎదుటి వారితో గౌరవ మర్యాదలు పాటిస్తే.. అదే గౌరవం మనకీ దక్కుతుందన్నారు. కుటుంబం అంతా కలిసి అన్యోన్యంగా ఉంటే ఆ బలమే వేరని, ఎవరితో అయినే స్నేహం మనకను రెప్ప లాగా ఉండాలని, ఎప్పుడు అవసరం వచ్చినా కనురెప్ప లాగా ఆ కష్టానికి అడ్డంగా నిలబడాలని సూచించారు. శ్రీమన్నారాయణ అందరినీ గౌరవిస్తూ... సహకరిస్తూ.. తన ప్రత్యేకతతో అందరికీ ఆప్తులుగా మారారన్నారు. అటువంటి వ్యక్తి అభినందన సభలో పాల్గొనాలనే తాను ఈరోజు సభకు వచ్చినట్లు తెలిపారు. ఎవరైనా సరే కొన్ని విలువ లతో బతకాలని... రాజకీయ నాయకులు ప్రజలకు ఆదర్శంగా ఉండేలా వ్యవహరించాలని సూచించారు. ఆరోగ్యం కోసం ప్రతిఒక్కరూ నడక, వ్యాయామం, యోగా చేయాలన్నారు. శ్రీమన్నారాయణ ఇలాగే నవ్వుతూ, అందరినీ నవ్విస్తూ వందేళ్లు ఆనందంగా ఉండాలని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు.
Also Read:
27నుంచి కాణిపాకం వరసిద్ధుడి బ్రహ్మోత్సవాలు
అమిత్‌షాపై పరువునష్టం వ్యాఖ్యలు.. రాహుల్‌కు బెయిల్
For More Latest News