Share News

AP Meat Development Corporation: చికెన్ షాపులపై కీలక నిర్ణయం..

ABN , Publish Date - Oct 16 , 2025 | 10:02 AM

చికెన్ వ్యాపారంలో అక్రమాలకు అడ్డుకట్ట వేయడం కోసం రాష్ట్ర మాంసాభివృద్ధి సంస్థ బోర్డ్ కీలక నిర్ణయం తీసుకుంది.

AP Meat Development Corporation: చికెన్ షాపులపై కీలక నిర్ణయం..

అమరావతి, అక్టోబర్ 16: చికెన్ వ్యాపారంలో అక్రమాలకు అడ్డుకట్ట వేయడంతోపాటు నూతన లైసెన్సింగ్ విధానాన్ని తీసుకురావాలని రాష్ట్ర మాంసాభివృద్ధి సంస్థ బోర్డ్ నిర్ణయించింది. అందులో భాగంగా ప్రతీ చికెన్ షాపునకు లైసెన్స్ ఇవ్వాలని భావిస్తుంది. ఏ ఫారం (పౌల్ట్రీ) నుంచి కోళ్లు వచ్చాయి.. వాటిని ఎవరికి విక్రయించారనే అంశాలను ట్రాక్ చేసేలా పకడ్బందీ వ్యవస్థ తీసుకురావాలని నిర్ణయించింది.


ఇటీవల విజయవాడలో జరిగిన సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేసింది. అలాగే వైసీపీ హయాంలో జరిగిన మాంసం మాఫియా అక్రమాలను బయటకు తీసి.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సైతం ఈ సమావేశంలో నిర్ణయించారు. ఈ సంస్థ చైర్మన్ చంద్రదండు ప్రకాశ్ నాయుడు అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తీసుకున్న నిర్ణయాలు ఇవి..


  • చికెన్, మటన్ దుకాణాలను క్రమబద్ధీకరించడం.

  • మున్సిపాల్టీల్లో మాంసం దుకాణాలపై ఆకస్మిక దాడులు చేపట్టి.. అక్రమాలపై వెంటనే చర్యలు తీసుకోవడం.

  • గుర్తింపు పొందిన చికెన్ షాపుల నుంచే హోటళ్ల నిర్వాహకులు మాంసం కొనుగోళ్లను ప్రోత్సహించడం.


  • స్టెరాయిడ్లు వాడిన కోళ్ల విక్రయాలను పూర్తిగా నియంత్రించడం.

  • చికెన్ దుకాణాల వ్యర్థాలను తీసుకువెళ్లి.. చేపలకు ఆహారంగా వాడుతున్న మాఫియాను అరికట్టడం. ఈ వ్యర్థాలను సేకరించి ప్రజారోగ్యానికి ఇబ్బంది కలగని రీతిలో నాశనం చేయడం.

  • అక్రమ కబేళాలపై దాడులు నిర్వహించడం. విదేశాలకు గోవులను అక్రమంగా తరలించకుండా ఉక్కుపాదం మోపడం.


Updated Date - Oct 16 , 2025 | 10:57 AM