Wheat at Ration Shops: రేషన్ షాపుల్లో ఇకపై రూ.20కే కిలో గోధుమ పిండి.. ఎప్పటినుంచంటే.?
ABN , Publish Date - Dec 28 , 2025 | 11:47 AM
ఏపీ పౌరసరఫరాల శాఖ మరో ముందడుగు వేసింది. వచ్చే నెల నుంచి బియ్యం పంపిణీతో పాటు ఒక్కో కార్డుదారునికి తక్కువ ధరకే కిలో గోధుమ పిండి ప్యాకెట్ అందించేందుకు సిద్ధమైంది.
గుంటూరు, డిసెంబరు 28: కొత్త సంవత్సరం ప్రారంభ నెల, సంక్రాంతి పర్వదినం సందర్భంగా జనవరి నుంచి రేషన్ కార్డుదారులకు బియ్యం, పంచదార, జొన్నలతో పాటు గోధుమ పిండి(హోల్ వీట్ ఆటా) పంపిణీ చేసేందుకు ఏపీ పౌరసరఫరాల శాఖ ఏర్పాట్లు చేస్తోంది. బహిరంగ మార్కెట్లో హోల్ వీట్ ఆటా కిలో ధర రూ.40కి పైగా ఉంది. దీనిని సగం ధర రూ.20కే కిలో చొప్పున ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలకు సంబంధించి స్టాక్ కేటాయింపులు జరిగాయి. గుంటూరు జిల్లాలో గోధుమపిండి వినియోగం ఎక్కువగా ఉంటుంది. దీనిని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం.. 2,68,709 కేజీల ప్యాకెట్లను సివిల్ సప్లైస్ గోదాములలో నిల్వ ఉంచుతోంది.
అలాగే.. బాపట్ల జిల్లాకు 58,718 కేజీ ప్యాకెట్లు, పల్నాడు జిల్లాకు 1,19,677 ప్యాకెట్లను కేటాయించింది. గోధుమ పిండికి డీలర్ల నుంచి ముందుగానే నగదు చెల్లించుకుని సరఫరా చేసేందుకు సిద్ధమైంది. ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి గోధుమపిండి ప్యాకెట్లను నెలాఖరులోగా రేషన్ దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి డీలర్లు రేషన్ సరుకుల్లో గోధుమ పిండి పంపిణీకి శ్రీకారం చుట్టనున్నారు. డీలర్లకు ఇచ్చే రూ.1 కమీషన్‌నూ రూ.20 ధరలోనే చేర్చారు. దీని వల్ల అదనంగా ఎలాంటి ఛార్జీలు వసూలు చేయరాదని రేషన్ డీలర్లకు పౌరసరఫరాల శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో కార్డుదారులు జనవరి నెల రేషన్ సరకుల కోసం డిపోలకు వెళ్లినప్పుడు డీలర్లను అడిగి బియ్యం, చక్కెర, జొన్నలు, గోధుమపిండి ప్యాకెట్ తీసుకోవచ్చని అధికార వర్గాలు తెలిపాయి.
కార్డుదారులు వినియోగించుకోవాలి..
ప్రభుత్వం సబ్సిడీలను భరించి కార్డుదారుల కోసం ప్రత్యేకంగా జొన్నలు, గోధుమ పిండి కొనుగోలు చేసింది. వీటిని కార్డుదారులు సొంతానికి వినియోగించుకోవాలి. ఆయా సరకులను ఇతరులకు అమ్మడం నేరం. కార్డు దారులు ఎవరైనా అమ్మినా, కొనుగోలు చేసినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని గుంటూరు డీఎస్ఓ కోమలి పద్మ హెచ్చరించారు.
గత నెలలో జొన్నలు..
గత నెలలో రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు ప్రభుత్వం బియ్యంతో పాటు జొన్నల పంపిణీని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందుకోసం గుంటూరు జిల్లాకు 17,70,982 కిలోలు, పల్నాడుకు 18,99,399 కిలోలను కేటాయిస్తోంది. ఒక్కో కార్డుదారులు 3 కేజీల వరకు జొన్నల్ని తీసుకునే వెసులుబాటు కల్పించింది ప్రభుత్వం. అయితే.. అంతకు సమానంగా బియ్యం కోటాను తగ్గిస్తారు.
Also Read:
కల్వర్టులోకి దూసుకెళ్లిన బైక్.. యువకులు దుర్మరణం..
ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మీరు ఎక్కవలసిన రైలు మిస్సయ్యిందా..?