Greater Guntur Approved: గ్రేటర్ గుంటూరుకు.. ఆమోదం
ABN , Publish Date - Dec 28 , 2025 | 09:03 AM
మిలీనియం సిటీ కాన్సెప్ట్ భాగంగా రాజమండ్రి, కాకినాడ తిరుపతి, విశాఖపట్నం నగరాలకు దీటుగా గుంటూరును అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లు ప్రత్తిపాడు ఎమ్మెల్యే బుర్లా రామాంజనేయులు తెలిపారు. శంకర్ విలాస్ ఆర్వోబీపై టీడీపీ, వైసీపీ కార్పొరేటర్ల మధ్య తీవ్రస్థాయిలో చర్చి జరిగింది.
మిలీనియం సిటీగా నగర పరిధి పెంపు
18 గ్రామాలు విలీనానికి కౌన్సిల్ అంగీకారం
శంకర్ విలాస్ ఆర్వోబీపై కార్పొరేటర్ల మధ్య వార్
అధికారులు తన మాట వినడంలేదన్న మేయర్ రవీంద్ర
గుంటూరు కార్పొరేషన్, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): గుంటూరు మండలంలోని లాల్పురం, చల్లావారిపాలెం, వెంగళాయపాలెం, మల్లవరం, చిన్నపలకలూరు, తోక వారిపాలెం, తురకపాలెం, గొర్లవారిపాలెం, ఓబుల్ నాయుడుపాలెం, జొన్నలగడ్డ.. పెదకాకాని మండలంలోని అగతవరప్పాడు, వెనిగండ్ల, పెదకాకాని, తక్కెళ్ళపాడు, చంద్రపాలెం.. వట్టి చెరుకూరు మండలంలోని కొర్నె పాడు, పుల్లడిగుంట, తాడికొండ మండలం లాం గ్రామాల విలీనంతో గుంటూరు మహానగరంగా విస్తరించనున్నది. ఈ మేరకు శనివారం జరిగిన కౌన్సిల్ సమావేశంలో నగరపాలక సంస్థ ఆమోదం తెలిపింది. గుంటూరును మహా నగరపాలక సంస్థగా మార్చేందుకు కౌన్సిల్ ఆమోదముద్ర వేసినట్లు మేయర్ కోవెలముడి రవీంద్ర ప్రకటించారు. నగరాన్ని మిలీనియం సిటీ కాన్సెప్ట్ భాగంగా మహా నగరపాలక సంస్థగా విస్తరించేందుకు ప్రభుత్వం సిద్ధమైందని, ఇందులో భాగంగా 18 గ్రామాలను విలీనం చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
మిలీనియం సిటీ కాన్సెప్ట్ భాగంగా రాజమండ్రి, కాకినాడ తిరుపతి, విశాఖపట్నం నగరాలకు దీటుగా గుంటూరును అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లు ప్రత్తిపాడు ఎమ్మెల్యే బుర్లా రామాంజనేయులు తెలిపారు. శంకర్ విలాస్ ఆర్వోబీపై టీడీపీ, వైసీపీ కార్పొరేటర్ల మధ్య తీవ్రస్థాయిలో చర్చి జరిగింది. అనుమతులు లేకుండానే పనులు ప్రారంభించారని వైసీపీ కార్పొరేటర్లు చేసిన వ్యాఖ్యలపై టీడీపీ కార్పొరేటర్ వేములపల్లి శ్రీరామ్ ప్రసాద్ తీవ్రంగా స్పందిస్తూ అసత్య ఆరోపణలు తగవన్నారు. ఆర్వోబీ భూసేకరణ 80 శాతం పూర్తయిందని, అవగాహన లేక కోర్టుకు వెళ్లిన వారితో మాట్లాడి సమస్య పరిష్కరిస్తున్నట్లు కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. ఇందుకోసం నగరపాలక సంస్థ రూ.30 కోట్లు కేటాయించిందన్నారు. సాంబశివ, ఉత్తమ యాడ్స్ నిర్వాహకులు అడ్డగోలుగా హోర్డింగ్ ఏర్పాటు చేస్తుండగా వారికి అధికారులు వత్తాసు పలుకుతున్నారని కొంతమంది కార్పొరేటర్లు ఆరోపించారు.
వచ్చే ఏడాది మార్చిలోగా అక్రమ హోర్డింగ్లను తొలగిస్తామని కమిషనర్ తెలిపారు. ఇంజనీరింగ్ అధికారులు తన మాట కూడా వినడం లేదని, విధుల విషయంలో నిర్లక్ష్యంగా ఉంటున్నారని మేయర్ వారిపై మండిపడ్డారు. 31 డివిజన్ ఏఈ ఫోన్ కూడా ఎత్తడం లేదన్నారు. గతంలో రూ.22 కోట్ల పనులకు అడ్డగోలుగా ఆమోదం తెలిపారని వాటి డేటా కూడా లేదని బిల్లులు ఎలా చెల్లించాలని కమిషనర్ ప్రశ్నించారు. మొత్తం 167 అంశాలకు కౌన్సిల్ ఆమోదం తెలిపినట్లు మేయర్ తెలిపారు. సమావేశంలో ఎమ్మెల్యే నసీర్ఆహ్మద్, ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం, డిప్యూటీ మేయర్లు షేక్ సజల, డైమండ్ బాబు తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Minister Somanna Statement: ఏడాదిలోనే ఏపీకి రూ.9500 కోట్ల రైల్వే ప్రాజెక్టులు
Araku: అరకు ఉడెన్ బ్రిడ్జ్ సందర్శన వేళల్లో మార్పు