Share News

Police case: సాక్షి పత్రిక ఎడిటర్‌పై కేసు నమోదు

ABN , Publish Date - Sep 01 , 2025 | 08:56 PM

ఏపీ డీజీపీని కించపరుస్తూ కథనం రాసిన నేపథ్యంలో సాక్షి దిన పత్రిక ఎడిటర్‌పై తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.

Police case: సాక్షి పత్రిక ఎడిటర్‌పై కేసు నమోదు

అమరావతి, సెప్టెంబర్ 01: ఏపీ డీజీపీని కించపరుస్తూ కథనం రాసిన నేపథ్యంలో సాక్షి దిన పత్రిక ఎడిటర్‌పై తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ పత్రిక ఎడిటర్‌తోపాటు క్రైమ్ బ్యూరో చీఫ్, ఇతర సిబ్బందిపై సైతం పోలీసులు కేసు నమోదు చేశారు.

ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తాను కించపరుస్తూ.. ఆయనే లక్ష్యంగా చేసుకుని అవినీతి ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఏపీ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు జనకుల శ్రీనివాసరావు తాడేపల్లి పోలీసులను ఆశ్రయించారు. దీంతో జనకుల శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు వీరిపై వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.


2024లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా రెండో సారి అధికారం చేపడతామని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆత్మ విశ్వాసంతో ఉన్నారు. ఆ క్రమంలో వై నాట్ 175 లక్ష్యంగా ఎన్నికలకు వెళ్లిన ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్‌కు కేవలం 11 సీట్లను మాత్రమే కట్టబెట్టారు. ఈ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ఓటరు.. కూటమిలోని పార్టీలకు పట్టం కట్టాడు. దీంతో చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. అయితే వైసీపీకి ప్రతిపక్ష హోదా సైతం దక్కలేదు. దాంతో తనకు ప్రతిపక్ష హోదా కల్పించాలంటూ అసెంబ్లీ స్పీకర్‌కు వైఎస్ జగన్ లేఖ సైతం రాశారు.


అసెంబ్లీలో సరిపడ సంఖ్య బలం లేకుంటే.. ఆ హోదా దక్కదంటూ వైఎస్ జగన్‌కు అసెంబ్లీ స్పీకర్.. తన లేఖ ద్వారా స్పష్టం చేశారు. దీంతో తనకు ప్రతి పక్ష హోదా కల్పించాలంటూ ఏపీ హైకోర్టును వైఎస్ జగన్ ఆశ్రయించిన విషయం విదితమే. ఈ హోదా వచ్చే వరకు తాను అసెంబ్లీలో అడుగు పెట్టనంటూ వైఎస్ జగన్ కరాఖండిగా చెప్పారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్‌తో పాటు ఆ పార్టీ తరఫున గెలిచిన మరో 10 మంది ఎమ్మెల్యేలు సైతం అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కోట్టేశారు.


ప్రజల సమస్యలపై చర్చించేందుకు అసెంబ్లీకి హాజరు కావాలంటూ వైసీపీ ఎమ్మెల్యేలకు కూటమిలోని పార్టీ నేతలు ఎవరు సూచించినా.. వారు పట్టించుకోకుండా ఉండిపోవడం గమనార్హం. మరోవైపు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలు చేస్తారంటూ వైసీపీకి చెందిన మీడియా సంస్థలు.. తమదైన శైలిలో కథనాలు ప్రచురిస్తున్నాయి.


అలాగే రాష్ట్రంలో ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా.. అందుకు ప్రభుత్వానిదే బాధ్యత అంటూ వార్తలు ప్రచురిస్తున్నాయి. ఇక శాంతి భద్రతల సమస్య అంటూ వార్తలు వండి వార్చింది. ప్రభుత్వంతో ఏ మాత్రం సంబంధం లేకపోయినా అంశాలను సైతం కూటమిలోని పార్టీలకు, ఆ పార్టీ నేతలకు అంటకడుతూ.. వార్తలు ప్రచురిస్తున్నాయి.


అలాంటి వేళ.. వైసీపీ మీడియా సంస్థలపై ఇప్పటికే పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసిన సంఘటనలు కొకొల్లలు. అదే రీతిగా ఏపీ డీజీపీ లక్ష్యంగా చేసుకుని వార్త కథనం రాయడంతో.. ఏపీ పోలీస్ అధికారుల సంఘం వెంటనే స్పందించింది. దీనిపై తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీపై కమిటీ ఏర్పాటు

హరీష్ రావును టార్గెట్ చేసింది అందుకేనా..?

For More AP News And Telugu News

Updated Date - Sep 01 , 2025 | 09:27 PM