Cyclone Montha: మొంథా తుపాన్.. అధికార యంత్రాంగం అప్రమత్తం: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Oct 26 , 2025 | 03:23 PM
మొంథా తుపాన్ నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆ క్రమంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సీఎం చంద్రబాబు నాయుడు వివరించారు.
అమరావతి, అక్టోబర్ 26: మొంథా తుపాన్ ప్రభావం ఆంధ్రప్రదేశ్ పై ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీలతోపాటు ఉన్నతాధికారులందరూ అన్ని శాఖల సమన్వయంతో పనిచేసేలా సన్నద్ధం చేశామని చెప్పారు. జిల్లాలకు అవసరమైన నిధులు అందుబాటులో ఉంచి.. ప్రత్యేక అధికారులను నియమించామని వివరించారు.
విద్యుత్, తాగునీరు, రవాణా సేవలకు ఎటువంటి అంతరాయం కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. అలాగే వర్షం తీవ్రత, తుపాన్ ప్రభావానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా ప్రజలకు పంపడం ద్వారా ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపడుతున్నామని ఆయన పేర్కొన్నారు.
అధికార యంత్రాంగానికి, ప్రభుత్వానికి సహకరించాలని ఈ సందర్భంగా ప్రజలకు సీఎం చంద్రబాబు సూచించారు. తుపాన్ ప్రభావిత ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి.. అక్కడ అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించామన్నారు. ఈ మేరకు ఎక్స్ ఖాతా వేదికగా సీఎం చంద్రబాబు మొంథా తుఫాన్ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం మరింత బలపడి మొంథా తుఫాన్‌గా మారే అవకాశం ఉందని అమరావతిలోని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ తుఫాన్ కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది. ఈ తుఫాన్ ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని.. అలాగే బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. తుపాన్ కారణంగా సహాయక చర్యలు చేపట్టేందుకు జిల్లాలకు ప్రత్యేక అధికారులను ఇప్పటికే ప్రభుత్వం నియమించింది.
ఇక అక్టోబర్ 30వ తేదీ వరకు ప్రభుత్వ ఉద్యోగులు సెలవులను రద్దు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు చేశారు. తుపాన్ కారణంగా ఎవరికి ఎటువంటి సమస్య ఎదురైనా.. సహాయం కోసం కంట్రోల్ రూమ్‌లను సంప్రదించాలని ప్రజలకు ప్రభుత్వం సూచించింది. మూడు రోజుల వరకు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని తీర ప్రాంత ప్రజలను ఉన్నతాధికారులు విజ్ఞప్తి చేశారు.
కార్తీక మాసం.. సముద్ర స్నానం..
కార్తీక మాసం నేపథ్యంలో భక్తులు పెద్ద సంఖ్యలో సముద్ర స్నానాలు ఆచరిస్తారు. ఈ తుపాన్ ప్రభావం కారణంగా.. సముద్రంలో అలల తీవ్రత అధికంగా ఉంటుంది. దాంతో ప్రమాదం పొంచి ఉందని.. సముద్ర స్నానాలు చేయవద్దని ప్రజలకు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏపీకి పొంచి ఉన్న ముప్పు.. ఈ ప్రాంత ప్రజలు జాగ్రత్త..!
Bihar Elections: 20 నెలల్లో నూతన బీహార్‌ను ఆవిష్కరిస్తాం.. తేజస్వి పిలుపు
For More AP News And Telugu News