Andhra Pradesh Cyclone: ఏపీకి పొంచి ఉన్న ముప్పు.. ఈ ప్రాంత ప్రజలు జాగ్రత్త..!
ABN , Publish Date - Oct 26 , 2025 | 03:09 PM
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాన్ అక్టోబర్ 28న కళింగపట్నం–మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం. తీర జిల్లాలకు రెడ్ వార్నింగ్, భారీ వర్షాలు సూచన.
విశాఖపట్నం, అక్టోబర్ 26: ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ప్రభావం ఇంకా కొనసాగుతోంది. గడిచిన ఆరుగంటల్లో గంటకు 6 కిలోమీటర్లు వేగంతో ప్రయాణిస్తోంది. పోర్ట్ బ్లేయర్ పశ్చిమ దిశకు 620 కిలోమీటర్లు, చెన్నైకు తూర్పు ఆగ్నేయ దిశలో 780 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక విశాఖకు దక్షిణ ఆగ్నేయంగా 830 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాకినాడకు ఆగ్నేయంగా 800 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉంది.
కాగా, ఈ వాయుగుండం రాగల 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ తుపాన్‌గా బలపడే అవకాశం ఉంది. అనంతరం ఈ నెల 28వ తేదీ నాటికి తీవ్ర తుపాన్‌గా బలపడే అవకాశం ఉంది. ఈ నెల 28వ తేదీన సాయంత్రం లేదా రాత్రికి కళింగపట్నం - మచిలీపట్నం మధ్య కాకినాడకి సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గరిష్టంగా 110 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఆదివారం నాడు రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాల కురవనున్నాయి. ఈ నేపథ్యంలోనే కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు.
ఇక సోమవారం నాడు కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, నంద్యాల, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అదే సమయంలో కర్నూలు, అనంతపురం, సత్యసాయి జిలాలకు యెల్లో అలర్ట్ జారీ చేశారు.
సముద్ర తీరం వెంబడి ఆదివారం నాడు 35 నుంచి 55 కిలోమీటర్లు వేగంతో ఈదురు గాలులు వీస్తాయి. సోమవారం నాడు 45 నుంచి 55 కిలోమీటర్లు వేగంతో గాలి వీయనుంది. మంగళవారం నాడు 60 నుంచి 80 కిలోమీటర్లు వేగంతో ఈదురు గాలులు వీస్తాయి. తుపాను ప్రభావం నేపథ్యంలో రానున్న ఐదు రోజుల పాటు మత్స్యకారులు వేటకు వెళ్లవొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్రంలోని అన్ని ఓడరేవుల్లో ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు అధికారులు.
Also Read:
Bihar Elections: 20 నెలల్లో నూతన బీహార్‌ను ఆవిష్కరిస్తాం.. తేజస్వి పిలుపు