Minister Narayana: టిడ్కో ఇళ్లపై మంత్రి నారాయణ కీలక ప్రకటన
ABN , Publish Date - Jun 28 , 2025 | 08:35 PM
టిడ్కో ఇళ్లను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తామని మంత్రి నారాయణ హామీ ఇచ్చారు. మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనుల కోసం 2014 నుంచి 2019 మధ్య కేంద్రప్రభుత్వం నుంచి అనేక నిధులు తీసుకువచ్చామని మంత్రి నారాయణ అన్నారు.

అమరావతి: మున్సిపల్ శాఖలో అనేక అంశాలపై సీఎం చంద్రబాబుతో చర్చించామని మంత్రి నారాయణ (Minister Narayana) వెల్లడించారు. ఇవాళ(శనివారం) మున్సిపల్ శాఖ, పురపాలక శాఖపై సీఎం చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షకు మంత్రి నారాయణ, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సమావేశానికి సంబంధించిన వివరాలను మీడియాకు మంత్రి నారాయణ తెలిపారు. టిడ్కో ఇళ్లను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తామని హామీ ఇచ్చారు. మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనుల కోసం 2014 నుంచి 2019 మధ్య కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక నిధులను తీసుకువచ్చామని వెల్లడించారు మంత్రి నారాయణ.
రూ.5800 కోట్లు AIIB నిధులు, రూ.3000 కోట్ల స్వచ్ఛభారత్ నిధులకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం వచ్చిందని మంత్రి నారాయణ గుర్తుచేశారు. గత జగన్ ప్రభుత్వం రాష్ట్ర వాటా ఇవ్వకపోవడంతో మధ్యలోనే నిధులు నిలిచిపోయాయని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక ఇబ్బందులను పరిష్కరించి కేంద్రప్రభుత్వం నుంచి మళ్లీ నిధులు తీసుకువస్తున్నామని వివరించారు. అమృత్ స్కీమ్ ద్వారా తాగునీరు పైప్‌లైన్ పనుల కోసం నిన్ననే టెండర్లు పిలిచామని స్పష్టం చేశారు. ఈ పనులు పూర్తయితే 85 శాతం ప్రతి ఇంటికీ నేరుగా నదులు, కాలువల ద్వారా నీరు అందుతోందని అన్నారు. AIIB నుంచి రూ.5350 కోట్లకు సంబంధించిన పనులకు వారం రోజుల్లో టెండర్లు పిలుస్తామని తెలిపారు మంత్రి నారాయణ.
ఆయా నిధులకు రాష్ట్ర వాటా ఇచ్చేలా ఆర్థిక శాఖకు సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారని మంత్రి నారాయణ తెలిపారు. శుద్ధి చేసిన నీటిని డ్రైన్లలోకి వదిలేలా 2029లోగా వందశాతం STPలు నిర్మిస్తామని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వం వదిలేసిన లెగసీ వేస్ట్‌ను అక్టోబర్ 2వ తేదీ నాటికి పూర్తిగా తొలగిస్తామని చెప్పుకొచ్చారు. 2014 నుంచి 2019 మధ్యలో 10 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించామని అన్నారు. ప్రస్తుతం గుంటూరు, విశాఖపట్నం ప్లాంట్‌లలో 2800 టన్నుల చెత్త నుంచి విద్యుత్ తయారు చేస్తున్నారని చెప్పారు మంత్రి నారాయణ.
నెల్లూరు, రాజమండ్రి ప్లాంట్‌లకు టెండర్లు పూర్తి అయ్యాయని మంత్రి నారాయణ వెల్లడించారు. కడప, కర్నూలు, విజయవాడ, తిరుపతిలో ప్లాంట్‌ల ఏర్పాటుకు త్వరలో టెండర్లు పిలుస్తామని అన్నారు. ఈ ప్లాంట్‌లు పూర్తయితే 7500 టన్నుల చెత్తని ప్రతిరోజూ విద్యుత్ తయారీకి పంపిస్తున్నామని తెలిపారు. మిగిలిన 500 టన్నుల చెత్తను వివిధ రూపాల్లో సేకరిస్తామని చెప్పారు. మున్సిపాలిటీల్లో పారిశుధ్య నిర్వహణ కోసం కంపాక్టర్లు, స్వీపింగ్ మెషీన్ల కొనుగోలు కోసం రూ.225 కోట్లు కేటాయించామని ప్రకటించారు. అవుట్ సోర్సింగ్ కార్మికుల సమ్మెపై మంత్రివర్గ ఉపసంఘంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి నారాయణ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
మాజీ ప్రధాని పీవీని స్మరించుకున్న చంద్రబాబు, లోకేష్
Phone Tapping: ఆ మెయిలే పట్టిచ్చింది!
Read Latest AP News And Telugu News