Minister Nara Lokesh: పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. మంత్రి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి
ABN , Publish Date - May 13 , 2025 | 12:44 PM
Road Accident: బొప్పాయి కాయల లోడుతో వెళ్తున్న మినీ ట్రాలీని లారీ ఢీకొంది. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలిస్తుండగా ఒకరు మృతిచెందారు. మృతులంతా ప్రకాశం జిల్లాకు చెందిన ఎర్రగొండపాలెం మండలం గడ్డమీదపల్లికి చెందిన వ్యవసాయ కూలీలుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
పల్నాడు జిల్లా: పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వినుకొండ మండలం శివాపురం వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వ్యవసాయ కూలీలను తరలిస్తున్న బొప్పాయి కాయల లోడు ఉన్న మినీ ట్రాలీని ఎదురుగా వస్తున్న లారీ వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మొదట ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా, తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురిని ఆస్పత్రికి తీసుకెళ్తున్న సమయంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన గ్రామస్తులు, స్థానికులను తీవ్ర ఆవేదనకు గురిచేసింది. ఈ ప్రమాదం మంగళవారం ఉదయం జరిగింది.
వీరు ప్రకాశం జిల్లాలోని ఎర్రకొండ పాలెం మండలం గడ్డమీద పల్లికి చెందిన వారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి సహాయక చర్యలు చేపట్టారు. మృతులంతా ఒకే గ్రామానికి చెందిన వారు కావడంతో ఆ గ్రామంలో తీవ్ర విషాద చాయలు అలుముకున్నాయి. కూలీల కుటుంబాలు కడు పేదరికంతో బాధపడుతున్నాయి. రెక్కాడితే డొక్కాడని పరిస్థితి వారిది. కుటుంబ సభ్యులు మృతిచెందడంతో ఆయా కుటుంబాలు తీవ్రశోకంలో మునిగిపోయాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం వినుకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది.
అయితే ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ పరారీలో ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు లారీని స్వాధీనం చేసుకున్నారు. స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. లారీ వేగంగా రావడంతోనే ఈ ప్రమాదం జరిగిందా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. వాహనాల రోడ్డు ఫిటెనెస్, డ్రైవర్ లైసెన్స్ విషయాలపై కూడా విచారణ చేపడతామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై మృతుల కుటుంబ సభ్యులు, స్థానిక ప్రజా ప్రతినిధులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆయా కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తగిన పరిహారం అందించాలని కోరారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని, ప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.
బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం: మంత్రి నారా లోకేష్
పల్నాడు జిల్లా వినుకొండ మండలం శివాపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతిచెందడం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్నివిధాలా అండగా నిలుస్తుందని తెలిపారు. రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వారికి శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని అన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు మంత్రి నారా లోకేష్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
AP Police Society Scam: భారీగా నిధుల దుర్వినియోగం.. బయటపడ్డ స్కాం
Gangamma Jatara: చిత్తూరులో ప్రారంభమైన గంగమ్మ జాతర వేడుకలు
Pawan Kalyan: ఎలుకలన్నీ ఘోషించినా వేస్ట్.. పవన్ షాకింగ్ ట్వీట్..
Sajjala Sridhar Reddy: సజ్జలను కస్టడీకి ఇవ్వండి
Nimmala Ramanaidu: నెలాఖరులోగా కాలువల మరమ్మతులు
For More AP News and Telugu News