Rains In AP: మళ్లీ భారీ వర్షాలు..
ABN , Publish Date - Nov 16 , 2025 | 05:12 PM
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో సోమవారం.. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి.
అమరావతి, నవంబర్ 16: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఆదివారం వెల్లడించింది. దీని ప్రభావంతో సోమవారం.. నెల్లూరు,తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అలాగే ప్రకాశం, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఏపీ ప్రజలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.
మరోవైపు అక్టోబర్ చివరిలో మొంథా తుపాన్ కారణంగా ఆంధ్రప్రదేశ్ చిగురుటాకులా వణికింది. ఈ తుఫాన్ కారణంగా.. భారీగా ఆస్తి నష్టం సంభవించింది. లక్షలాది హెక్టార్లలోని పంట నీట మునిగింది. దాంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన బృందం.. ఇప్పటికే మొంథా తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో పర్యటించింది. పంట నష్టంపై నివేదికను రూపొందించి కేంద్రానికి అందజేసింది.
శ్రీలంక సమీపంలో నైరుతి బంగాళాఖాతంలో శనివారం అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ వాయవ్యంగా పయనించి తమిళనాడు వైపు కదలనుంది. దీని ప్రభావంతో బంగాళాఖాతం నుంచి తూర్పుగాలులు తమిళనాడుతోపాటు దానికి ఆనుకుని దక్షిణ కోస్తా, రాయలసీమ వైపు వీస్తున్నాయి. ఆదివారం దక్షిణ కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయి. సోమవారం నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అతిభారీ, ప్రకాశం, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ భారీవర్షాలు కురుస్తాయి. ఇక 18వ తేదీన నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
అలాగే ఉత్తర కోస్తాలో పొడి వాతావరణం ఉంటుంది. మరోవైపు వాయవ్య భారతం నుంచి గాలులు కోస్తా, రాయలసీమ వరకు వీస్తుండడంతో చలి పెరిగింది. రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి ఆరు డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి. అరకులోయలో 7, డుంబ్రిగుడలో 7.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న రెండు రోజుల్లో చలిగాలులు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. కాగా, అల్పపీడనం రాగల 24గంటల్లో పశ్చిమ వాయవ్య దిశగా నెమ్మదిగా కదులుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అలాగే, ఈనెల 21న ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. దీని ప్రభావంతో ఈనెల 24-27 తేదీల మధ్య కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
ఈ వార్తలు కూడా చదవండి..
కుటుంబంలో కలహాలు తొలగాలంటే.. ఈ రోజు..
మాస్టార్‌ని ఆకాశానికెత్తిన నారా లోకేష్
For More AP News And Telugu News