Honor Killing In Guntur District: గుంటూరు జిల్లాలో మరో పరువు హత్య
ABN , Publish Date - Oct 12 , 2025 | 02:57 PM
గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో మరో పరువు హత్య జరిగినట్లు తెలుస్తోంది. ఈ తరహా హత్య జరిగిన కొద్ది రోజులకే మళ్లీ అదే కోవలో మరో ఘటన చోటు చేసుకోవడం ఆ ప్రాంతంలో కలకలం సృష్టిస్తోంది.
గుంటూరు, అక్టోబర్ 12: మంగళగిరి నియోజకవర్గంలో పరువు హత్య జరిగినట్లు అనుమానం వ్యక్తమవుతోంది. దుగ్గిరాల మండలం చిలుమూరులో దారుణం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన యువతి.. వేరే మతానికి చెందిన యువకుడిని ప్రేమించినట్లు సమాచారం. అయితే ఆ మతాంతర వివాహం ఆమె ఇంట్లోని వారికి ఇష్టం లేదని తెలుస్తోంది. ఆ క్రమంలో వేరే యువకుడితో వివాహం చేసేందుకు యువతి కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విషయం తెలిసిన ఆమె.. తన ప్రేమికుడితో వెళ్లిపోయేందుకు సిద్ధమైంది.
కుటుంబ సభ్యులు వెంటనే అప్రమత్తమై.. కుల్ డ్రింకులో కుమార్తెకు విషం కలిపించారని తెలుస్తోంది. దీనిని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు వారు ప్రయత్నించారనే చర్చ సాగుతోంది. తొలుత తెనాలి.. ఆ తర్వాత గుంటూరుకు యువతిని తరలించారు. అయితే తెనాలి ఆసుపత్రికి తరలించగా.. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఆ వెంటనే గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆ యువతి మరణించింది.
ప్రస్తుతం ఆమె మృతదేహం గుంటూరు జీజీహెచ్ మార్చురీలో ఉంది. యువతి అంత్యక్రియలకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరో వైపు పరువు హత్య అంటూ ప్రచారం జరగడంతో.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులో భాగంగా యువతి తల్లిదండ్రులను పోలీసులు విచారిస్తున్నారు. తమ కుమార్తె గత కొన్ని రోజులుగా తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతుందని.. ఆ క్రమంలో పురుగుల మందు తాగిందని పోలీసుల విచారణలో వారు వెల్లడించినట్లు తెలుస్తోంది. ఈ విచారణ కొనసాగుతోంది.
ఇంకోవైపు.. దుగ్గిరాల మండలంలో ఇటీవల ప్రేమ వివాహం జరిగింది. దీంతో ప్రేమ వివాహం చేసుకున్న యువకుడిని యువతి అన్న దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. తాజాగా అదే దుగ్గిరాల మండలంలో మరో ఘటన చోటు చేసుకుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
జగన్ స్కాంలని బయటపెడతాం.. మంత్రి లోకేష్ స్ట్రాంగ్ వార్నింగ్
రెచ్చిపోయిన కానిస్టేబుల్ దంపతులు.. పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు
For More AP News And Telugu News