10 Students Suffer Hunger: ఆకలితో నకనక.. సాయంత్రాలు ఖాళీ కడుపుతో పది విద్యార్థుల అవస్థలు
ABN , Publish Date - Dec 28 , 2025 | 01:59 PM
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థుల బాధలు అగమ్యగోచరంగా మారాయి. ఉదయం ఎనిమిది గంటలకు పాఠశాలకు వస్తే మరలా సాయంత్రం 6 గంటలకే ఇంటికి వెళ్లేది. మధ్యాహ్న భోజనం చేశాక దాదాపు 7 గంటలపాటు విద్యార్ధులు పాఠశాలలో గడపాల్సి వస్తోంది. ఫలితంగా సాయంత్రం నాలుగు తర్వాత నుంచి అనేక పాఠశాలల్లో విద్యార్థులు ఆకలితో అలమటించిపోతున్నారు.
గుంటూరు, డిసెంబరు 28: ఉమ్మడి జిల్లాల్లో ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులు సుమారు 68వేల మందికి పైగా ఉన్నారు. జిల్లా పరిషత్, ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో చదివే విద్యార్థులు దాదాపు 35వేల మందికిపైగా ఉన్నట్లు సమాచారం. ఈ విద్యార్థులంతా పేద, బడుగు, బలహీనవర్గాలకు చెందినవారే. ఉదయం ఇంట్లో ఏదో అల్పాహారం లేదా సద్దన్నం తిని పాఠశాలకు వస్తారు. మధ్యాహ్నం పాఠశాలల్లో పెట్టే భోజనం తర్వాత.. సాయంత్రం 7 గంటల వరకు వారు పాఠశాలల్లో ఉండాల్సి వస్తోంది. స్టడీ అవర్స్, స్లిప్ టెస్ట్‌లు, సబ్జెక్టుకు సంబంధించిన వీడియోలు చూడటం, ఇతర హోంవర్కులు, గణితం సబ్జెక్టులో ముఖ్యమైన లెక్కలు సాధన చేయడం వంటి పనులతో సాయంత్రం 7 గంటల వరకు పాఠశాలల్లోనే ఉండాల్సి వస్తోంది. ఈ సమయంలో అనేక మంది విద్యార్థులు ఆకలితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కొద్దిపాటి ఆర్థిక స్తోమత ఉన్న విద్యార్థులు సాయంత్రం 4 గంటల తర్వాత బయట అల్పాహారం చేసి వస్తున్నారు. మిగిలిన వారు మాత్రం ఆకలితో అలమటిస్తున్నారని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి.. ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదివే విద్యార్థులకు ఏటా సాయంత్రం పూట అల్పాహారం పంపిణీ చేస్తోంది ప్రభుత్వం. జిల్లా పరిషత్, స్థానిక సంస్థల నుంచి సంబంధిత నిధులను విడుదల చేస్తారు. ఈ సొమ్ముతో సాయంత్రం పూట ఇడ్లీ, ఉప్మా, పునుగులు, గుగ్గిళ్లు, అరటికాయలు వంటివి విద్యార్థులకు పంపిణీ చేసేవారు. అయితే.. ఈ ఏడాది డిసెంబరు చివరకు వచ్చినా అల్పాహార పంపిణీ విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదని ఉపాధ్యాయులు ఆందోళన వాపోతున్నారు. కొన్నిచోట్ల విద్యార్థుల బాధలు చూడలేక ఉపాధ్యాయులే సొంత నిధులతో అల్పాహారం అందిస్తున్నారు.
కాలే కడుపులతో ఎలా.!
సర్కారు పాఠశాలల్లో నూరు శాతం ఫలితాల కోసం పాఠశాల విద్యాశాఖ పటిష్ఠమైన ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందులో భాగంగా వంద రోజుల ప్రణాళిక పేరుతో ప్రత్యేకంగా స్టడీ అవర్స్, స్లిప్ టెస్ట్‌లు, ఇతర అసైన్‌మెంట్లు నిర్వహిస్తున్నారు. దీంతో ఒకవిధంగా విద్యార్థులు ఒత్తిడికి గురవుతున్నట్లు ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఇదే సమయంలో వారు శారీరకంగా ఇబ్బందులు పడకుండా ఉండాలంటే అల్పాహారం తప్పనిసరిగా అందించాల్సి ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. కాలే కడుపులతో విద్యార్థులు చదువులు సక్రమంగా సాగే అవకాశం ఉండదని వైద్యులు కూడా స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, కూటమి ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు స్పందించి ప్రభుత్వ పాఠశాలలో చదివే పదో తరగతి విద్యార్థులకు అల్పాహారం అందించే దిశగా చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇవీ చదవండి: