Araku Vally: వరుస సెలవులతో అరకుకు పోటెత్తిన పర్యాటకులు
ABN , Publish Date - Dec 28 , 2025 | 12:26 PM
వరుస సెలవుల నేపథ్యంలో అరకు వ్యాలీని సందర్శించేందుకు జనం ఎగబడుతున్నారు. దీంతో సమీపంలోని పలు ప్రాంతాల్లో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.
విశాఖపట్నం, డిసెంబర్ 28: ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన కుగ్రామం, పర్యాటక ప్రదేశమే అరకు వ్యాలీ(Araku Valley). ఇది విశాఖకు సుమారు 114 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ సముద్ర మట్టం నుంచి 900 మీటర్ల ఎత్తులో ఉండి అణువణువూ ప్రకృతి రమణీయతతో విలసిల్లుతున్న తూర్పు కనుమలలోని అద్భుత పర్వత శ్రేణి ఉంది. విశాఖ నుంచి అరకు చుట్టివచ్చే ప్రయాణం ఓ అందమైన అనుభూతినిస్తుంది.
అయితే.. వరుస సెలవులతో పర్యాటకుల రద్దీ పెరగడం, ఘాట్ రోడ్లపై ట్రాఫిక్ సమస్యలు తలెత్తడంతో అరకు వెళ్లే మార్గంలో ఎక్కడి వాహనాలు అక్కడే స్తంభించిపోతున్నాయి. నిత్యం.. సుమారు అర కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోతున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీంతో అరకు ఘాట్ రోడ్డును ఒకవైపు మూసివేశారు అధికారులు. ప్రయాణికులు, టూరిస్టుల రద్దీ అధికంగా ఉండటంతో అరకు నుంచి విశాఖ వెళ్లే వాహనాలపై నిషేధం విధించి.. కేవలం విశాఖ నుంచి అరకు వెళ్లే వాహనాలనే అనుమతిస్తున్నారు. ప్రత్యామ్నాయంగా.. అరకు నుంచి విశాఖ వెళ్లేప్రయాణికులు పాడేరు మీదుగా వెళ్లాలని పోలీస్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో వాహనదారులు, టూరిస్టులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
ఇక.. పద్మాపురం గార్డెన్, ట్రావెల్ మ్యూజియం, చాపురాయి ప్రాంతాలు పర్యాటకులతో కిక్కిరిసిపోతున్నాయి. సందర్శకులు పెద్దఎత్తున తరలిరావడంతో రూములు కూడా దొరకని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఉడెన్ బ్రిడ్జి సందర్శన వేళల్లో మార్పులు చేశారు అధికారులు.
ఇవీ చదవండి: