Share News

Fake Propaganda: శాడిస్టు సైకోలు.. అంతా తప్పుడు ప్రచారమే..

ABN , Publish Date - Aug 19 , 2025 | 04:07 AM

ఒకవైపు జగన్‌ రోత మీడియా... మరోవైపు వైసీపీ సోషల్‌ మీడియా! తప్పుడు ప్రచారాలతో, అసత్యాలు, అర్ధసత్యాలు, వక్రీకరణలతో రెచ్చిపోతున్నాయి. రాజధాని అమరావతి మొదలుకొని విశాఖలో...

Fake Propaganda: శాడిస్టు సైకోలు.. అంతా తప్పుడు ప్రచారమే..
YS Jagan

  • ఫేక్‌ ప్రచారంతో రెచ్చిపోతున్నారు

  • జగన్‌ రోత పత్రికలో తప్పుడు రాతలు

  • సోషల్‌ మీడియాలో కుళ్లు పోస్టులు

  • పొలాల్లో నీరు చూపి అమరావతి మునకంటూ ప్రచారం

  • బెంగాల్‌ రిగ్గింగ్‌ వీడియోకు పులివెందులతో ముడి

  • ఏ అంశాన్నీ వదలకుండా అసత్యాలు, వక్రీకరణలు

  • కూటమి నేతలు, కుటుంబ సభ్యులపైనా దాడి

  • ఫేక్‌ ప్రచారంలో భాగమవుతున్న ఉద్యోగులు

  • కఠినంగా వ్యవహరించకుంటే తీవ్ర నష్టమే!

అక్కడెక్కడో, అప్పుడెప్పుడో ఎన్నికల్లో రిగ్గింగ్‌ చేస్తున్న వీడియో దొరికిందా? దానిని ఒంటిమిట్ట, పులివెందుల జడ్పీటీసీ పోలింగ్‌కు ముడిపెట్టేయడమే!

వాగులో నీరు పొంగిందా? అయితే... ఒక ఊరు మొత్తం మునిగిందని హోరెత్తించడమే!

రాజధాని ప్రాంతంలో భారీ వర్షాలకు పొలాల్లో నీరు నిలబడిందా? ఇంకేముంది... ‘వరదలో మునిగిపోయిన అమరావతి’ అని సంబరాలు చేసుకోవడమే!

ప్రకాశం బ్యారేజీకి ఉన్న 70 గేట్లలో ఒక్కటి మొరాయించి, మిగిలిన 69 గేట్ల ద్వారా వరదనీరు స్వేచ్ఛగా దిగువకు పోతున్నా సరే... ‘పనిచేయని గేటు... విజయవాడ మునిగిపోతుంది’ అని బెంబేలెత్తించడమే!

వైసీపీ సోషల్‌ సైకో బ్యాచ్‌ మళ్లీ రెచ్చిపోతోంది! ‘కాదేదీ తప్పుడు ప్రచారానికనర్హం’ అంటూ పెట్టుబడులు, వర్షాలు, ఎన్నికలు ఇలా ప్రతి అంశాన్నీ బురదచల్లేందుకు వాడుకుంటోంది. అసత్యాలు, అర్ధసత్యాలు, వక్రీకరణలతో జగన్‌ రోత మీడియా తప్పుడు కథనాలను ప్రచురించడం... వాటిని అందుకుని సైకో బ్యాచ్‌ సోషల్‌ మీడియాలో హోరెత్తించడం! మార్ఫింగ్‌, ఏఐ ఫొటోలతో కూటమి నేతల కుటుంబ సభ్యుల వ్యక్తిత్వ హననానికి దిగడమూ పెరిగిపోయింది.

అమరావతి మునిగిపోయిందంటూ... వ్యంగ్య వ్యాఖ్యలు జోడిస్తూ సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టిన సుభాష్‌ చంద్రబోస్‌ తిరుపతిలో వాణిజ్య పన్నుల శాఖ అధికారిగా పని చేస్తున్నారు. ‘అమరావతి కోసం మూడు రిజర్వాయర్లు ఎందుకు? అమరావతినే రిజర్వాయర్‌గా కడితే పోలా?’ అంటూ మరో పోస్టు పెట్టారు. వైసీపీ అధికారంలో ఉండగా... ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాలంటేనే గజగజ వణికిపోయేవారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అప్రకటిత ఎమర్జెన్సీనే. మరి ఇప్పుడో..!?


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

ఒకవైపు జగన్‌ రోత మీడియా... మరోవైపు వైసీపీ సోషల్‌ మీడియా! తప్పుడు ప్రచారాలతో, అసత్యాలు, అర్ధసత్యాలు, వక్రీకరణలతో రెచ్చిపోతున్నాయి. రాజధాని అమరావతి మొదలుకొని విశాఖలో పెట్టుబడుల దాకా ప్రతి అంశంపైనా బురదజల్లడమే పనిగా పెట్టుకున్నాయి. తాము చెప్పేది అబద్ధమని తెలిసీ... ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయి. ‘ఇదీ అసలు నిజం’ అని ప్రభుత్వం పదేపదే చెబుతున్నా... తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నాయి.

మాజీ మంత్రులే...

ఇటీవల జరిగిన పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల్లో ఘోరపరాజయంతో వైసీపీ నేతలు అసత్య ప్రచారాలను మొదలుపెట్టారు. మాజీ మంత్రి, సీనియర్‌ నేత అంబటి రాంబాబు స్వయంగా ఈ దుష్ప్రచారంలో భాగం కావడం గమనార్హం. ఎక్కడో పశ్చిమ బెంగాల్‌లో జరిగిన పోలింగ్‌ వీడియోను చూపిస్తూ పులివెందులలో దొంగ ఓట్లు వేస్తున్నారంటూ అంబటి ప్రచారం చేశారు. పశ్చిమ బెంగాల్‌లో ఉపయోగించిన బ్యాలట్‌ రంగు, పులివెందులలో ఉపయోగించిన బ్యాలట్‌ రంగు వేర్వేరుగా ఉండటంతో ఇది ఫేక్‌ వీడియోగా నిర్ధారణ అయ్యింది. టీడీపీ నేతలు ఎదురుదాడి చేయడంతో వైసీపీ నేతలు అభాసుపాలయ్యారు. ఒంటిమిట్టలో టీడీపీ నేతలు డబ్బులు పంచుతున్నారంటూ వైసీపీ చూపిన వీడియో కూడా బిహార్‌లో చిత్రీకరించిందే!

Untitled-3 copy.jpg


మతపరమైన ఉద్రిక్తతలను రెచ్చగొట్టేలా...

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ రాష్ట్రంలో మతపరమైన, కులపరమైన ఉద్రిక్తతలను రెచ్చగొట్టేందుకు వైసీపీ బ్యాచ్‌ ప్రయత్నిస్తోంది. గతంలో శ్రీవారి పింక్‌ డైమండ్‌ను చంద్రబాబు ఎత్తుకెళ్లారని ఫేక్‌ ప్రచారం చేసిన వైసీపీ తాజాగా రాష్ట్రంలో ఏ సంఘటన జరిగినా దాన్ని మతపరమైన ఉద్రిక్తతలను రెచ్చగొట్టేందుకు ఉపయోగించుకునేందుకు ప్రయత్నిస్తోంది. పాస్టర్‌ ప్రవీణ్‌ మృతి, తిరుపతిలోని గోశాలలో ఆవులు చనిపోవడం, తిరుమల క్యూలైన్లలో ఆకలిదప్పులతో భక్తులు అల్లాడిపోతున్నారనడం... ఇలా ప్రతి అంశంపై విషం చిమ్మే ప్రయత్నం చేసింది. తాజాగా బస్సులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి తన మతాన్ని సూచించే టోపీ చేతిలో పెట్టుకుంటే, పక్కనే ఉన్న వ్యక్తి ఎందుకు అలా పెట్టుకున్నావని అడిగినట్లు.. టోపీ పెట్టుకుంటే బస్సులో నుంచి గెంటేస్తారని ఆ వ్యక్తి చెబుతున్న వీడియోను సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తోంది. రాష్ట్రంలో ముస్లింలు స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేదంటూ వైసీపీ విషప్రచారం చేస్తోంది. కొందరు యూట్యూబర్లు చిత్రీకరించిన ఈ వీడియోను వైసీపీ తమ ఫేక్‌ ప్రచారానికి అస్త్రంగా వాడుకోవడం గమనార్హం.

కూటమి నేతల వ్యక్తిత్వ హననం

కూటమి నేతలు లోకేశ్‌, బాలకృష్ణ, పవన్‌ కల్యాణ్‌ తదితరులతో పాటు వారి కుటుంబ సభ్యులనూ కించపరిచే పోస్టులూ ఇటీవల పెరిగిపోయాయి. సామాజిక మాధ్యమాల్లో ఫేక్‌ ఐడీలతో మహిళల మార్ఫింగ్‌ ఫొటోలతో అసభ్యకరమైన పదజాలంతో ఈ దుష్ప్రచారం చేస్తుండటం గమనార్హం. సీఎం సతీమణి, భువనేశ్వరి, లోకేశ్‌ సతీమణి బ్రాహ్మణిల మార్ఫ్‌డ్‌ ఫొటోలను పెట్టి విషప్రచారం చేస్తున్నారు.


మొదటి నుంచీ అదే తంతు..

వైసీపీ తొలి నుంచీ ఫేక్‌ ప్రచారాన్నే నమ్ముకుంది. 2014-19 మధ్య ఐ-ప్యాక్‌ డైరెక్షన్‌లో పెద్ద ఎత్తున విషప్రచారం చేసి అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాతా ఫేక్‌ ప్రచారాన్ని వీడలేదు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో తమకు వ్యతిరేక తీర్పులు ఇచ్చిన హైకోర్టు జడ్జీలపై తప్పుడు ప్రచారం చేశారు. జస్టిస్‌ ఎన్‌వీ రమణ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులు కాకుండా ఆయనపై తప్పుడు లేఖలు రాశారు. ఇప్పుడు అధికారం కోల్పోయినా ఫేక్‌ బుద్ధులు మారలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లో వైసీపీ హయాంలో రెచ్చిపోయిన సోషల్‌ మీడియా ఫేక్‌ ఐడీలను చాలా వరకు నియంత్రించారు. ఫేక్‌ ప్రచారాలు చేసే వారిపై కఠినంగా వ్యవహరించడం మొదలుపెట్టారు. సొంత పార్టీకి చెందిన వారైనా వదలకుండా కూటమి పెద్దలు కేసులు పెట్టడంతో చాలా వరకు ఫేక్‌ ప్రచారాలకు తెరపడింది. తాజాగా మళ్లీ వైసీపీ అనుకూల మీడియా ఫేక్‌ ప్రచారాలతో రెచ్చిపోతోంది. కూటమి ప్రభుత్వం ఇలాంటి బ్యాచ్‌లపై కఠినంగా వ్యవహరించకపోతే రాజకీయంగా నష్టం జరగడమే కాదు, రాష్ట్రాభివృద్ధి కూడా దెబ్బతినే ప్రమాదముంది!

పెట్టుబడులపైనా అక్కసు

అధికారంలో ఉండగా పెట్టుబడిదారులను బెదిరించి, భయపెట్టిన వైసీపీ నేతలు... ఇప్పుడు వస్తున్న పెట్టుబడులపైనా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. టీసీఎ్‌సకు విశాఖలో భూములు కేటాయిస్తే దానిపై ఫేక్‌ ప్రచారం చేయడమే కాకుండా తమకు అనుకూలమైన వ్యక్తులతో కోర్టుల్లో కేసులు వేయించారు. పిటిషన్‌ వేసిన వారిని కోర్టు తప్పుపట్టినా వైసీపీ తప్పుడు ప్రచారం మాత్రం ఆగడం లేదు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించే ‘స్త్రీశక్తి’ పథకంపైనా వైసీపీ మీడియా ఫేక్‌ ప్రచారం చేస్తోంది. వైసీపీ అనుకూల మహిళలను ఉచిత పరిధిలోకి రాని డీలక్స్‌ బస్సులు, ఏసీ బస్సుల్లోకి ఎక్కించి, తమకు ‘ఫ్రీటికెట్‌’ ఇవ్వలేదని, తమను చంద్రబాబు మోసం చేశారంటూ తిట్టిపోయిస్తున్నారు.


వరదలనూ వదల్లేదు..

ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో కొద్దిరోజులుగా కృష్ణా నదికి వరద పోటెత్తుతోంది. గుంటూరు, కృష్ణా జిల్లాల్లోనూ భారీగానే వర్షాలు కురిశాయి. ఇదే అదునుగా వైసీపీ ఫేక్‌ ప్రచారానికి తెరదీసింది. రాజధానిపై తమ అక్కసునంతా వెళ్లగక్కుతూ వరదలకు రాజధాని మునిగిపోయిందంటూ సొంత మీడియాతోపాటు అనుకూల మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారానికి తెరదీశారు. రాజధాని ప్రాంతంలో కట్టడాలున్న ప్రాంతంలో ఒక్క చుక్క నీరు కూడా నిలవలేదు. ఖాళీ స్థలాలు, పొలాల్లో మాత్రం వర్షపు నీరు నిలిచింది. పంట పొలాల్లో వర్షపు నీరు చేరడం అత్యంత సహజం. ఇలా నిలిచిన నీళ్లను, దూరంగా ఉన్న కట్టడాలను కలిపి ఫొటో తీసి... ‘అమరావతి మునిగిపోయింది’ అని సైకోల్లా సంబరాలు చేసుకుంటున్నారు. రాజధాని ప్రాంతంలో ప్రస్తుతం రూ.52వేల కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఇది జీర్ణించుకోలేకనో... అమరావతిపై అక్కసుతోనో... రాజధాని మునిగిపోయిందంటూ ఫేక్‌ ఫొటోలు, మార్ఫింగ్‌ ఫొటోలతో ప్రచారం చేయడం ప్రారంభించారు. హైదరాబాద్‌లో ఉన్న కొంతమందితో అమరావతి మొత్తం మునిగిపోయిందంటూ డిబేట్లు పెట్టి మరీ దుష్ప్రచారం చేస్తున్నారు. ఇక అమరావతిని వరద నుంచి కాపాడేందుకు... గుంటూరు చానల్‌ నీటిని మళ్లించి పొన్నూరును ముంచేశారని మరో తప్పుడు ప్రచారానికి తెరలేపారు. అసలు గుంటూరు కాలువకు నీరే విడుదల చేయలేదని అధికారులు తేల్చి చెప్పి... ఈ ఫేక్‌ ప్రచారంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు ప్రకాశం బ్యారేజీ గేటు దెబ్బతినిందని, ఈ కారణంగా బ్యారేజీ మనుగడకే ముప్పు పొంచి ఉందని, ఏ క్షణాన్నైనా బ్యారేజీ గేట్లు కొట్టుకుపోయి విజయవాడ మునిగిపోతుందంటూ వైసీపీ అనుకూల మీడియా ప్రచారం చేసింది. 2009 సెప్టెంబరులో ప్రకాశం బ్యారేజీకి 11.06 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చింది. అయినా బ్యారేజీ చెక్కుచెదరలేదు. ప్రస్తుతం అందులో నాలుగో వంతు కూడా వరద లేదు. అయినా బ్యారేజీపై నీలి మీడియా దుష్ప్రచారం చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి:

HYD Rain Alert: దంచికొడుతున్నవర్షాలు.. హైదరాబాద్ అస్తవ్యస్తం..

Gold Rates: గుడ్‌న్యూస్.. స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

Updated Date - Aug 19 , 2025 | 08:16 AM